Tourism: హైదరాబాద్-సాగర్ మధ్య 4 లైన్ల రోడ్డు
ABN, Publish Date - Sep 01 , 2024 | 03:26 AM
నాగార్జున సాగర్-హైదరాబాద్ మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు నాలుగు వరుసల రహదారిని నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే, టూరిజం హబ్
బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం
సాగర్ టు సాగర్ పర్యాటక సర్క్యూట్
గోల్కొండ వద్ద కబ్జాలను తొలగించండి
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): నాగార్జున సాగర్-హైదరాబాద్ మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు నాలుగు వరుసల రహదారిని నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దేశ, విదేశాల్లోని బౌద్ధులను ఆకట్టుకునేలా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో అంతర్జాతీయ బౌద్ధ మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతోపాటు హుస్సేన్‌సాగర్‌లో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని కలిపి టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్‌లో భాగంగా బుద్థవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్‌ను పంపించింది.
రూ.25కోట్లతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని అందులో ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కొత్త పర్యాటక పాలసీపై శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని టూరిజం డెస్టినేషన్ సర్కిల్‌గా అభివృద్ధి చేయాలన్నారు. ట్యాంక్‌బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కైవాక్ వే డిజైన్ చేయాలని సూచించారు.
భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయస్థాయి డిజైన్లు తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి, ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అలాగే, గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకుగా మారాయని, ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అక్కడున్న నివాసితులు, దుకాణదారులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని సూచించారు.
Updated Date - Sep 01 , 2024 | 03:26 AM