CM Revanth Reddy: సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం
ABN, Publish Date - Nov 30 , 2024 | 03:15 AM
రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం సిద్ధమవుతోంది. నగర శివారులోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగు రోడ్డు సమీపంలోని ఓ వర్క్‌షా్‌పలో లోహ (ఇత్తడి) విగ్రహం రూపుదిద్దుకుంటోంది.
పెద్ద అంబర్‌పేటలో రూపుదిద్దుకుంటున్న శిల్పం
10 టన్నుల ఇత్తడితో 17 అడుగుల ఎత్తులో తయారీ
ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
9న సచివాలయంలో విగ్రహ ఆవిష్కరణ
హయత్‌నగర్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం సిద్ధమవుతోంది. నగర శివారులోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగు రోడ్డు సమీపంలోని ఓ వర్క్‌షా్‌పలో లోహ (ఇత్తడి) విగ్రహం రూపుదిద్దుకుంటోంది. తయారీ దాదాపు పూర్తయి.. తుది మెరుగులు దిద్దుకుంటోంది. విగ్రహాన్ని తయారు చేస్తున్న ఈశ్వర్‌కు చెందిన లోహ వర్క్‌షా్‌పకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా వచ్చి పరిశీలించారు. ఇప్పటిదాకా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం తయారవుతున్న విషయం తెలియని స్థానికులు.. ముఖ్యమంత్రి రాకతో ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం తెలిసిందే.
ఈ మేరకు దేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు విగ్రహాన్ని తయారు చేసిన లోహ శిల్పికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసే భాద్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. 17 అడుగుల ఎత్తు, సుమారు 10 టన్నుల ఇత్తడితో విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. విగ్రహం తయారీకి దాదాపు రూ.70 లక్షలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఈ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని డిసెంబరు 9న సచివాలయంలో ఆవిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా, విగ్రహ తయారీని శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించేందుకు రావడంతో వర్క్ షాపు వద్ద హయత్‌నగర్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా ఫొటోలు తీయకుండా అడ్డుకున్నారు. విగ్రహానికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి శిల్పి సైతం నిరాకరిస్తున్నారు. విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిందిగా శిల్పిని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.
Updated Date - Nov 30 , 2024 | 03:15 AM