Lagacharla Incident: లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
ABN, Publish Date - Nov 17 , 2024 | 03:46 AM
లగచర్లలో రైతులు దాడులు చేశారన్న నెపంతో పోలీసులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్ నేతలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): లగచర్లలో రైతులు దాడులు చేశారన్న నెపంతో పోలీసులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్ నేతలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలతో వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు కమిషన్ చైర్మన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు తమతో పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు. తమపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేయాలని కోరారు. లగచర్ల ఘటనలో దాడి జరిగింది ఎస్సీ, ఎస్టీలపైనేనని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ ఆరోపించారు.
రైతులు దాడులు చేశారన్న నెపంతో ఎస్సీ, ఎస్టీ మహిళలతో పోలీసులు అసభ్యకంగా ప్రవర్తించారని, ఈ అంశంపై దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామన్నారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలనకు లగచర్లలో పోలీసులు వ్యవహరించిన తీరే ఉదాహరణ అన్నారు. రేవంత్ తన నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనులపై దురహంకారంతో వ్యవహరిస్తూ వారి భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. ఫార్మా కంపెనీ కోసం భూములు కోల్పోతున్న ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. త్వరలోనే కమిషన్ లగచర్లలో పర్యటిస్తుందని తెలిపారు.
Updated Date - Nov 17 , 2024 | 03:46 AM