ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: సహించేది లేదు..

ABN, Publish Date - Oct 22 , 2024 | 03:59 AM

నేరాలకు పాల్పడే వారిని తామే శిక్షించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అది సరైంది కాదని, అందుకోసం పోలీస్‌ వ్యవవస్థ ఉందని చెప్పారు.

  • చట్టాన్ని చేతిలోకి తీసుకునేవారిపై కఠిన చర్యలు

  • భావోద్వేగాలు రెచ్చగొట్టాలని కొందరి ప్రయత్నం

  • శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి

  • ఈ విషయంలో రాజీ లేని కృషి చేస్తున్న పోలీసులు

  • అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

  • విధినిర్వహణలో మృతిచెందే కానిస్టేబుల్‌..

  • కుటుంబానికి కోటి పరిహారం, ఐపీఎ్‌సకు 2కోట్లు

  • పోలీస్‌ అమరవీరుల సంస్మరణ

  • దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యలు

  • మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌

  • ఏర్పాటుకు ఉత్తర్వులు.. శంకుస్థాపన చేసిన సీఎం

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): నేరాలకు పాల్పడే వారిని తామే శిక్షించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అది సరైంది కాదని, అందుకోసం పోలీస్‌ వ్యవవస్థ ఉందని చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కొందరు భావోద్వేగంతో, ఉన్మాదంతో మందిరాలపై, మసీదులపై దాడి చేసి.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్యాలమ్మ గుడిలో జరిగిన ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి బాధ్యులను అరెస్ట్‌ చేశారని గుర్తు చేశారు. తప్పిదాలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.


సోమవారం గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో జరిగిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయారు. పోలీస్‌ అమర వీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు గుండెలపై చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్ర పోతున్నారంటే దానికి కారణం పోలీసులేనన్నారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలంటే శాంతిభద్రతలు అత్యంత కీలకమని, శాంతిభద్రతలు లేకపోతే పెట్టుబడులు రావని అన్నారు. తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల విషయంలో రాజీ పడటం లేదని అభినందించారు. కేఎస్‌ వ్యాస్‌, పరదేశి నాయుడు, ఉమే్‌షచంద్ర, కృష్ణప్రసాద్‌ వంటి వందలాది మంది పోలీసు అధికారులు అమరులై శాంతిభద్రతలను కాపాడటంలో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.


  • ఆర్థికసాయంతో ఆదుకుంటాం..

పోలీస్‌ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తగిన ఆర్థికసాయం అందించి ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు. విధినిర్వహణలో అమరులయ్యే పోలీస్‌ సిబ్బంది కుటుంబ సభ్యులకు.. కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకు కోటి రూపాయలు, ఎస్సై, ఇన్‌స్పెక్టర్‌కు రూ.1.25 కోట్లు, డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీలకు రూ.1.50 కోట్లు, ఎస్పీ, ఆపై స్థాయి ఐపీఎస్‌ కుటుంబాలకు రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకు రూ.50 లక్షలు, ఎస్సై, ఇన్‌స్పెక్టర్‌, డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీలకు రూ.60 లక్షలు, ఎస్పీ, ఆ పైస్థాయి ఐపీఎ్‌సలకు కోటి రూపాయల సహాయం అందిస్తామన్నారు. తాత్కాలిక వైకల్యం బారిన పడే సిబ్బందిలో కానిస్టేబుల్‌ నుంచి అడిషనల్‌ ఎస్పీ స్థాయి వరకు రూ.10 లక్షలు, ఎస్పీ, ఆపైస్థాయి ఐపీఎ్‌సలకు రూ.12 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఇటీవల విధినిర్వహణలో మృతి చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ రాజీవ్‌రతన్‌ కుమారుడికి గ్రేడ్‌-2 ఉద్యోగం, కమాండెంట్‌ మురళీ కుటుంబ సభ్యులకు డిప్యూటీ ఎమ్మార్వో ఉద్యోగం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.


  • సమాజానికి రోల్‌మోడల్‌గా ఉండాలి..

సమాజానికి పోలీసులు ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్‌ సూచించారు. విధినిర్వహణలో సహనం కోల్పోతే కొత్త సమస్యలు వస్తాయన్నారు. 99 శాతం మంది నిబద్ధతతో పనిచేసి ఎక్కడో ఒక శాతం మంది తప్పు చేసినా.. మొత్తం పోలీస్‌ వ్యవస్థను వేలెత్తి చూపిస్తారని చెప్పారు. అలాంటి పరిస్థితి రానివ్వద్దన్నారు. పోలీసులు ఆత్మగౌరవంతో బతకాలని, ఎదుటివారు చులకనగా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని సూచించారు. పోలీ్‌సలకు ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారులు పోలీస్‌ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి.. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. మొహర్రం, బక్రీద్‌, క్రిస్మస్‌, వినాయక చవితి, హనుమాన్‌ జయంతి వంటి ఉత్సవాల సమయంలో మౌలిక సదుపాయాలు లేకపోయినా పోలీసులు అద్భుతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఇటీవల జరిగిన పోలీస్‌ నియామకాల్లో ఉన్నత విద్యనభ్యసించిన వారు కానిస్టేబుళ్లు, ఎస్సైలుగా చేరారని, గొప్ప లక్ష్యం కోసం యువత పోలీస్‌ ఉద్యోగంలో చేరుతున్నారని తెలిపారు. పోలీసులు బాధితులతో ఫ్రెండ్లీగా ఉంటూ నేరస్తులతో కఠినంగా వ్యవహరించాలన్నారు.


  • పంజాబ్‌లో విపత్కర పరిస్థితులు..

పంజాబ్‌లో యువత డ్రగ్స్‌కు బానిస అయ్యారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డ్రగ్స్‌ విషయంలో ఆ రాష్ట్రం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందన్నారు. తెలంగాణలో గత పదేళ్లలో గంజాయి, హెరాయిన్‌, కొకైన్‌ వంటి డ్రగ్స్‌ వినియోగం పెరిగిందని, రాష్ట్రంలో గంజాయి సాగు లేకపోయినా.. పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాల కట్టడికి తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరోను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఫిజికల్‌ పోలీసింగ్‌తోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించుకోవాలని పోలీస్‌ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త పద్ధతుల్లో వస్తున్నారని, సైబర్‌ నేరాల బారిన పడుతున్న వారిలో చదువుకున్నవారే ఎక్కువగా ఉంటున్నారని చెప్పారు. సైబర్‌ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీసుల కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అభినందించారని గుర్తు చేశారు. కాగా, గత ఫిబ్రవరిలో కూంబింగ్‌ ఆపరేషన్‌లో మృతి చెందిన గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ఆది ప్రవీణ్‌ కుటుంబాన్ని గోషామహల్‌ స్టేడియంలో సీఎం రేవంత్‌ పరామర్శించారు. తగినవిధంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీస్‌ అమరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన విశ్రాంత ఐపీఎస్‌ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వారు కూర్చున్న వేదిక వద్దకు సీఎం స్వయంగా వెళ్లి మాట్లాడారు. కాగా ఈ సందర్భంగా స్టేడియంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.


  • సీఎంకు పోలీస్‌ సంఘం కృతజ్ఞతలు..

పోలీస్‌ అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం గతంలో ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని భారీగా పెంచడం పట్ల పోలీస్‌ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. సీఎం నిర్ణయం పోలీస్‌ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి తెలిపారు.


  • యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ భవనానికి శంకుస్థాపన

పోలీసులు, పోలీసు అమరవీరుల కుటుంబాల పిల్లలకు, ఇతర యూనిఫామ్‌ సర్వీసు శాఖల ఉద్యోగుల పిల్లల కోసం ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ‘యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌’ను ఏర్పాటు చేయనుంది. ఈ స్కూల్‌ ఏర్పాటుకు ప్రాథమికంగా అనుమతిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రమాణాలు, నివాస సౌకర్యాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌తో పోలీసు పిల్లల కోసం ఒక ప్రత్యేక గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలంటూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీ్‌స(డీజీపీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈ స్కూల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ పాఠశాల భవనానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.


మంచిరేవులలో గ్రేహౌండ్స్‌ విభాగానికి చెందిన భూమిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ పాఠశాలను నిర్మించనున్నారు. వచ్చే విద్యా సంత్సరం నుంచి ఈ పాఠశాల అందుబాటులోకి వస్తుంది. మొదటగా 5 నుంచి 8వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ పై తరగతులు ప్రారంభమవుతాయి. పోలీ్‌సతోపాటు యూనిఫాం సర్వీసులైన అగ్నిమాపక శాఖ, ఇతర విభాగాల్లో పనిచేసి వారి పిల్లలకు యంగ్‌ ఇండియా స్కూల్‌లో చదువుకునే అవకాశం కల్పించనున్నారు. ఇందులో 15 శాతం స్థానిక పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, అదనపు డీజీపీ మహేష్‌ భగవత్‌, గ్రేహౌండ్స్‌ చీఫ్‌ స్టీఫెన్‌ రవీంద్ర, సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి, ఐజీ రమేష్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 03:59 AM