Sridhar Babu: రూ.200 కోట్లతో ‘బన్యన్ నేషన్’ విస్తరణ
ABN, Publish Date - Nov 29 , 2024 | 03:36 AM
ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ తర్వాత మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం పటాన్‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో 15 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో ‘బన్యన్ నేషన్’ రీ సైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తోంది. రూ.200 కోట్లతో దీనిని 45 వేల టన్నులకు విస్తరించడానికి ఏర్పాట్లు చేసుకుంటోందని మంత్రి చెప్పారు. విస్తరణ పూర్తయితే మరో 500 మందికి ఉపాధి లభిస్తాయని వివరించారు.
రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌ను ఈ సంస్థ యూనిలివర్, టాటా మోటార్స్ లాంటి పెద్ద కంపెనీలకు విక్రయిస్తోందని తెలిపారు. రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న ‘బన్యన్ నేషన్’ లాభాల్లో నడుస్తోందన్నారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమయ్యే భూమి కేటాయింపుపై టీజీఐఐసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మరో కార్యక్రమంలో.. శేరిలింగంపల్లి వాసవి స్కైసిటీ టవర్స్‌లో ఏర్పాటుచేసిన ఐటీ కంపెనీ-- వతానియా సొల్యూషన్స్ కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఆయన వెంట చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఉన్నారు.
Updated Date - Nov 29 , 2024 | 03:36 AM