Bhadrachalam: ‘రామయ్య’ పేరిట ప్రైవేట్ కార్యక్రమాలు నిషిద్ధం‘రామయ్య’ పేరిట ప్రైవేట్ కార్యక్రమాలు నిషిద్ధం
ABN, Publish Date - Sep 16 , 2024 | 03:10 AM
భద్రాచలంలో శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్‌ఏ ఖగోళయాత్ర బృందం ఆధ్వర్యంలో భద్రాద్రి సీతారాముల శాంతికల్యాణం నిర్వహించడంపై భద్రాచలం దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
శాంతి కల్యాణం నిర్వహణపై భద్రాచలం ఈవో అభ్యంతరం
భద్రాచలం, సెప్టెంబరు 15: భద్రాచలంలో శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్‌ఏ ఖగోళయాత్ర బృందం ఆధ్వర్యంలో భద్రాద్రి సీతారాముల శాంతికల్యాణం నిర్వహించడంపై భద్రాచలం దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన భద్రాద్రి రామయ్య మూలవరుల చిత్రాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్, ఉప ప్రధాన అర్చకులు అమరవాది గోపాలకృష్ణమాచార్యులు, కోటి రామస్వరూపాచార్య, కోటి శ్రీమన్నారాయణాచార్యులు ఇతర వైదిక సిబ్బంది విలేకరులతో మాట్లాడారు.
ప్రపంచంలో ఎక్కడైనా సీతారాముల ఆలయం నిర్మించి కల్యాణం నిర్వహిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో భద్రాద్రి శ్రీరామ టెంపుల్, భద్రాద్రి శ్రీ సీతారాముల శాంతికల్యాణం, ఆలయ మూలవరుల చిత్రం వాడటం పూర్తిగా నిషేధమన్నారు. భద్రాద్రి సీతారాముల కల్యాణం నిర్వహించే పూర్తి హక్కులు కేవలం భద్రాద్రి దేవస్థానానికే ఉన్నాయని చెప్పారు. మరెవరైనా వ్యక్తిగత లాభాపేక్షతో వాణిజ్యపరంగా భద్రాద్రి పేరును వినియోగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కమిషనర్‌కు నివేదిక
మరోవైపు, ఈ విషయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లినట్లు దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు. ఇటు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, భద్రాద్రి సీతారాముల కల్యాణం, మూలవరుల చిత్రంపై త్వరలోనే పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేస్తామని దేవస్థానం ఆమె వెల్లడించారు.
Updated Date - Sep 16 , 2024 | 03:10 AM