ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: సంపద ప్రజలకు ఉపయోగపడాలి

ABN, Publish Date - Nov 04 , 2024 | 03:19 AM

రాష్ట్ర సంపద ప్రజలకు ఉపయోగపడాలి కానీ, పాలకులు పంచుకోవడానికి కాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

పాలకులు పంచుకోవడానికి కాదు.. ఇది ప్రజలు కోరుకున్న పేదల ప్రభుత్వం

  • మేధావుల సూచనలతో కొత్త విద్యుత్‌ విధానం: భట్టి

  • సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు నీరిస్తాం: ఉత్తమ్‌

  • అభివృద్ధిని ఓర్వలేక విపక్షాల విమర్శలు: కోమటిరెడ్డి

  • యాదాద్రి యూనిట్‌-1లో విద్యుదుత్పత్తి గ్రిడ్‌కు అనుసంధానం

హుజూర్‌నగర్‌, దామరచర్ల, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సంపద ప్రజలకు ఉపయోగపడాలి కానీ, పాలకులు పంచుకోవడానికి కాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసమే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఎస్‌ఎల్బీసీ సొరంగంలో ఒక్క కిలోమీటరు అయినా తవ్వలేదని, తాము 20 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రూ.200 కోట్లతో మోడల్‌ కాలనీ పునర్నిర్మాణ పనులను భట్టి పరిశీలించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని సమీకృత పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యార్థుల మెస్‌ చార్జీలను రూపాయి కూడా పెంచలేదని విమర్శించారు. తాము దేశంలో ఎక్కడా లేనివిధంగా యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తున్నామన్నారు.


విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గత ఏడాది బీఆర్‌ఎస్‌ సర్కారు గురుకుల పాఠశాలలకు రూ.70 కోట్లు కేటాయిస్తే, తాము రూ.5 వేల కోట్లు ఇచ్చి నిరుపేద పిల్లలపై చిత్తశుద్ధిని చాటుకున్నట్లు చెప్పారు. ప్రగతిశీల భావాలతో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గం రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోందని భట్టి తెలిపారు. ప్రభుత్వం పేదల చెంతకు వచ్చి పనిచేస్తోందని.. ఇందిరమ్మ అంటే పేదలకు భరోసా అని, పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ఉత్తమ్‌ చెప్పారు. సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్లో అనుమానాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. వారు అభివృద్ధి చేయకపోగా ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. విద్యారంగాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు రూ.వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.


  • బొగ్గు తరలింపు రైలుకు పచ్చజెండా

బీఆర్‌ఎస్‌ పాలనలో.. అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్‌ విధానం తీసుకురాలేదని, తాము మేధావులతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు త్వరలో కొత్త విద్యుత్తు విధానం తెస్తామని భట్టి తెలిపారు. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని వెల్లడించారు. గృహ, పారిశ్రామిక రంగాలకు విద్యుత్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకుని రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలుపుతామన్నారు. కోమటిరెడ్డి, ఉత్తమ్‌లతో కలిసి నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ (వైటీపీఎస్‌) పనులను భట్టి పరిశీలించారు. రామగుండం నుంచి యాదాద్రికి బొగ్గును తరలించేందుకు దామరచర్ల వద్ద ఏర్పాటు చేసిన గూడ్స్‌ రైలుకు జెండా ఊపారు. యూనిట్‌-1లో విద్యుదుత్పత్తిని పవర్‌ గ్రిడ్‌కు అనుసంధానం (సింక్రనైజేషన్‌) చేసే ప్రక్రియకు స్విచ్ఛాన్‌ చేశారు.


యాదాద్రి ప్లాంట్‌ 5 యూనిట్లకు గాను సెప్టెంబరులో రెండో యూనిట్‌ను, తాజాగా ఒకటో యూనిట్‌ను పవర్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు. మిగిలినవి మే నెల నాటికి పూర్తి చేస్తామన్నారు. 4 వేల మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని భట్టి తెలిపారు. పరిశ్రమలు నెలకొల్పడానికి వస్తున్న బహుళ జాతి సంస్థలు తప్పనిసరిగా కొంత గ్రీన్‌ఎనర్జీ (సౌర, పవన విద్యుత్‌)ని వినియోగించాల్సి ఉంటుందని వివరించారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నదని, భవిష్యత్తులో కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని కోమటిరెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 03:19 AM