Hyderabad: ఎంఎన్‌జేలో ‘ఎముక మజ్జ మార్పిడి’
ABN, Publish Date - Jun 24 , 2024 | 05:05 AM
క్యాన్సర్ జబ్బుకు చికిత్స ఖరీదైన విషయం. ముఖ్యంగా లుకేమియా వంటి క్యాన్సర్ రోగులకు ఎముక మజ్జ మార్పిడి (బోన్‌మ్యారో) చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే దాదాపు రూ.10-30 లక్షల దాకా ఖర్చవుతుంది.
ప్రైవేట్‌లో రూ.10-30 లక్షల వ్యయం
క్యాన్సర్ రోగులకు ఉచితంగా చికిత్స
ఇప్పటి వరకు వంద మందికి బోన్‌మ్యారో
హైదరాబాద్ సిటీ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్ జబ్బుకు చికిత్స ఖరీదైన విషయం. ముఖ్యంగా లుకేమియా వంటి క్యాన్సర్ రోగులకు ఎముక మజ్జ మార్పిడి (బోన్‌మ్యారో) చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే దాదాపు రూ.10-30 లక్షల దాకా ఖర్చవుతుంది. ఇంతటి ఖరీదైన చికిత్సను ఎంఎన్‌జే క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా అందిస్తున్నారు. గత ఏడాది ఈ ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన అరబిందో ఆంకాలజీ బ్లాక్‌లో ఈ చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు వంద మందికి ఎముక మజ్జ మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు ఎంఎన్‌జే డైరెక్టర్ ముక్తా శ్రీనివాసులు చెప్పారు. రక్త క్యాన్సర్, పుట్టుకతో ఇతర రక్త సంబంధిత రోగాలకు ఎముక మజ్జ మార్పిడి అవసరమవుతుందని తెలిపారు.
మూలకణాలు సేకరించి..
రోగికి తప్పనిసరిగా బోన్ మ్యారో చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే రక్త సంబంధీకుల నుంచి మూలకణాలను సేకరించి వాటిని రోగికి మార్పిడి చేస్తారు. తద్వారా కొత్త కణాలు వృద్ధి చెంది క్యాన్సర్ నియంత్రణలోకి వస్తుందని, ఈ ప్రక్రియను ఆటోలోగ్‌సగా పేర్కొంటారని వైద్యులు చెప్పారు. రోగికి సంబంధించి ఒకరి ‘హ్యూమన్ లుకోసైట్ యాంటిజన్ (హెచ్‌ఎల్‌ఏ)’తో మరొకరి హెచ్‌ఎల్‌ఏ పూర్తిగా సరిపోలితేనే మార్పిడి చేస్తారు. కానీ, ఎంఎన్‌జేలో సగం సరిపోలినప్పటికీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని మార్పిడి చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరో విధానంలో రోగి నుంచే మూల కణాలను సేకరించి, వాటిని శుద్ధి చేసి మంచి కణాలను మళ్లీ అతనికి అందిస్తామని చెప్పారు. ఉచిత బోన్‌మ్యారో కేసులు నాలుగు రెట్లు పెరిగినట్లు పేర్కొన్నారు. అలాగే కీమోథెరపీ చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 62 శాతం పెరిగిందన్నారు. గత జూన్‌లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.80 కోట్ల వ్యయంతో 300 పడకల అత్యాధునిక ఆంకాలజీ బ్లాక్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎంఎన్‌జేలో 1.35 లక్షల మంది రోగులు క్యాన్సర్ చికిత్స పొందినట్లు చెప్పారు.
మొబైల్ స్ర్కీనింగ్ పరీక్షలు
ఆస్పత్రికి సంబంధించిన మొబైల్ స్ర్కీనింగ్ బస్సు ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమిక స్ర్కీనింగ్ క్యాంపులతో 1.5 శాతం మంది రోగుల్లో ఆరంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించినట్లు చెప్పారు. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్, బిహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వచ్చి క్యాన్సర్‌కు చికిత్స పొందారని తెలిపారు. కొత్త భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత కీమోథెరపీ చేయించుకుంటున్న రోగుల నిరీక్షణ 48 గంటల నుంచి 6 గంటలకు తగ్గిందన్నారు. కాగా, తెలంగాణలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఈ భవనంలో అందిస్తున్న సేవలు కీలకంగా నిలుస్తాయని అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్, అరబిందో ఫార్మా లిమిటెడ్ వీసీఎండీ కె.నిత్యానందరెడ్డి తెలిపారు.
Updated Date - Jun 24 , 2024 | 05:05 AM