BJP : కొత్త దళపతి.. సంక్రాంతికే!
ABN, Publish Date - Dec 16 , 2024 | 05:39 AM
రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై పార్టీ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. పార్టీ జాతీయ నాయకత్వం.. సంక్రాంతి కల్లా రాష్ట్రానికి అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అప్పుడే.. రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ
మరోసారి నేతల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి
బీసీ నేత, ఎంపీగా ఉన్న వ్యక్తికే అవకాశం!
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై పార్టీ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. పార్టీ జాతీయ నాయకత్వం.. సంక్రాంతి కల్లా రాష్ట్రానికి అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్గత చర్చల్లో రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తున్నా.. ఎంపీగా ఉన్న బీసీ నేతకు ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సమీకరణాలు మారితే మాత్రం అనూహ్యంగా కొత్త నేతకూ అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. కానీ, తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం మదిలో ఏముందో రాష్ట్రంలోని కీలక నేతలకు సైతం అంతు చిక్కడంలేదు. అధికార పీఠమే అంతిమ లక్ష్యమని, ఇందుకోసం అనుసరించే వ్యూహంలో వేసే ఎత్తుగడలు మాత్రం అనూహ్యంగా ఉండబోతున్నాయని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ‘‘పార్టీలో కొంతమంది సీనియర్ నేతల మధ్య అంతర్గత విభేదాలున్న మాట వాస్తవం. రాష్ట్ర పార్టీ వ్యవహారాలు నాలుగు స్తంభాలాటగా మారాయన్న విషయం అధినాయకత్వం దృష్టికి కూడా వెళ్లిం ది. మేం అధికారంలోకి రావాలంటే ముందు పార్టీలో సమన్వయం అవసరం. పార్టీ కొత్త అధ్యక్షుడికి ఈ సమర్థత కీలకం. ఇదే అంశాన్ని మా అధినాయకత్వానికి నివేదించాం’’ అని కీలక నేత ఒకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్ని సవాళ్లను ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగే నేతకే పట్టం కట్టబోతోందని చెప్పారు. కాగా, పోరాట పటిమ, సమన్వయం చేసుకునే సమర్థతతోపాటు వయసును కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని మరో ముఖ్యనేత పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పలువురు సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న పార్టీ అధిష్ఠానం.. తాజాగా మరోసారి కొంతమంది ముఖ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకుందని పార్టీవర్గాలు వెల్లడించాయి.
ఓసీ నేతకూ చాన్స్!
బీసీ సీనియర్ నేతలకు కీలక పదవులు కట్టబెడుతున్న జాతీయ నాయకత్వం.. రాష్ట్ర అధ్యక్ష పదవిని ఓసీలకు కట్టబెట్టే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపీ.. బీసీ..అనే సంకేతాలు అధినాయకత్వం నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే వాస్తవమైతే.. ఈ కోటాలో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ పేర్లు ప్రధానంగా చర్చకు రానున్నాయి. కాగా, తాను కూడా రేసులో ఉన్నట్లు అర్వింద్ రెండు రోజుల కిందట పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఒకవేళ ఓసీలకు పట్టం గట్టాల్సివస్తే.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, లేదా మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పేర్లు తెరపైకి రావచ్చని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావుకు సారథ్య బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలూ లేకపోలేదని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, అధ్యక్ష నియామకం జాప్యమయ్యే అవకాశ ముందని, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతుండడమే ఇందుకు కారణమని చెబుతున్నాయి. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకా రం.. పోలింగ్ బూత్ నుంచి మండల, జిల్లా కమిటీల ఎన్నికలు ఈ నెల 25లోగా పూర్తికావాల్సి ఉంది. కానీ, సభ్యత్వ నమోదు ప్రక్రియే ఇంకా కొలిక్కి రాకపోవడంతో బూత్ కమిటీల ఎన్నికల్లో జాప్యం జరుగుతోంది. అవి పూర్తయితేనే మం డల, జిల్లా కమిటీల ఎన్నికలు జరుగుతాయి.. రాష్ట్రవ్యాప్తంగా 50శాతం జిల్లాల కమిటీలు ఏర్పాటయితేనే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. అంటే, వచ్చేనెల రెండోవారంలోగా ఇది పూర్తికావొచ్చునని పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు.
Updated Date - Dec 16 , 2024 | 05:39 AM