Bhatti Vikramarka: ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలి: భట్టి విక్రమార్క
ABN, Publish Date - Aug 31 , 2024 | 03:58 AM
ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండా, ప్రభుత్వ అవసరాలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండా, ప్రభుత్వ అవసరాలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదాయ మార్గాలపై పలు కీలక శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆదాయ పెంపుపై ప్రతి నెలా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగే సమావేశానికి అధికారులు నూతన ఆలోచనలతో రావాలన్నారు.
గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా తాము అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని, మంచి నిర్ణయాలు తీసుకుని సత్ఫలితాలు సాధించాలని సూచించారు. ఇసుకను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన పట్టణాల్లోని సబ్ యార్డులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మార్కెట్ యార్డుల్లో నిల్వలు ఉంచాలని గనుల శాఖ అధికారులకు సూచించారు. లే-అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌లో వేగం పెంచాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు, ఇప్పటివరకు సమకూరిన ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ వివరాలు, అసైన్డ్ భూముల కోర్టు వివాదాలను సమీక్షించారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కావొద్దని ఆదేశించారు. వస్తు సేవల పన్నులో లీకేజీలను అరికట్టి, ఆదాయాన్ని పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు.
Updated Date - Aug 31 , 2024 | 03:58 AM