CM Revanth Reddy: మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి
ABN, Publish Date - Oct 15 , 2024 | 03:03 AM
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఫోర్త్ సిటీలోనూ భూమి కేటాయిస్తాం.. ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూతో సీఎం రేవంత్‌రెడ్డి
కంపెనీ విస్తరణకు సహకరిస్తామని హామీ.. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి కొంగరకలాన్‌లోని ఫ్యాక్టరీ సందర్శన
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నారు. సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఎఫ్‌ఐటీ) కంపెనీని ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అన్ని విధాలుగా సహకరిస్తామని మరోసారి భరోసా ఇచ్చారు.
కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా యాంగ్ లియూను ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యంగా ఎలక్ర్టిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నారు. ఫాక్స్‌కాన్ అదనపు పెట్టుబడులకు సిద్ధమైతే ఫోర్త్‌సిటీలోనూ భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని కార్యాచరణ సమస్యలను ఫాక్స్‌కాన్ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకురాగా.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అక్కడికక్కడే సంబంధిత అధికారులను రేవంత్ ఆదేశించారు. పక్కనే ఉన్న 66 ఎకరాల స్థలాన్ని కూడా తమకు కేటాయించాలని ఫాక్స్‌కాన్ ప్రతినిధులు కోరగా.. అసవరమైతే ఫోర్త్ సిటీలో మరింత ఎక్కువ స్థలం కేటాయిస్తామన్నారు. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Updated Date - Oct 15 , 2024 | 03:03 AM