రోశయ్య లాంటి సహచరుడుంటే.. సీఎంగా ఎవరైనా రాణించవచ్చు
ABN, Publish Date - Dec 05 , 2024 | 03:08 AM
కొణిజేటి రోశయ్యలాంటి సహచరుడు మంత్రివర్గంలో ఉంటే.. ముఖ్యమంత్రిగా ఎవరైనా రాణించవచ్చునని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
సీఎంగా ఎవరున్నా నం.2 ఆయనే.. హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహం పెడతాం
ఆర్యవైశ్యులే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు.. రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తాం
వ్యాపారాలకు అనుమతుల్లో ఇబ్బంది రానివ్వం.. రోశయ్య వర్ధంతి సభలో రేవంత్‌రెడ్డి
విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్‌లో ఎకో టూరిజం పార్కును ప్రారంభించిన సీఎం
హైదరాబాద్ సిటీ/గచ్చిబౌలి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కొణిజేటి రోశయ్యలాంటి సహచరుడు మంత్రివర్గంలో ఉంటే.. ముఖ్యమంత్రిగా ఎవరైనా రాణించవచ్చునని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆరుగురు ముఖ్యమంత్రులు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడపగలిగారంటే వారందరికీ కుడిభుజంగా రోశయ్య ఉండడం వల్లే సాధ్యమైందన్నారు. అందుకే సీఎంగా ఎవరున్నా, నెంబరు-2 స్థానం రోశయ్యదేనని, ఒకటో స్థానంలో ఉన్నవారిని జరిపి కూర్చోవాలని ఆయన ఎన్నడూ తాపత్రయపడలేదని పేర్కొన్నారు. బుధవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మూడో వర్థంతి కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘రోశయ్య యాభై ఏళ్లకుపైగా ప్రజాజీవితంలో రాణించారు. తమిళనాడు రాజకీయాలు వివాదాస్పదమైన సందర్భంలో గవర్నర్‌గా తన అనుభవాన్ని ప్రదర్శించి, చాకచక్యంగా వ్యవహరించారు. రోశయ్య నుంచి చతురత, సమయస్ఫూర్తి, అధికార పార్టీని ఇరుకున పెట్టే వ్యూహాత్మకతలను ఇప్పటి ప్రజాప్రతినిధులు నేర్చుకోవాలి’’ అని అన్నారు. రోశయ్య ఏనాడూ తనకు పదవి కావాలని అధిష్ఠానాన్ని కోరలేదని, ఆయనలోని నిబద్ధత క్రమశిక్షణ కలిగిన విలక్షణమైన వ్యక్తిత్వమే అన్ని హోదాలను ఇంటికి తెచ్చిపెట్టిందని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నవారంతా వీటిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
అలాంటివారు లేకపోవడం లోటు..
ఈరోజు తెలంగాణ శాసనసభలో వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించగలిగిన రోశయ్య లాంటి పెద్దమనుషులు లేకపోవడం తీరని లోటు అని సీఎం రేవంత్ అన్నారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి. పాలకపక్షంలో ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించాలి. ఆ విషయంలో భేషజాలకు పోనక్కర్లేదు’ అంటూ ఆనాడు రోశయ్య చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆ స్ఫూర్తి ప్రస్తుతం చట్టసభల్లో కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించేవాళ్లకు అసలు అవకాశం ఇవ్వద్దన్నట్టుగానే చట్టసభల్లో పరిస్థితులు తయారయ్యాయని, దీని నుంచి బయట పడాలని అన్నారు. హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహం నెలకొల్పాలన్న తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత గుప్తా విన్నపం పట్ల సీఎం స్పందిస్తూ ‘రోశయ్య నిఖార్సైన హైదరాబాదీ’ అని వ్యాఖ్యానించారు. ‘‘రోశయ్య యాభై ఏళ్ల కిందటే ఇక్కడ స్థిరపడ్డారు. రెండు ప్రాంతాలు తనకు సమానమని ఒక సందర్భంలో చెప్పారు. వార్డు సభ్యుడి నుంచి లోక్‌సభ సభ్యుడి వరకు, మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయుడు. అలాంటి మహనీయుడి విగ్రహం లేకపోవడం పెద్ద లోటు. నగరంలో తగిన ప్రాంతాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే.. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ఏడాదిలోగా నగరంలో రోశయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుందాం’’ అని రేవంత్ అన్నారు.
అభివృద్ధి ఆర్యవైశ్యుల చేతుల్లోనే..
తెలంగాణ ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతుల్లో ఉందని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంవైపు నడవాలన్నా, ఆర్థికంగా బలపడాలన్నా ఆర్యవైశ్య సోదరులంతా ఒక గంట అదనంగా పనిచేయాలని కోరారు. ‘‘ఆర్య వైశ్యులే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు. మీ వ్యాపారాలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసే బాధ్యత నాది. రాజకీయాల్లోనూ ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించడానికి కృషి చేస్తా. ప్రభుత్వంలోనూ భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తా’’ అని రేవంత్ అన్నారు. కాగా, ముఖ్యమంత్రి చేతులమీదుగా కొణిజేటి రోశయ్య చైతన్య స్ఫూర్తి అవార్డులను వాసవి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు పెండేకంటి రామ్మోహన్‌రావు, వాసవి వసతిగృహాల ట్రస్ట్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, వ్యాపారవేత్త మానేపల్లి రామారావుకు ప్రదానం చేశారు.
రోశయ్య నుంచి నేటి తరం నేర్చుకోవాలి..
ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. వ్యక్తిగతమైన దూషణకు పోకుండా అత్యంత హుందాతనంతో విమర్శలకు బదులిచ్చే విధానం రోశయ్య నుంచి నేటి రాజకీయనాయకులు నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. వాసవి సేవా సంఘం ప్రతినిధులు డిప్యూటీ సీఎం చేతులమీదుగా విజయశంకర దేశిక ట్రస్ట్, దేవనార్ ఫౌండేషన్, అమ్మానాన్న ఆనంద ఆశ్రమం సంస్థలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కును అందజేశారు. కాగా, రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, ఎమ్మెల్సీ దయానంద్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శ్రీరాం తాతయ్య, మాజీ ఎమ్మెల్యేలు అంబికా కృష్ణ, గిరిధర్ రావు, మాజీ మంత్రులు శిద్దా రాఘవరావు, ఎల్లంపల్లి శ్రీనివాసరావు, రోశయ్య కుమారులు శివసుబ్బారావు, శ్రీమన్నారాయణ మూర్తి, అల్లుడు పైడా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎకో టూరిజం పార్కు ప్రారంభం..
నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్‌లో పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించారు. సరికొత్త హంగులతో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం పార్కు, వృక్ష క్షేత్రం, వర్చువల్, వైల్డ్‌లైఫ్, మోడల్ సఫారీలను సీఎం ప్రారంభించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ హాజరై కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఫారెస్టు ఎకో టూరిజం అభివృద్ధి కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. గార్డెన్‌లో 75 వనాలతో రూపుదిద్దుకున్న వృక్ష పరిచయ క్షేత్రాన్ని, వైల్డ్‌లైఫ్ సఫారీలను ప్రారంభించారు. అటవీ అభివృద్ధి సంస్థ బ్యాటరీ వాహనాలను ప్రారంభించి, ఆ వాహనంలో గార్డెన్‌లో పర్యటించారు.
Updated Date - Dec 05 , 2024 | 03:08 AM