CM Revanth Reddy: సంగెం నుంచి సీఎం మూసీ యాత్ర
ABN, Publish Date - Nov 06 , 2024 | 03:31 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ బాట పర్యటన తాత్కాలిక రూట్‌మ్యా్‌పను అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకుని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుంటారు.
కార్నర్ మీటింగ్‌తోపాటు రైతులతో చర్చ
8న జన్మదినం సందర్భంగా గుట్టకు సీఎం
యాదాద్రి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ బాట పర్యటన తాత్కాలిక రూట్‌మ్యా్‌పను అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకుని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుంటారు. అనంతరం మూసీ పునరుజ్జీవం కార్యక్రమంలో భాగంగా మూసీ నది వెంట యాత్ర చేపట్టనున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. వలిగొండ మండలం సంగెం బ్రిడ్జి వద్ద నుంచి యాత్ర చేపట్టనున్నారు. సంగెం బ్రిడ్జి వద్దే కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేలు సన్నాహాలు చేస్తున్నారు.
సంగెం వెళ్లే దారిలో బ్రిడ్జి చివర ఉన్న కాటమయ్య దేవాలయం నుంచి మూసీ పరిసర ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. అక్కడ నుంచి అసి్‌ఫనెహర్ కాల్వ వైపు సీఎం యాత్ర కొనసాగేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులు, వివిధ కుల వృత్తుల వారితో సీఎం మాట్లాడనున్నారు. మూసీ కాలుష్యంతో జరుగుతున్న నష్టంపై వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. భీమలింగం కత్వ వద్ద ఉన్న శివలింగానికి సీఎంతో పూజలు చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంగెం గ్రామ మూసీ పరివాహక ప్రాంతంలో పునరుజ్జీవ యాత్ర సభాస్థలాన్ని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి, నకిరేకల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు పరిశీలించారు.
సీఎం పర్యటనతో సంగెం బ్రిడ్జికి మోక్షం కలిగేనా?
మూసీ ఉగ్రరూపం దాల్చితే సంగెం బ్రిడ్జి మీదుగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతుంటాయి. ఈ బ్రిడ్జి ఎత్తు పెంచాలని స్థానికులు కొన్నేళ్లుగా కోరుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మూసీపై బ్రిడ్జిల విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేలు ఆయన దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. సంగెం బ్రిడ్జితో పాటు బీబీనగర్-భూదాన్ పోచంపల్లి మండలాలను కలిపే జూలూరు వాగు వద్ద బ్రిడ్జికి మోక్షం కలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Nov 06 , 2024 | 03:31 AM