Nizamabad: ఉపాధ్యాయులు వేధిస్తున్నారు..
ABN, Publish Date - Jul 19 , 2024 | 06:02 AM
జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ఎన్.వి.దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారి నుంచి నాకు ప్రాణభయం ఉంది
పోలీసుస్టేషన్‌లో నిజామాబాద్ డీఈవో ఫిర్యాదు
నిజామాబాద్ అర్బన్, జూలై 18: జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ఎన్.వి.దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విశ్రాంత ఉపాధ్యాయుడు శంతన్, స్కూల్ అసిస్టెంట్లు బాలయ్య, ఓమాజీలు తరచూ తనపై వ్యక్తిగతంగా తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారని డీఈవో ఆరోపించారు. తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు.
ఈ విషయమై ఈనెల 1న తాను నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని అయినప్పటికీ, తనపై పత్రికల ద్వారా, సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమర్శల వల్ల తనతో పాటు తన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, సదరు ఉపాధ్యాయుల నుంచి తనకు ప్రాణభయం ఉందని ఫిర్యాదులో డీఈవో పేర్కొన్నారు. తనకు ఏదైనా జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా.. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీలలో కొంతమంది ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, క్యామ్ స్కానర్ పేరుతో అక్రమాలు జరిగాయని విశ్రాంత ఉపాధ్యాయుడు శంతన్, ఇతర ఉపాధ్యాయులు పలుమార్లు పత్రిక ప్రకటనలు ఇచ్చారు.
Updated Date - Jul 19 , 2024 | 06:02 AM