Sridhar Babuహైదరాబాద్‌లో అలెగ్రో మైక్రోసిస్టమ్స్
ABN, Publish Date - Nov 16 , 2024 | 04:02 AM
ఆటోమోటివ్, విద్యుత్తు వాహనాల తయారీలో ఉపయోగించే మ్యాగ్నెటిక్, సెన్సర్లు, చిప్‌ల తయారీలో దిగ్గజ సంస్థ అయిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్... హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
పరిశోధన కేంద్రంపై ఒప్పందం
500 మందికి ఉపాధి: శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆటోమోటివ్, విద్యుత్తు వాహనాల తయారీలో ఉపయోగించే మ్యాగ్నెటిక్, సెన్సర్లు, చిప్‌ల తయారీలో దిగ్గజ సంస్థ అయిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్... హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, అలెగ్రో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం సచివాలయంలో మంత్రి మాట్లాడారు. అలెగ్రో పరిశోధన కేంద్రం ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. తెలంగాణలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి సంతృప్తి చెంది హైదరాబాద్‌ను ఎంచుకున్నట్టు అలెగ్రో యాజమాన్యం తెలపడం హర్షదాయకమని శ్రీధర్ బాబు అన్నారు.
ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటులో ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అమెరికా కేంద్రంగా ఉన్న అలెగ్రో పరిశోధన కేంద్రం ఏర్పాటుతో రాష్ట్రంలో సెమీకండక్టర్ చిప్‌ల తయారీ పరిశ్రమకు ఊతం లభిస్తుందన్నారు. బీఎండబ్ల్యూ విద్యుత్తు కార్ల తయారీ సంస్థతో పాటు ఈవీ రంగంలో బ్యాటరీల నిర్వహణ, పవర్ చిప్‌ల తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా ఉందని శ్రీధర్ బాబు వివరించారు. ప్రస్తుతం 90శాతానికి పైగా సెమీకండక్టర్లను దేశం దిగుమతి చేసుకుంటోందని, ఈ రంగంలో దేశీయంగా ఉత్పత్తి చేసి స్వయం సమృద్ధి సాధించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అలెగ్రో మైక్రోసిస్టమ్స్ సిఈవో వినీత్ నర్గోల్వాలా, సీనియర్ వీపీ సుమన్ నారాయణ్, మరో సీనియర్ వీపీ మ్యాక్స్ గ్లోవర్లు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 04:02 AM