Rice Procurement: దారుణంగా ధాన్యం కొనుగోళ్లు
ABN, Publish Date - Nov 12 , 2024 | 04:39 AM
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, తూకాల కోసం రైతులు ప్రాధేయ పడాల్సిన పరిస్థితి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తూకాల కోసం రైతులు ప్రాధేయపడాల్సి వస్తోంది
కాంగ్రెస్ పాలనలో మిల్లర్ల రాజ్యం నడుస్తోంది: లక్ష్మణ్
దొడ్డు ధాన్యానికీ రూ.500 బోనస్ ఇవ్వాలి: ఈటల
చౌటుప్పల్ టౌన్/జనగామ రూరల్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, తూకాల కోసం రైతులు ప్రాధేయ పడాల్సిన పరిస్థితి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చౌటుప్పల్ కొనుగోలు కేంద్రంలో తూకం వేసి పంపించిన 600 బస్తాల ధాన్యంలో 60 బస్తాల ధాన్యం బాగోలేదని ఓ మిల్లరు తిరిగి పంపించడం విచిత్రంగా ఉందని, కాంగ్రెస్ పాలనలో మిల్లర్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 93లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఇందుకోసం రూ.27వేల కోట్లు ఖర్చు చేయనుందన్నారు. కానీ, ధాన్యం తూకాలు వేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.
కాగా, 35 రోజులుగా ప్రాధేయ పడుతున్నా తన ధాన్యం తూకం వేయలేదంటూ చిన్నకొండూరు గ్రామానికి చెందిన రైతు చింతపల్లి పుల్లారెడ్డి తన గోడు వినిపించారు. రూ.వెయ్యి లంచం ఇచ్చిన వారి ధాన్యాన్ని వెంటనే తూకం వేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఎంపీ లక్ష్మణ్ దగ్గరుండి పుల్లారెడ్డి తెచ్చిన ధాన్యం కాంటా వేయించారు. కాగా, ఎన్నికల ముందు కాంగ్రె స్ ఇచ్చిన మాట ప్రకారం దొడ్డు, సన్న రకం అనే తేడా లేకుండా ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ చార్జీలను ప్రభుత్వామే చెల్లించాలన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 04:40 AM