Car Accident: కమ్ముకొచ్చిన మృత్యువు
ABN, Publish Date - Nov 11 , 2024 | 05:08 AM
వారంతా స్నేహితులు.. ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు కారు అద్దెకు తీసుకుని శ్రీశైలం డ్యామ్ సందర్శనకు బయలుదేరారు. అయితే కారు నడుపుతున్న వ్యక్తికి నిద్రమత్తు కమ్ముకురావడంతో వారి యాత్ర విషాదంగా మారింది.
శ్రీశైలం డ్యామ్ సందర్శనకు బయల్దేరిన ఏడు గురు స్నేహితులు
డ్రైవర్ నిద్రమత్తు.. చెట్టును ఢీకొన్న కారు
ఇద్దరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
యాచారం/కందుకూరు/పహాడిషరీఫ్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వారంతా స్నేహితులు.. ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు కారు అద్దెకు తీసుకుని శ్రీశైలం డ్యామ్ సందర్శనకు బయలుదేరారు. అయితే కారు నడుపుతున్న వ్యక్తికి నిద్రమత్తు కమ్ముకురావడంతో వారి యాత్ర విషాదంగా మారింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గేటు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పహాడీషరీఫ్ ప్రాంతానికి చెందిన ఏడుగురు స్నేహితులు ఇంతియాజ్‌ఖాన్, జుబెర్ నాయాబ్‌ఖాన్, అబ్దుల్ సమీర్, అబ్దుల్ సిరాజ్ ఖాన్, అబ్దుల్ అజీజ్ ఖాన్, అబ్దుల్ ఖాదర్, అబ్దుల్ ఫయాజ్.. శనివారం రాత్రి మెహదీపట్నంలోని ఓ ట్రావెల్స్‌లో కారు అద్దెకు తీసుకుని శ్రీశైలం డ్యామ్ సందర్శనకు బయల్దేరారు.
ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైవే నుంచి ముచ్చర్ల గేట్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జుబెర్ నాయాబ్‌ఖాన్ (18) అక్కడికక్కడే మృతిచెందగా, కొనఊపిరితో ఉన్న ఇంతియాజ్‌ఖాన్ (18)ను పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. కారు నడుపుతున్న అబ్దుల్ సమీర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడిన ఐదుగురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పహాడీషరీఫ్ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.
Updated Date - Nov 11 , 2024 | 05:08 AM