ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ధాన్యం ధర తగ్గిస్తే ఊరుకోం..

ABN, Publish Date - Nov 12 , 2024 | 03:35 AM

‘‘రైతులు ధాన్యం ఎమ్మెస్పీకి అమ్ముకోవటానికి రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 7,750 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశాం. 80 లక్షల టన్నులు వచ్చినా, అంతకంటే ఎక్కువ ధాన్యం వచ్చినా కొనుగోలు చేయటానికి సరిపడా నిధులు సమకూర్చాం.

  • ఇతర రాష్ట్రాలు సహా ఎక్కడైనా అమ్ముకోవచ్చు.. ఎగుమతికీ స్వేచ్ఛ

  • సన్నాలకు 500 బోనస్‌ ఇచ్చే పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు

  • కాళేశ్వరం నుంచి నీరు ఇవ్వకున్నా కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి

  • తేమశాతం సడలించే సత్తా బీజేపీ కేంద్ర మంత్రులకు ఉందా?

  • మిల్లర్లు సహకరించనిచోట ప్రభుత్వ గోదాములకు ధాన్యం నిల్వలు

  • టెండరు ధాన్యం మొత్తం వసూలు చేస్తాం.. లేదంటే 25% జరిమానా

  • మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే బ్యాంకు గ్యారెంటీ నిబంధన

  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘రైతులు ధాన్యం ఎమ్మెస్పీకి అమ్ముకోవటానికి రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 7,750 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశాం. 80 లక్షల టన్నులు వచ్చినా, అంతకంటే ఎక్కువ ధాన్యం వచ్చినా కొనుగోలు చేయటానికి సరిపడా నిధులు సమకూర్చాం. సెంటర్ల లో అన్ని మౌలిక వసతులు కల్పించాం. చివరి రైతు నుంచి చివరి గింజ ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేక్రమంలో అధిక ధరకు ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవటానికి రైతులకు పూర్తి స్వేచ్ఛ కల్పించాం. ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవచ్చు. విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. అయితే సన్నాలకు బోన్‌సతో కలిపి రూ. 2,800, దొడ్డు రకాలకు రూ. 2,300 ఎమ్మెస్పీ కంటే తక్కువ ధర ఎవరైనా చెల్లిస్తే మాత్రం ఉపేక్షించేదిలేదు.


రైస్‌మిల్లర్లయినా, వ్యాపారులైనా... రైతులకు నష్టం కలిగిస్తే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.’’ అని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు, కొత్త ధాన్యం సేకరణ పాలసీని తీసుకొచ్చిన నేపథ్యంలో... ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఉత్తమ్‌.. సోమవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ‘ఆంధ్రజ్యోతి’ తో మాట్లాడారు. గతంలో మంచి పంట వచ్చినపుడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చిందని అసత్య ప్రచారం చేసిందని, ఈ ఖరీ్‌ఫలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న మూడు బ్యారేజీల నుంచి ఒక్క చుక్క కూడా నీరు విడుదల చేయకుండానే... 66.7 లక్షల ఎకరాల్లో వరి సాగుచేసి... 155 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట పండించారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయంలో 45 లక్షల మంది రైతులు ఈ ఘనత సాధించారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఇంటర్వ్యూ విశేషాలు....


ధాన్యం సేకరణకు కొత్త పాలసీ తయారుచేసినా రైతులు... మిల్లర్లు, ప్రైవేటు ట్రేడర్ల వైపు మొగ్గుచూపటానికి కారణం ఏమిటి?

ధాన్యం సేకరణ పాలసీ- 2024 లో ప్రధానంగా రెండు నిబంధనలు పెట్టాం. బయటి రాష్ట్రాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ధాన్యం రానిచ్చేదిలేదు. సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటుచేసి కట్టుదిట్టం చేశాం. రాష్ట్రంలో ఉత్పత్తిచేసిన ధాన్యాన్ని మాత్రం రైతులు తమకిష్టమై న చోట అమ్ముకునే వెసులుబాటు కల్పించాం. ఇక్కడ అమ్మినా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసుకున్నా అభ్యంతరంలేదు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎఫ్‌సీఐ నుంచి తెలంగాణ రైస్‌ కావాలని కోరుకుంటున్నారు. ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, మలేషియా దేశాల నుంచి కూడా తెలంగాణ బియ్యం కావాలనే ప్రతిపాదనలొచ్చాయి. నాణ్యమైన బియ్యం ఉత్పత్తి అవుతుండటంతో డిమాండ్‌ పెరిగింది.

సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీచేస్తామని హామీ ఇచ్చారు. సన్నాలు కొనుగోలు కేంద్రాలకు రాకపోతే ఏంచేస్తారు?

దేశంలో ఎక్కడ లేనివిధంగా సన్నాలకు క్వింటాకు రూ. 500 బోనస్‌ ఇస్తున్నాం. కార్పొరేషన్‌ నుంచి ఎమ్మెస్పీ, ఆర్థికశాఖ నుంచి బోనస్‌ చెల్లించేలా ఏర్పాట్లుచేశాం. గతంలో రైతుల ఖాతాల్లో డబ్బులు వేయటానికి నెలల తరబడి సమయం పట్టేది. ఇప్పుడు మూడు, నాలుగు రోజుల్లో ఖాతాల్లో జమచేసేలా ఏర్పాట్లుచేశాం. రాష్ట్రంలో 80- 85 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇందులో పీడీఎ్‌సకు 36 లక్షల టన్నులు సరిపోతుంది. ఈమేరకు ధాన్యం సెంటర్లకు వస్తుందన్న నమ్మకం ఉంది. దీనిని మిల్లింగ్‌చేస్తే 24 లక్షల టన్నుల సన్న బియ్యం వస్తాయి. నెలకు 2 లక్షల టన్నుల సన్నబియ్యం పేదలకు పంపిణీచేస్తాం. జనవరి నుంచి రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభం అవుతుంది.


రైస్‌మిల్లర్లు కొన్నిచోట్ల ధాన్యం దించుకోకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

రైస్‌మిల్లర్ల విషయంలో గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. మిల్లర్లకు ఏ బ్యాంకు గ్యారెంటీ సెక్యూరిటీ లేకుండా వేల కోట్ల ధాన్యం అప్పగించింది. మిల్లర్లు, గత ప్రభుత్వంలో పాలకులు మిలాఖత్‌ అయిపోయి అడ్డగోలుగా ధాన్యం అమ్ముకున్నారు. వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాలశాఖను పూర్తిగా ప్రక్షాళనచేశాం. బ్యాంకు గ్యారెంటీ నిబంధన తీసుకొచ్చాం. రైస్‌మిల్లర్లను మూడు కేటగిరీలుగా విభజించి.. 10 శాతం, 20 శాతం, 25 శాతం గ్యారెంటీ ఇవ్వాలని సూచించాం. పాత బకాయిలున్న వారికి సీఎంఆర్‌ ఇవ్వటంలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు పాత బకాయిలు తీర్చినవారికి కూడా ధాన్యం ఇస్తాం. తక్కువ సమయంలో బ్యాంకు గ్యారెంటీ ఇవ్వలేని మిల్లర్లకు... వంద రూపాయల బాండ్‌ పేపర్‌పై అండర్‌ టేకింగ్‌ తీసుకొని ధాన్యం కేటాయింపులు చేస్తున్నాం.

మిల్లులకు కాకుండా మధ్యంతర గోదాములకు ధాన్యం తరలిస్తే... రవాణా, నిల్వతో ఆర్థికభారం రెట్టింపు అవుతుంది కదా?

రైస్‌మిల్లర్లు ధాన్యం దించుకోకుండా సహాయ నిరాకరణ చేసేచోట... ప్రభుత్వం కొనుగోలుచేసిన ధాన్యాన్ని మధ్యంతర గోదాములకు తరలిస్తున్నాం. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, మార్కెట్‌ కమిటీల్లో ఉన్న 30 లక్షల టన్నుల స్థలాన్ని తీసుకున్నాం. రవాణా, నిల్వ ఖర్చులు రెట్టింపయినా ప్రభుత్వం భరిస్తుంది. ఈమేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. రైస్‌మిల్లర్ల వైఖరితో రైతులకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేదిలేదు. రైతులకోసం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొంటాం. జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చాం. ఒకవేళ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఏవైనా నిధులు ఖర్చుచేసినా... ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని చెప్పాం. తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఏపీ చరిత్రలో ఇంత రికార్డు స్థాయిలో 155 లక్షల టన్నుల ధాన్యం ఇదివరకు జరగలేదు. మిల్లర్లు ధాన్యం దించుకోని చోట... కర్ణాటక, తమిళనాడు నుంచి ఎవరైనా రైస్‌మిల్లర్లు వచ్చి సీఎంఆర్‌ కోసం ధాన్యం తీసుకెళ్తామంటే కూడా ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.


17 శాతం తేమ నిబంధన అమలుపై

కేంద్ర మంత్రులే ఆరోపణలు చేస్తున్నారు?

నిబంధనలు సడలించే అవకాశం ఉందా?

17 శాతం గానీ అంతకంటే తక్కువ తేమశాతం ఉన్న వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే ఐకేపీ, పీఏసీఎస్‌ సెంటర్లలో ధాన్యం సేకరణ చేస్తున్నాం. ఈవిషయంపై బీజేపీ నేతలకు అవగాహనలేకపోవటంతో అసత్యాలు మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి ఇతర నేతలకు సత్తా ఉంటే... 17 శాతం ఉన్న నిబంధనను సఢలింపుచేసి... 25- 30 శాతానికి కొనాలని నిబంధనలు మార్పిస్తే... కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేం ధాన్యం కొనుగోళ్లు చేస్తాం.

టెండర్లలో అమ్మిన ధాన్యం రికవరీ కాలేదు. మిల్లర్ల వద్ద వేల కోట్ల బకాయిలున్నాయి? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

వేలం పాటలో అమ్మిన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేయటానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి బాధ్యతలు అప్ప గించాం. ఈప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. మొత్తం ధాన్యాన్ని రికవరీ చేస్తాం. కేబినెట్‌లో నిర్ణయం తీసుకొని డిసెంబరు 31 నాటికి గడువు ఇచ్చాం. ఆలోపు ఽఏజెన్సీలకు ధాన్యం అప్పగించకపోతే... గత ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం 25 శాతం జరిమానా వేస్తాం.

Updated Date - Nov 12 , 2024 | 03:35 AM