ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: చెరువును చెరబడితే.. చెరసాలే!

ABN, Publish Date - Sep 12 , 2024 | 02:57 AM

చెరువులను కబ్జా చేసి ఫాంహౌ్‌సలు నిర్మించుకున్నవారు స్వచ్ఛందంగా వాటిని కూల్చివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

  • ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వదిలేయాలి.. లేదంటే నేలమట్టం చేస్తాం

  • కోర్టుకెళ్లినా.. న్యాయపరంగా కొట్లాడి తొలగిస్తాం

  • ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లోనివి రెగ్యులరైజ్‌ చేయం

  • మూసీ పరివాహక ప్రాంతంలో నివాసాలు

  • ఏర్పరచుకున్న వారికి పునరావాసం కల్పిస్తాం

  • పోలీస్‌ అంటే ఉద్యోగం కాదు.. భావోద్వేగం

  • నేరస్థులకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉండకూడదు

  • డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపాలి

  • హైదరాబాద్‌, వరంగల్‌లో పోలీసుల పిల్లలకు

  • రెసిడెన్షియల్‌ స్కూళ్లు నిర్మిస్తాం: సీఎం రేవంత్‌

  • శిక్షణ పూర్తయిన ఎస్సైల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): చెరువులను కబ్జా చేసి ఫాంహౌ్‌సలు నిర్మించుకున్నవారు స్వచ్ఛందంగా వాటిని కూల్చివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. లేదంటే ఆ నిర్మాణాలను నేలమట్టం చేస్తామని, ఆక్రమణదారులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఆ వరదలు బస్తీల్లో ఉన్న పేదల ఇళ్లల్లోకి వెళ్తున్నాయని, వారు కష్టపడి సంపాదించుకున్నది మొత్తం కొట్టుకుపోతోందని చెప్పారు. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోనైనా, హైదరాబాద్‌లోనైనా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గుల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆ ఆక్రమణల్ని తొలగించేందుకే తాము హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. బుధవారం హిమాయత్‌సాగర్‌లోని రాజబహదూర్‌ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శిక్షణా కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై)ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


వారి నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘‘హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చిన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ను కొంతమంది ఆక్రమించుకుని విలాసవంతమైన విల్లాలు, ఫాంహౌ్‌సలు నిర్మించుకున్నారు. వాటికి డ్రైనేజీ వ్యవస్థ లేదు. డ్రైనేజీ నీళ్లను గండిపేటలో కలిపారు. అలాంటి నీళ్లను ప్రజలు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను విఫలమైనట్లు కాదా? ఒక్కసారి ఆలోచించండి!’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొందరు కోర్టులకు వెళ్లి తాత్కాలికంగా స్టే తెచ్చుకుంటున్నారని, అలాంటివారి విషయంలో న్యాయస్థానంలో పోరాడి స్టే వెకేట్‌ చేయిస్తామని చెప్పారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పరిధిలో ఉన్న నిర్మాణాలను రెగ్యులరైజ్‌ చేసే ప్రసక్తే లేదన్నారు. ‘‘మూసీ కలుషితమయింది. ఆ కాలుష్యం నల్లగొండ వరకు చేరుతోంది. అక్కడ పంటలు విషమయం అవుతున్నాయని, మూసీని ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు. అందుకే మూసీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాం. మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అందిస్తాం. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకున్న 11వేల మందికీ పునరావాసం కల్పిస్తాం’’ అని అన్నారు.


  • నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టాలి..

గంజాయి, డ్రగ్స్‌ సరఫరాదారులు, సైబర్‌ నేరగాళ్లకు, ఆక్రమణదారులకు వెన్నులో వణుకు పుట్టేలా పోలీసులు వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘నేరగాళ్లను పట్టుకుని అడ్డుకుని అడ్డు తొలగించే బాధ్యత మనందరిది. పోలీస్‌ అంటే ఉద్యోగం కాదు.. భావోద్వేగం. ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించాలి. క్రిమినల్స్‌తో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కాకుండా.. బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో పోలీ్‌సస్టేషన్‌కు వచ్చేవారితో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉండాలి. కాస్మెటిక్‌ పోలీసింగ్‌తో సమస్యలు పరిష్కారం కావు. కాంక్రీట్‌ పోలీసింగ్‌ చేసి శాంతిభద్రతలను కాపాడాలి.


శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. శిక్షణ పూర్తిచేసుకున్న ఎస్సైల సామర్థ్యంపై నాకు నమ్మకం ఏర్పడింది. రాష్ట్ర ప్రజలు మన కుటుంబ సభ్యులు. వారు ఏ ఇబ్బంది ఎదుర్కొన్నా వైపల్యం మనదే అవుతుంది’’ అని సీఎం అన్నారు. రాష్ట్రంలోని పోలీస్‌ సిబ్బంది పిల్లలకు సైనిక్‌ స్కూల్‌ తరహాలో ప్రత్యేకంగా రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మిస్తామని చెప్పారు. గ్రేహౌండ్స్‌ భూముల్లో 50 ఎకరాల్లో, వరంగల్‌లో మరో పాఠశాల నిర్మిస్తామని ప్రకటించారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరి పిల్లలు అందులో చదువుకోవచ్చన్నారు. రాబోయే రెండేళ్లలో పోలీస్‌ స్కూల్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.


  • నాడు జిరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నపత్రాలు..

యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని సీఎం రేవంత్‌ చెప్పారు. ఒకప్పుడు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాలు జిరాక్స్‌ సెంటర్లలోనూ, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్ముకునేవారని ఆరోపించారు. పరీక్షలు రాసిన లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను సంపూర్ణంగా ప్రక్షాళన చేశామన్నారు. ‘‘నాడు నోటిఫికేషన్లు ఇవ్వాలని కదం తొక్కిన నిరుద్యోగులు.. ఇప్పుడు మన ప్రభుత్వం వెనువెంటనే ఇస్తున్న నోటిఫికేషన్లను కొంతకాలం వాయిదా వేయాలని కోరారు. అన్ని పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేశాం.


కులవృత్తులు, చేతి వృత్తుల్ని బలోపేతం చేస్తూ.. వారిని ఆదుకుంటున్నాం. ఎనిమిది నెలల్లోనే.. సరిగ్గా 27 రోజుల్లో రూ.18వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశాం’’ అని సీఎం అన్నారు. పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించిన పల్లి భాగ్యశ్రీని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కాగా, పోలీస్‌ వ్యవస్థలో ఎస్సైలు వెన్నుముక లాంటివారని డీజీపీ జితేందర్‌ అన్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్నవారు ప్రజల నమ్మకాన్ని చూరగొనేవిధంగా పనిచేయాలని సూచించారు. ఎస్సైల శిక్షణ, అకాడమీ పనితీరును అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌ వివరించారు. మొత్తం 547మంది శిక్షణ పూర్తిచేసుకోగా.. వీరిలో 145 మంది మహిళలు ఉన్నారు. శిక్షణ సమయంలో ఆయా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి సీఎం చేతుల మీదుగా కప్‌లు, ట్రోఫీలు అందజేశారు. అకాడమీ ఆవరణలో కొత్తగా నిర్మించిన క్రీడా భవన్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌, సీపీ సీవీ ఆనంద్‌, ఐజీ రమే్‌షతో సీఎం రేవంత్‌ కొద్దిసేపు బ్యాడ్మింటన్‌ ఆడారు.


  • నా భర్త కల నెరవేర్చా: భాగ్యశ్రీ

భద్రాద్రి జిల్లా సారపాకకు చెందిన పల్లి భాగ్యశ్రీ ఎస్సై శిక్షణలో ‘టాపర్‌ ఆఫ్‌ ది బ్యాచ్‌’గా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. తన భర్తకు పోలీస్‌ ఉద్యోగమంటే ఇష్టమని, ఆయన కల నెరవేర్చేందుకు తాను ఈ ఉద్యోగం సాధించానని అన్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే ఎస్సై శిక్షణకు సిద్ధమయ్యానని తెలిపారు.

Updated Date - Sep 12 , 2024 | 05:43 AM

Advertising
Advertising