Asaduddin Owaisi: హైడ్రా కూల్చివేతలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు..
ABN, Publish Date - Aug 25 , 2024 | 04:10 PM
హైడ్రా.. ఇప్పుడీ పేరు ఎవరినోట వచ్చినా, ఎక్కడైనా చూసినా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడు తమవంతు వస్తుందో.. బుల్డోజర్ ఏ టైమ్‌లో వచ్చి ఇంటి మీద పడుతుందో అని కబ్జాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి..! శభాష్ అంటూ సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకూ హైడ్రా పనితీరును, రేవంత్ సర్కార్‌ను మెచ్చుకుంటూ ఉండగా..
హైదరాబాద్ : హైడ్రా.. ఇప్పుడీ పేరు ఎవరినోట వచ్చినా, ఎక్కడైనా చూసినా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడు తమవంతు వస్తుందో.. బుల్డోజర్ ఏ టైమ్‌లో వచ్చి ఇంటి మీద పడుతుందో అని కబ్జాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి..! శభాష్ అంటూ సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకూ హైడ్రా పనితీరును, రేవంత్ సర్కార్‌ను మెచ్చుకుంటూ ఉండగా.. అంతకుమించి వ్యతిరేకత, విమర్శలు సైతం వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రజా ప్రతినిధుల నుంచి హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) ను తీసేయాలనే డిమాండ్ సైతం వస్తోంది. రోజులో పదుల సంఖ్యలో కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తూనే ఉంది. ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపీకి (Asaduddin Owaisi) చెందిన మహిళా కాలేజీ సల్కం చెరువు ఆక్రమణలో.. ఓవైసీ ఆస్పత్రి, రిసెర్చ్ సెంటర్ ఓవైసీ, డీఎంఆర్ చెరువులకు దగ్గరలో ఉందని హైడ్రా వీటిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటుందనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తోంది. ఈ క్రమంలో మొత్తం హైడ్రా వ్యవహారంపై అసదుద్దీన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాటి సంగతేంటి..!?
‘ కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా? నెక్లెస్‌రోడ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది.. నెక్లెస్‌రోడ్‌ను కూడా తొలగిస్తారా?. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నాలాపై నిర్మించారు.. జీహెచ్‌ఎంసీ కార్యాలయం (GHMC Office) పరిస్థితేంటి?. ప్రభుత్వ కార్యాలయాలు చాలా చోట్ల ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయి. గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్టు ఉంది. ఆ గోల్ఫ్ కోర్టులో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడుతారు. అక్కడికి వెళ్లి చూడండి.. లేదంటే నేను ఫోటోలు కావాలంటే నేను ఇస్తాను. ఎఫ్‌టీఎల్ సమస్యపై మేయర్‌ను కలిసి చెప్పాను.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తాను’ అని అసదుద్దీన్ హాట్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. ‘వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశ పెడుతుంది. ముస్లీంలను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోంది. మజీద్లు, దర్గాల లాగే వక్ఫ్ ఆస్తులు కూడా ప్రభుత్వ ప్రాపర్టీ కాదు. ఎప్పటి నుంచో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీలకు డీడ్ ఎలా ఉంటుంది. మక్కా మసీద్‌కు డీడ్ కావాలంటే ఎక్కడ తేవాలి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
తగ్గేదేలే..!
ఇదిలా ఉంటే.. శ్రీకృష్ణుడి గీతాబోధన అనుసారమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారున్నారని.. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండవచ్చని.. వారెవరిని పట్టించుకోనన్నారు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గకుండా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని రేవంత్ క్లియర్ కట్‌గా చెప్పేశారు. కాగా.. భాగ్యనగరంలో జలవనరులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించటమే ధ్యేయంగా సాగుతున్న హైడ్రా సంచలనాలకు కేరాఫ్‌గా మారింది.
రిపోర్ట్ రె‘ఢీ’..!
గత నెల రోజులుగా నగర వ్యాప్తంగా పలు ఆక్రమిత స్థలాల్ని కబ్జాసురుల చెర నుంచి విడిపిస్తున్న హైడ్రా ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై ఆదివారం రిపోర్ట్ రెడీ చేసింది. భాగ్యనగరంలో మొత్తంగా18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా తన నివేదికలో స్పష్టం చేసింది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డికి చెందిన నిర్మాణాలు నేలమట్టం చేసినట్లు వివరించింది. కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. లోటస్పాండ్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజులరామారం, మన్సూరాబాద్, అమీర్పేట్ ఏరియాలలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపింది. ఈ క్రమంలో మీడియా మీట్ నిర్వహించిన అసదుద్దీన్ పాత విషయాలన్నీ బయటికి తీశారు.
Updated Date - Aug 25 , 2024 | 04:16 PM