BJP: విమోచన దినోత్సవంపై భయమెందుకు?
ABN, Publish Date - Sep 17 , 2024 | 03:52 AM
‘‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి భయమెందుకు?. ఎవరికి భయపడి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు?’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు.
ఎందుకు అధికారికంగా నిర్వహించడంలేదు?: బండి సంజయ్
రేవంత్ రెడ్డి.. దమ్ములేని ముఖ్యమంత్రి: డీకే అరుణ
భగత్‌నగర్/కరీంనగర్ టౌన్/షాద్‌నగర్ అర్బన్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి భయమెందుకు?. ఎవరికి భయపడి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు?’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబరు 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నారని నిలదీశారు. ప్రజాపాలన పేరుతో తెలంగాణ చరిత్రనే కనుమరుగుచేస్తున్నారని మండిపడ్డారు. నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నారని అందుకే తాము తెలంగాణ ప్రజా పాలన కార్యక్రమాలకు హాజరు కావడంలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు.
ఎంఐఎం పార్టీకి భయపడి, ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్స వాన్ని నిర్వహించకుండా ప్రజలను వంచిస్తున్నాయని ధ్వజమెత్తారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై రాష్ట్రప్రభుత్వం గణేష్ ఉత్సవ కమిటీతో చర్చించి అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. రేవంత్‌రెడ్డి.. దమ్ములేని ముఖ్యమంత్రి అని, ముస్లిం ఓటు బ్యాంకు కోసమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే పయనిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అమలు పరుస్తున్న విధానాలకు ఎక్కడా కూడా పొంతన లేదని ఆమె అన్నారు.
ట్రాక్టర్ నడిపిన బండి సంజయ్
నిత్యం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడిపే కేం ద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉత్సాహంగా గడిపారు. ఆయన ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. సోమవారం నిమజ్జనం సందర్భంగా సంజయ్ కుటుంబసభ్యులతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించారు. అనంతరం వినాయకుడిని ట్రాక్టర్‌పైకి చేర్చారు. ఆ ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుతూ మెయిన్‌రోడ్డు వరకు తీసుకొచ్చారు.
Updated Date - Sep 17 , 2024 | 03:52 AM