Share News

BRS: రేవంత్‌రెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:56 AM

రాష్ట్రంలో సమస్యలపై మాట్లాడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని, ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పంపించామని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడికౌశిక్‌ రెడ్డి అన్నారు

BRS: రేవంత్‌రెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం

  • నాపై దాడి జరిగితే సీఎందే బాధ్యత

  • నా కాళ్లు పట్టుకుంటే ఆయనను పీసీసీ ప్రెసిడెంట్‌ చేశా

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమస్యలపై మాట్లాడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని, ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పంపించామని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడికౌశిక్‌ రెడ్డి అన్నారు. సీఎం వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను హత్య చేయించాలని ఎందుకు అనుకుంటున్నారో రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనపై ఏదైనా దాడి జరిగితే సీఎం బాధ్యత వహించాలన్నారు.


తమ జోలికి వస్తే వీపు చింతపండు చేస్తామంటున్న రేవంత్‌ వీపును కొడంగల్‌లో గుర్నాధ్‌రెడ్డి, పార్లమెంట్‌ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ ప్రజలు చింతపండు చేయలేదా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ ప్రేసిడెంట్‌ను చేసింది తానేనని, ఆయన తన ఇంటికి వచ్చి కాళ్లు పట్టుకుని పీసీసీ ప్రెసిడెంట్‌ చేయాలని అడిగారని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు ఆయన్ను గద్దెదించే వరకు పోరాటం సాగిస్తానన్నారు. ఇటీవల తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద, సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రె్‌సలో ప్రకంపనలు మొదలయ్యాయని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై త్వరలో డీజీపీ, హోంశాఖ కార్యదర్శి, గవర్నర్‌ ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. న్యాయం జరగకపోతే రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో పరిస్థితులను వివరిస్తామని వారు వెల్లడించారు.

Updated Date - Sep 17 , 2024 | 03:56 AM