Bhatti Vikramarka: ధరాభారం వద్దు.. ఖజానా కళకళలాడాలి!
ABN, Publish Date - Oct 10 , 2024 | 04:01 AM
‘‘ప్రజలపై ధరల భారం పడకూడదు.. కానీ, ఖజానాకు ఆదాయం పెరగాలి.. అలాంటి మార్గాలను అన్వేషించండి’’ అని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
ఆదాయ మార్గాలను అన్వేషించాలి
శాఖలు సమన్వయంతో పనిచేయాలి
అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలపై ధరల భారం పడకూడదు.. కానీ, ఖజానాకు ఆదాయం పెరగాలి.. అలాంటి మార్గాలను అన్వేషించండి’’ అని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ధరలు పెంచకుండా రాబడి పెరిగే మార్గాలను కనుగొనాలన్నారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచే అంశంపై నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు.
గతంలో నిర్దేశించుకున్న ప్రణాళికలు, వాటి ప్రగతిని నివేదించాలని అధికారులకు చెప్పారు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని చెప్పారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఇసుక రీచ్‌ల ద్వారా ఖజానాకు గరిష్ఠ ఆదాయం సమకూరేందుకు ఏం చేయాలనేదానిపై నివేదిక ఇవ్వాలన్నారు.
మూసీ పరివాహక ప్రజల బాగు కోసమే..
మూసీ పరివాహక ప్రజల బాగు కోసమే.. మూసీ ప్రక్షాళన, అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలు, దూరదృష్టిని నదీ పరివాహక ప్రాంతాల వాసులకు వివరించాలని భట్టి అధికారులకు చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ రీహాబిటేషన్‌పై పురపాలక శాఖ ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని బీఆర్‌ఎస్ సర్కారులా గాలికి వదిలేయబోమన్నారు.
వారికి ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మూసీ గర్భంలో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి దూరంగా పంపించబోమని చెప్పారు. మూసీకి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే హైదరాబాద్ నగరానికి నష్టం చేసిన వారవుతారని భట్టి అన్నారు. నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే తాము స్వీకరిస్తామని చెప్పారు.
Updated Date - Oct 10 , 2024 | 04:01 AM