ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Allu Arjun: జైల్లో భోజనం చేయని అల్లు అర్జున్‌

ABN, Publish Date - Dec 14 , 2024 | 04:15 AM

అల్లు అర్జున్‌ను నాంపల్లి 9వ చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉంచేందుకు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

  • కొత్త రగ్గు, దుప్పటి.. రాత్రంతా నేలమీదే

  • రాత్రంతా చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్‌.. పదిన్నర గంటల తర్వాత వచ్చిన బెయిల్‌ ఆర్డర్‌

  • అప్పటికే బ్యారక్‌కు ఐకన్‌ స్టార్‌

  • జైల్లో భోజనం చేయని అల్లు అర్జున్‌

  • రాత్రంతా నేలమీదే గడపాల్సిన పరిస్థితి

  • తెల్లవారగానే విడుదల చేస్తారని అంచనా

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): అల్లు అర్జున్‌ను నాంపల్లి 9వ చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉంచేందుకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కాపీ అందిన వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించారు. దాంతో అల్లు అర్జున్‌ విడుదల ఖాయమని అంతా భావించారు. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్‌ బెయిల్‌ పత్రాల కోసం రిసెప్షన్‌లో వేచి ఉన్నారు. అయితే, రాత్రి పదిన్నర గంటల వరకు హైకోర్టు బెయిల్‌ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో జైలు అధికారులు ఆయన్ను అండర్‌ ట్రైల్‌ ఖైదీగా(ఖైదీ నంబర్‌ 7697) మంజీరా బ్యారక్‌లో ఉంచారు.


ఎందుకు విడుదల చేయలేదు?

సాధారణంగా సూర్యాస్తమయానికి ఖైదీలను బ్యారక్‌లలోకి పంపుతారు. అప్పటివరకు వచ్చే బెయిలు ఆర్డర్లకు సంబంధించిన ఖైదీలను లోపలికి పంపరు. వారందరి బెయిలు పత్రాలను పరిశీలించి, జైలు రికార్డుల్లో ఎంట్రీ చేసి, అందర్నీ ఒకేసారి విడుదల చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత వచ్చే బెయిలు ఆర్డర్లకు సంబంధించి ఖైదీలను అప్పటికే బ్యారక్‌లకు పంపడం వల్ల వారిని విడుదల చేయరు. కానీ, వారికి సంబంధించిన బెయిలు పత్రాలను పరిశీలించి, జైలు రికార్డుల్లో ఎంట్రీ చేస్తారు. సూర్యోదయం కాగానే వారిని విడుదల చేస్తారు. అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టు నుంచి 5.20కు చంచల్‌గూడ జైలుకు తీసుకువచ్చారు. ఆరు గంటల్లోపే ఆయనకు బెయిలు సమాచారం అందింది. దాంతో ఆయన ఏ క్షణమైనా విడుదల అవుతానన్న భరోసాతో ఉన్నారు. చాయ్‌, బిస్కట్లు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆరు గంటల వరకు బెయిలు కాపీలు రాకపోవడంతో మరి కాసేపు వేచిచూసి ఆయన్ను నిబంధనల ప్రకారం బ్యారక్‌లోకి పంపారు. అప్పుడే ఆయన రాత్రంతా జైల్లో ఉండటం ఖాయమైంది.


దాంతో ఆయన మొహంలో అసహనం పెరిగిపోయింది. ఖైదీలందర్నీ బ్యారక్‌లలోకి పంపినట్లుగా ధ్రువీకరించుకున్నాకే చివరగా అల్లు అర్జున్‌ను బ్యారక్‌కు తరలించారు. తనను ముగ్గురు ఖైదీలు ఉండే బ్యారక్‌లో ఉంచారు. అందులో ఆయనతో మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నారు. రిసెప్షన్‌ నుంచి అల్లు అర్జున్‌ను బ్యారక్‌కు తరలిస్తున్నపుడు ఇతర బ్యారక్‌లలో ఉన్న ఖైదీలు పుష్ప... పుష్ప... అంటూ అరుస్తూ ఉన్నారు. జైల్లో అర్జున్‌కు భోజనం ఆఫర్‌ చేసినా తినలేదు. 14 రోజుల రిమాండ్‌ విధించినపుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే, ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. తొలిరోజు రాత్రి అర్జున్‌ సాధారణ ఖైదీల లాగే నేల మీద పడుకోవాలి. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి ఇచ్చారు. వాటిని నేల మీద పరుచుకొని పడుకోవాల్సి ఉంటుంది. పదిన్నర తర్వాత తక్షణమే విడుదల చేయాలని బెయిలు ఉత్తర్వులు అందినప్పటికీ అధికారులు నిబంధనల ప్రకారం ఉదయమే విడుదల చేయాలని నిర్ణయించారు. బెయిలు కార్యక్రమం రాత్రే ముగిసిపోయినందున శనివారం తెల్లవారగానే ఏడుగంటల్లోపే అల్లు అర్జున్‌ను విడుదల చేస్తారు. సెలవు రోజైనా విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు.


ఒక్కసారైనా ఫొటో దిగాలనుకున్నాడు.. ఏకంగా అరెస్టు చేశాడు!

ఖైరతాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తన అభిమాన నటుడిని ఒక్కసారైనా కలిసి, ఆయనతో ఫొటో దిగాలనుకున్న ఆ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు తీరా ఆయన్నే అరెస్టు చేయాల్సి వచ్చింది. ఆ నటుడు అల్లు అర్జున్‌ అయితే, ఆ సీఐ రాజు నాయక్‌. అల్లు అర్జున్‌ అంటే రాజు నాయక్‌కు ఎంతో అభిమానమట! అయనతో ఫొటో దిగాలనే బలమైన కోరిక మనసులో ఉందట. అయితే ఈ కోరిక అయన్ను అరెస్టు చేస్తూ నెరవేర్చుకోవడం ఇబ్బందికరంగా ఆయన భావించినట్లు సమాచారం.

Updated Date - Dec 14 , 2024 | 04:15 AM