CM Revanth Reddy: రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:45 AM
రాజకీయ పార్టీలు చేసే రెచ్చగొట్టే ప్రకటనలను విద్యార్థులు, నిరుద్యోగులు నమ్మవద్దని, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు, నిరుద్యోగులూ.. పోటీ పరీక్షలకు సిద్ధం కండి
విద్యార్థులకు చదువుతోపాటు.. సామాజిక స్పృహ కూడా ముఖ్యమే
విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి
సీఎంను కలిసిన కేజీబీవీ విద్యార్థులు
హైదరాబాద్/మంచిర్యాల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు చేసే రెచ్చగొట్టే ప్రకటనలను విద్యార్థులు, నిరుద్యోగులు నమ్మవద్దని, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అయితే విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ.. రెండూ ముఖ్యమేనని సీఎం అభిప్రాయపడ్డారు.చదువుకున్నవారు ప్రయోజకులు అవుతారని, సామాజిక స్పృహతో సమాజానికి సేవ చేస్తే హీరోలవుతారని చెప్పారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థులు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఆధ్వర్యంలో సీఎంని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచినందుకు సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తమ పాఠశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కేజీబీవీ విద్యార్థులు కోరారు.
దీంతో స్థానిక అధికారులతో స్థల ేసకరణ చేయించిన వెంటనే సొంత హాస్టల్ భవనం మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని, త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీల్లో డ్రాపవుట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని, ఇది యువతరంపై ఉన్న అతిపెద్ద బాధ్యత అని అన్నారు. యువత విద్య ను నిర్లక్ష్యం చేయొద్దని, సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన గంజాయి, డ్రగ్స్ లాంటి వ్యసనాల బారిన పడొద్దని సూచించారు. పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించాలని అన్నారు.
Updated Date - Nov 05 , 2024 | 03:45 AM