BJP: సరూర్‌నగర్ స్టేడియంలో 6న బీజేపీ భారీ సభ
ABN, Publish Date - Dec 01 , 2024 | 03:59 AM
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 6న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో నిర్వహణ.. నడ్డా రాక!
ఏడాదిలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలే..
బీఆర్‌ఎస్‌లాగే కాంగ్రెస్ పాలన: కిషన్‌రెడ్డి
సర్కారు వైఫల్యాలపై నేటి నుంచి నిరసన
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాక?
బీఆర్‌ఎస్ నోటిఫికేషన్లకు కాంగ్రెస్ కొలువులు
ఏడాదిలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు
బీఆర్‌ఎ్‌సలాగే కాంగ్రెస్ పాలన: కిషన్‌రెడ్డి
సర్కారు వైఫల్యాలపై నేటి నుంచి నిరసనలు
హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 6న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర సర్కారు వైఫల్యాలపై ఆదివారం నుంచి బీజేపీ నిరసన కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆరు గ్యారెంటీల అమలుపై ఆదివారం చార్జ్‌షీట్ విడుదల చేయనుంది. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం ఉంటుంది. 2, 3, 4 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, సదస్సులు, పాదయాత్రలు నిర్వహించనున్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చింది తప్ప.. ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఏడాదిలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పంచాయతీలకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సర్కారులు ఒక్క పైసా ఇవ్వలేదని అన్నారు. రుణమాఫీ కూడా అరకొరగా చేసిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలోని అహంకారం, నియంతృత్వం, అవినీతి, వైఫల్యాలు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో కూడా ఏ వర్గమూ సంతోషంగా లేదని.. రాష్ట్ర ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఉద్యమబాట పట్టాలని పార్టీ నా యకులకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని పంచాయతీ ఎన్నికల్లో విజయం సా ధించాలని, కాంగ్రెస్ అసమర్థ పాలనను ఎండగట్టాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు.
సభ్యత్వ నమోదుపై బన్సల్ క్లాస్..
బీజేపీ క్రియాశీల సభ్యత్వంపై పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 20వేల క్రియాశీల సభ్యత్వాలు అయ్యాయని.. ఇంకా 30 వేలు చేయించాల్సిందేనని స్పష్టం చేశారు. సభ్యత్వాలు చేయించని వారికి పార్టీ పదవులు ఎందుకని ప్రశ్నించారు. ‘‘సభ్యత్వ నమోదు మొదలు ప్రతీ పార్టీ కార్యక్రమాలకు తెలంగాణ నేతలు సడలింపులు కోరతారు. యూపీ కంటే ఇక్కడ కులపిచ్చి ఎక్కువ. అధికారంలోకి రావాలంటే సంస్థాగత బలోపేతం అత్యంత కీలకం. హరియాణా, మహారాష్ట్ర రాష్ట్రాలే ఇందుకు నిదర్శనం’’ అని స్పష్టం చేశారు.
Updated Date - Dec 01 , 2024 | 03:59 AM