CM Revanth Reddy: 30 రోజుల్లో హెల్త్ కార్డులు..
ABN, Publish Date - Sep 27 , 2024 | 03:01 AM
ప్రజలందరికీ మరో 30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఒక్క క్లిక్‌తో హెల్త్ ప్రొఫైల్ రాష్ట్రంలోని 4 కోట్ల మంది
వివరాల డిజిటలీకరణ: రేవంత్ గుడెందొడ్డి రిజర్వాయర్
సామర్థ్యం 1.5 నుంచి 15 టీఎంసీల పెంపునకు సీఎం ఓకే
ప్రమాదకరమైన క్యాన్సర్‌ను జయించాలి: సీఎం రేవంత్
రాంనగర్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరికీ మరో 30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది హెల్త్ ప్రొఫైల్స్‌ను డిజిటైజ్ చేస్తారని, గత చికిత్స వివరాలను కూడా వాటిలో పొందుపరుస్తారని, ఒక్క క్లిక్‌తో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తెలుసుకునే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రి వంటి ట్రస్ట్‌ల సహకారం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన రెనోవా క్యాన్సర్ ఆస్పత్రిని గురువారం మంత్రి రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. స్వాతంత్య్రం రాకముందు మనిషి జీవిత కాలం 32 ఏళ్లు ఉండేదని, నెహ్రూ నాయకత్వంలో వైద్య రంగానికి పెద్దపీట వేసి దానిని 60 ఏళ్లకు తీసుకొచ్చారని, దానిని వందేళ్లు దాటేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. ‘‘క్యాన్సర్ సోకిన నిరుపేదలు చికిత్స చేయించుకోలేక ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ వ్యాధిని జయించాల్సిన అవసరం ఉంది’’ అని వివరించారు. డీడీహెచ్; రెనోవా ఆస్పత్రి యాజమాన్యాలు క్యాన్సర్ రోగులకు అందించే సేవలకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో డిజిటల్ హెల్త్ తీసుకు వస్తున్నామని మంత్రి రాజనర్సింహ చెప్పారు. గ్రామ స్థాయిలో పేదలకు క్యాన్సర్ వైద్య చికిత్సలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. క్యాన్సర్ బారిన పడిన పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రెనోవా ఆస్పత్రులను విస్తరింపజేస్తున్నామని ఆ గ్రూప్ చైర్మన్ శ్రీధర్ పెద్దిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతి జిల్లాలో 100 పడకలతో క్యాన్సర్ ఆస్పత్రులను నిర్మిస్తే తాము సేవలందిస్తామన్నారు. కాగా, ప్రజలకు హెల్త్‌కార్డులను అందించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ.. హరియాణాలో అధ్యయనానికి ప్రత్యేక బృందాన్ని పంపినట్లు సమాచారం. ఎలాంటి కార్డులను అందించాలి? అందుకు అవలంబించాల్సిన అంశాలేంటి? అనేదానిపై ఈ బృందం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
Updated Date - Sep 27 , 2024 | 03:01 AM