ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: మూసీ నదిలోకి మురికి పోనియ్యం

ABN, Publish Date - Oct 08 , 2024 | 03:34 AM

మూసీ ప్రక్షాళన విషయంలో దూకుడు మీదున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నగరంలోని సీవరేజ్‌ను మూసీలో కలవకుండా చూసేందుకు ఉద్దేశించిన హైదరాబాద్‌ సమగ్ర సీవరేజీ మాస్టర్‌ ప్లాన్‌(సీఎ్‌సఎంపీ)కు కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు.

  • రూ.17,000 కోట్లతో సీవరేజ్‌ ప్రాజెక్టు.. అమృత్‌ 2 కింద సాయం చేయండి

  • 7,444 కిలోమీటర్ల మేర సివరేజ్‌ల నిర్మాణం

  • 27 మునిసిపాలిటీలు కలిపి మాస్టర్‌ ప్లాన్‌

  • మెట్రో రెండో దశ భారం సగం భరించాలి

  • కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

  • సివరేజ్‌ డీపీఆర్‌ను అందజేసిన ముఖ్యమంత్రి

  • వరద నష్టం పనులకు రూ.5438 కోట్లివ్వండి

  • ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమ్రంభీమ్‌ జిల్లాల్ని

  • నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించండి

  • విభజన సమస్యలను పరిష్కరించండి

  • హోంమంత్రి అమిత్‌ షాకు రేవంత్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మూసీ ప్రక్షాళన విషయంలో దూకుడు మీదున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నగరంలోని సీవరేజ్‌ను మూసీలో కలవకుండా చూసేందుకు ఉద్దేశించిన హైదరాబాద్‌ సమగ్ర సీవరేజీ మాస్టర్‌ ప్లాన్‌(సీఎ్‌సఎంపీ)కు కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు. మాస్టర్‌ ప్లాన్‌ను అమృత్‌ 2.0లో చేర్చి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను అభ్యర్థించారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి సోమవారం నిర్మాణ్‌ భవన్‌లో ఖట్టర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌తో పాటు సమీప 27 పురపాలక సంఘాలతో కలుపుకొని 7,444 కి.మీ మేర రూ.17,212.69 కోట్లతో సీఎ్‌సఎంపీకి డీపీఆర్‌ను రూపొందించినట్లు తెలిపారు. సదరు డీపీఆర్‌ను కేంద్ర మంత్రికి సీఎం అందజేశారు.


ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ ప్రజల జీవన ప్రమాణాలు ఉండాలనే లక్ష్యంతో నగరంతో పాటు సమీప మునిసిపాలిటీలలో 100 శాతం ద్రవరూప వ్యర్థాలను శుద్ధి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. హైదరాబాద్‌లో మురుగు శుద్ధి వ్యవస్థ పురాతనమైనదని, ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని తెలిపారు. సమీప పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదని చెప్పారు. హైదరాబాద్‌లో మూసీ నది 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోందని, దానికి ఇరువైపులా కలిపి 110 కిలోమీటర్ల మేర నగరంలోని మురుగు అంతా మూసీలోనే చేరుతోందని వివరించారు. ఈ మురుగు మూసీలో చేరకుండా ఉండేందుకు ట్రంక్‌ సీవర్స్‌ మెయిన్స్‌, లార్జ్‌ సైజ్‌ బాక్స్‌ డ్రెయిన్స్‌, కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్లతో డీపీఆర్‌ను రూపొందించినట్లు చెప్పారు. డీపీఆర్‌ను ఆమోదించాలని, పనుల అనుమతికి చొరవ చూపాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.


  • మెట్రో రెండో దశకు సహకరించండి

హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో భాగంగా ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర డీపీఆర్‌లు పూర్తయినట్టు ఖట్టర్‌కు రేవంత్‌ వివరించారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 వ్యయం అవుతుందని అంచనా వేశామని, కేంద్రం సగం భరించాలని కోరారు. త్వరలోనే డీపీఆర్‌ను సమర్పిస్తామని చెప్పారు. ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చేందుకు సహకరించాలని కోరారు.


  • వరద సాయం చేయండి

ఇటీవల భారీ వర్షాల వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు రూ.5438 కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు భారీ వర్షాల వల్ల తెలంగాణలో జరిగిన నష్టాన్ని అమిత్‌షాకు వివరించారు. 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, రహదారులు, కల్వర్టులు, చెరువులు, కాలువలు దెబ్బ తిన్నాయని, లక్షకు పైగా పశువులు, ఇతర మూగ జీవాలు మృతి చెందాయని తెలిపారు. కేంద్ర బృందం ఇప్పటికే నష్టపరిహారాన్ని అంచనా వేసిందని, తక్షణం రూ.5438 కోట్లు విడుదల చేస్తే మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతుల పనులు చేపడతామని తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద విడుదల చేసిన రూ.416.80 కోట్ల నిధులకూ, పునరుద్ధరణ, మరమ్మతు పనులకు విడుదల చేసే నిధులకూ ముడి పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.


వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో అదిలాబాద్‌, మంచిర్యాల, కుమ్రం భీమ్‌ అసిఫాబాద్‌ జిల్లాలను తిరిగి చేర్చాలని రేవంత్‌రెడ్డి అమిత్‌ షాను కోరారు. గతంలో ఈ జిల్లాలను నక్సల్స్‌ పీడిత జిల్లాల్లోంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌లు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాయని, ఈ రాష్ట్రాల నుంచి మావోయిస్టులు తెలంగాణలో కార్యక్రమాలను విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం, అలుబాక గ్రామాల్లో సీఆర్‌పీఎఫ్‌, జేటీఎఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌కు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లో ఉందని, రూ.18.31 కోట్లు విడుదల చేయాల్సి ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 1065 మందిని స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌లో చేర్చుకోవడానికి నిబంధనలు సడలించాలని కోరారు. ములుగు జిల్లా పేరూరు, ములుగు, కన్నాయిగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాముత్తారం, కాటారం పోలీస్‌ స్టేషన్లను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.


కొత్తగా నియమితులైన పోలీసు సిబ్బందికి గ్రేహౌండ్స్‌ ద్వారా తీవ్రవాద వ్యతిరేక వ్యూహాల్లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 2024-25 సంవత్సరంలో ఈ శిక్షణకు రూ.25.59 కోట్ల అదనపు బడ్జెట్‌ అవసరమని, ఆ మొత్తాన్ని విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజనల సమస్యల పరిష్కారానికి సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. షెడ్యూలు 9 లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీకి, షెడ్యూలు 10లోని సంస్థలకు సంబంధించిన వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు తోడ్పడాలని కోరారు. పునర్విభజన చట్టంలో ప్రస్తావించని ఆస్తులు, సంస్థలు తమవేని ఏపీ చెప్పుకుంటోందని, ఈ విషయంలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి అదనగా 29 ఐపీఎస్‌ పోస్టులు కేటాయించాలని అడిగారు. విభజన సమయంలో కేవలం 76 మంది ఐపీఎ్‌సలను కేటాయించారని గుర్తు చేశారు. ఐపీఎస్‌ కేడర్‌ సమీక్షను వెంటనే చేపట్టాలని అడిగారు. రెండు సమావేశాల్లో సీఎస్‌ శాంతకుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డీజీపీ జితేందర్‌, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పాల్గొన్నారు.


  • రేవంత్‌తో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. జీవో 111 కింద గ్రామాలను సుస్థిర అభివృద్ధి జోన్‌గా ప్రకటించాలని, పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్వాధీన పరుచుకున్న సీతంపూర్‌ ఆలయ భూముల గురించి, కాళేశ్వరం గురించి కూడా చర్చించినట్లు కొండా తెలిపారు.

Updated Date - Oct 08 , 2024 | 03:34 AM