CM Revanth Reddy: డబుల్ ఇంజన్ అంటే.. ప్రధాని, అదానీ
ABN, Publish Date - Nov 17 , 2024 | 03:24 AM
ముంబైని లూటీ చేయడానికి గుజరాత్ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వారే ‘ప్రధాని, అదానీ’ అని చెప్పారు.
ముంబైని లూటీ చేయడానికి వచ్చారు
ఎంవీఏ సర్కారు కూల్చివేతలో అదానీ పాత్ర!
శిందే, అజిత్ పవార్‌ను బొంద పెట్టాలి
మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్
చంద్రాపూర్(మహారాష్ట్ర)/హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ముంబైని లూటీ చేయడానికి గుజరాత్ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వారే ‘ప్రధాని, అదానీ’ అని చెప్పారు. శనివారం ఆయన చంద్రాపూర్, రాజురా, డిగ్రాస్, వార్థా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా పొరుగు రాష్ట్ర సీఎంగా తాను కూడా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్.. ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం శిందే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ఒకరు ప్రధాని, మరొకరు అదానీ అని చెప్పారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చడంలో అదానీ పాత్ర ఉందని అజిత్ పవారే అంగీకరించారని తెలిపారు.
సీఎం ఏక్‌నాథ్ శిందే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌లు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. శిందే, అజిత్ పవార్‌లను రాజకీయంగా బొంద పెట్టాలంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కాలరాసి.. ప్రజాస్వామ్యాన్ని పరిహసించారని గుర్తు చేశారు. ఒక్క ఓటుతో ఇద్దరు గుజరాతీ గులాములను కట్టడి చేయాలన్నారు. దేశంలోని మహానగరాల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారని గుర్తుచేశారు. ముంబైలోనూ చిత్తుగా ఓడించాలన్నారు. ఇక కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణను లూటీ చేశారని ఆరోపించారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి తాను గ్రామాల్లో తిరిగానని, అణచివేతకు గురైన ప్రజల గొంతుకనయ్యానని తెలిపారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టారని రేవంత్ చెప్పారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కూటమి అధికారంలో వస్తే గ్యారెంటీలు అమలు చేస్తుందని చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం కేవలం 25 రోజుల్లోనే రైతులకు రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మహారాష్ట్రలో ఉద్యోగాల కల్పనపై సీఎం శిందేతో చర్చించడానికి తాను సిద్ధమని రేవంత్ ప్రకటించారు.
రేవంత్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
సీఎం రేవంత్‌రెడ్డి వాహనాన్ని శనివారం మహారాష్ట్ర పోలీసులు తనిఖీ చేశారు. చంద్రాపూర్ నియోజకవర్గంలోని గుగూ్‌సలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వెళుతుండగా.. మధ్యలో ఆపిన పోలీసులు, ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి ప్రచార సభలు, నాగ్‌పూర్ రోడ్ షోకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.
Updated Date - Nov 17 , 2024 | 03:24 AM