Raghuram Cements: హే రఘురాం!
ABN, Publish Date - Oct 29 , 2024 | 04:26 AM
నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ సంపాదించిన అక్రమాస్తుల్లో రఘురాం సిమెంట్స్ ముఖ్యమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కడప జిల్లాలో ఈ కంపెనీకి
తండ్రి సీఎంగా ఉన్నప్పుడు 2006లో జగన్ చేతికి రఘురాం సిమెంట్స్
కడపలో అడ్డగోలుగా 2 వేల ఎకరాల సున్నపురాయి గనులు లీజుకు
జగన్ పెట్టుబడి 45 కోట్లే.. 2008 నాటికి ఆ విలువ 6,500 కోట్లు
భారతి సిమెంట్స్‌గా మార్పు.. ప్రస్తుత వాటా 20 వేలకు కోట్లకు పైనే
తండ్రి అధికారం అండగా క్విడ్ ప్రోకో!.. గతంలో సీబీఐ తీవ్ర అభియోగాలు
దాల్మియాకు 1017 ఎకరాల గనులు లీజుకు.. ప్రతిఫలంగా భారతిలో 50 కోట్ల పెట్టుబడి
(అమరావతి-ఆంధ్రజ్యోతి): నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ సంపాదించిన అక్రమాస్తుల్లో రఘురాం సిమెంట్స్ ముఖ్యమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కడప జిల్లాలో ఈ కంపెనీకి దాదాపు 2 వేల ఎకరాల గను లు కేటాయించారు. కడప జిల్లాలో అప్పటికే ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన గుజరాత్ అంబూజా సిమెంట్స్ లిమిటెడ్‌ను బలవంతంగా పక్కకు తప్పించి మరీ కట్టబెట్టారు. ఎవరో స్థాపించిన కంపెనీకి జగన్ యజమాని అయ్యారు. నాడు తనయుడి కోసం వైఎస్ అడ్డదారులు తొక్కగా, జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడి పెట్టుబడులు పెట్టించుకున్నారు. కడప జిల్లాలోనే దాల్మియా సిమెంట్స్‌కు వెయ్యి ఎకరాల సున్నపురాయి గనులు లీజుకు ఇచ్చి ప్రతిఫలం పొందారు. భారతి సిమెంట్స్‌లో దాల్మియా 50 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇలా స్వల్ప వ్యవధిలోనే జగన్ వేల కోట్లు సంపాదించారు. ఇదేదో జగన్‌కు గిట్టనివారు, ప్రత్యర్థి పార్టీలు చెబుతున్న మాట కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నాడు జగన్ అక్రమాస్తుల కేసులో దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్న అంశాలివీ. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే 2008లో రఘురాం సిమెంట్స్ పేరును భారతి సిమెంట్స్‌గా మార్చేశారు.
45 కోట్ల నుంచి 6,500 కోట్లకు
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ అక్రమాస్తులను భారీగా సంపాదించారు. జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కట్టేవా రు. ఆయన పెట్టుబడిగా పూచిక పుల్ల పెట్టినా.. బంగారం అయ్యేది. అంతా క్విడ్ ప్రోకో వ్యవహారం అన్నమాట. వైఎస్ ప్రభుత్వంలో ‘మేళ్లు’ పొందినవారు జగన్‌కు లబ్ధి చేకూర్చడానికి ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు. రఘురాం సిమెంట్స్ వ్యవహారం కూడా ఇలాంటిదే. రఘురాం సిమెంట్స్‌ను 1999లో స్థాపించారు. వైఎస్ సీఎం అయ్యాక 2006లో ఈ కంపెనీ జగన్ చేతికి వచ్చింది. ఈ కంపెనీలో జగన్ అండ్ కో పెట్టిన పెట్టుబడి కేవలం రూ.45 కోట్లే. అయితే రెండేళ్లలోనే కంపెనీలో వాటాల విలువ ఏకంగారూ.6,500 కోట్లకు చేరింది. కంపెనీలో ఒక్కొక్కటి రూ.10 ముఖ విలువ కలిగిన ఐదున్నర కోట్ల షేర్లు ఉండగా... ఇందులో 82 శాతం వాటాకు జగన్ అండ్ కో కేవలం రూ.45 కోట్లు సమకూర్చగా... మిగిలిన 18 శాతం వాటాకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడి మొత్తం రూ.129 కోట్లు. దాల్మియా సిమెంట్స్, మ్యాట్రిక్స్ నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన జీ2 కార్పొరేట్ సర్వీసెస్ దాదాపు రూ.112 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
నిమ్మగడ్డ ప్రసాద్ వ్యక్తిగత హోదా లో మరో రూ.8 కోట్లు పెట్టారు. దాల్మియా సిమెంట్స్ 2007 మార్చి 29వ తేదీన 16.66 లక్షల షేర్లను ఒక్కోదాన్ని రూ.110 ముఖ విలువకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరోసారి 2008 ఫిబ్రవరి 26న దాల్మియా 1,37,931 షేర్లను ఒక్కోదాన్ని రూ.1440 చొప్పున కొనుగోలు చేసింది. ఏడాదిలోనే షేర్ విలువ ఏకంగా 13 రెట్లు పెరిగింది. ఇటు రఘురాం సిమెంట్స్‌లో అధిక ధరలకు షేర్లు కొంటూనే... అదే సమయంలో జగన్ కంపెనీకి సమీపంలో దాల్మియా కూడా సిమెంట్ కంపెనీని స్థాపించింది. ఇదే గమ్మత్తైన విషయం. దీని వెనుక క్విడ్ ప్రోకో జరిగిందన్నది ఆరోపణ. 2007 ఏప్రిల్ 9వ తేదీన జీ2 కార్పొరేట్ సంస్థకు రూ.94 చొప్పున 64.42 లక్షల షేర్లను జగన్ కేటాయించారు. 2007 సెప్టెంబరులో ఇండియా సిమెంట్స్ రూ.110 చొప్పున 12.5 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. మరో 2 నెలలకు నిమ్మగడ్డ రూ.175 చొప్పున 4.59 లక్షల షేర్లను కొన్నారు. ఇలా భారీ ధరలకు షేర్లు కొనుగోలు చేయడంతో కంపెనీ విలువ, జగన్ వాటా అమాంతం పెరిగిపోయాయి. రఘురాం/భారతి సిమెంట్స్ ప్రధాన ప్రమోటర్ జగన్, ఆయన స్నేహితులు, బంధువుల వాటా విలువ 2008 నాటికి ఏకంగా రూ.6,500 కోట్లకు చేరింది. ఇటు నాడు రఘురాం సిమెంట్స్‌కు గనుల శాఖ రెడ్‌కార్పెట్ పరచిమరీ కడప జిల్లాలో 2000 ఎకరాల సున్నపురాయి నిక్షేపాలను కట్టబెట్టింది.
ఏ1 జగన్.. ఏ2 విజయసాయి
రఘురాం/భారతి సిమెంట్స్ కేసులో సీబీఐ ఏ1గా జగన్‌ను, ఏ2గా విజయసాయిరెడ్డిని చేర్చింది. ఇదే కేసులో నాటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్, జగన్ సన్నిహితుడు జేజే రెడ్డి, పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి కృపానందం నిం దితులని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది.
ఈశ్వర్ సిమెంట్స్ నుంచి దాల్మియాకు
కడప జిల్లా నవాబుపేట, తాలమంచిపట్నం గ్రామాల్లోని 1017 ఎకరాల సున్నపురాయి నిక్షేపాల ప్రాస్పెక్టింగ్ లీజు కోసం 1997లో జయా మినరల్స్ గనుల శాఖకు దరఖాస్తు చేసుకుంది. అయితే దీన్ని గనుల శాఖ తిరస్కరించింది. 2004లో సీఎంగా వైఎస్ బాధ్యతలు స్వీకరించాక ఈ ఫైలుకు రెక్కలు వచ్చాయి. కంపెనీ ఆర్థిక స్థోమతను వివరిస్తూ సమాచారం ఇవ్వాలంటూ జయా మినరల్స్‌కు గనుల శాఖ లేఖ రాసింది. దీంతో జయా మినరల్స్ గనుల శాఖ లేఖకు వెంటనే స్పందించింది. ఈ కంపెనీకి ప్రాస్పెక్టింగ్ లీజు మంజూరు చేయాలని కోరుతూ గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్ ఫైలు పంపారు. ఈ సంస్థ కు ప్రాస్పెక్టింగ్ లీజు ఇవ్వాలంటే కచ్చితంగా ఈశ్వర్ సిమెంట్స్‌కు లీజు భూములు బదిలీ చేయాలంటూ రాజగోపాల్ షరతు విధించారు. జయా మినరల్స్‌కు అనుబంధ సంస్థ అయినప్పటికీ ఈశ్వర్ మినరల్స్ పేరిట లీజు మంజూరు చేయడం కుదరదని అప్పటి గనుల శాఖ సంయుక్త కార్యదర్శి పేర్కొన్నారు.
అయినా ఈశ్వర్ సిమెంట్స్‌కు ప్రాస్పెక్టింగ్ లీజు ఇవ్వాలని ప్రతిపాదిస్తూ రాజగోపాల్ నోట్‌ఫైల్‌ను పంపారు. ఈ నోట్ ఫైల్‌కు గనుల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి ఆమోద ముద్ర వేశారు. గనుల శాఖ మంత్రి కూడా ఓకే చేశారు. 2006 జూలై 14న తొలుత జయా మినరల్స్‌కు.. తర్వాత మరో జీవో నంబరుతో ఈశ్వర్ సిమెంట్స్‌కు గనులు కేటాయిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. లీజు పొందనున్న ప్రాంత సమీపంలోనే ఈశ్వర్ సిమెంట్స్ కంపెనీ స్థాపించనున్నదని రాజగోపాల్ సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. దీనికి 2008 జనవరిలో 30 ఏళ్లకు మైనింగ్ లీజు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. అయితే ఈ ప్రతిపాదలు పంపేనాటికి ఈశ్వ ర్ సిమెంట్స్ ఏర్పాటే కాలేదు. తర్వాత గనుల శాఖ డైరెక్టర్ సర్కారుకు మరో ప్రతిపాదన పంపుతూ ఈశ్వర్ సిమెంట్స్‌కు కేటాయించిన మైనింగ్ లీజును దాల్మియా సిమెంట్‌కు బదిలీ చేయాలని సిఫారసు చేశారు. ఈశ్వర్ సిమెంట్స్ దాల్మియా సిమెంట్స్‌కు 100ు అనుబంధ సంస్థగా ఉందని గనుల శాఖ ఈ లేఖలో పేర్కొంది. వీటి ఆధారంగా 2008లో జీవో నంబర్ 321 జారీ చేశారు.
దాల్మియాతో క్విడ్ ప్రోకో
భారతి సిమెంట్స్‌కు చెందిన షేర్లను దాల్మియా సిమెంట్స్ కొనుగోలు చేయడం వెనుక క్విడ్ ప్రోకో జరిగింది. నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వందాల్మియా సిమెంట్స్‌కు 30 ఏళ్లకు కడప జిల్లాలో 1017 ఎకరాల సున్నపు రాయి గనులను లీజుకు ఇచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా భారతి సిమెంట్స్‌లో దాల్మియా రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టింది. దాల్మియాకు గనుల లీజు వ్యవహారంపై నాటి సీఎం వైఎస్ ఆదేశాలను.. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్, కార్యదర్శి వై.శ్రీలక్ష్మి పక్కాగా అమలు చేశారు. ఈ అక్రమాల గురించి సీబీఐ విచారణలో నాటి గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎ.దయాకరరెడ్డి, ఆ శాఖ సూపరింటెండెంట్ కె.వెంకట్రావు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం ‘ఆంధ్రజ్యోతి’కి చిక్కింది.
Updated Date - Oct 29 , 2024 | 04:26 AM