Bhupalpally: సింగరేణి ఓసీపీలతో దినదిన గండం!
ABN, Publish Date - Oct 19 , 2024 | 04:41 AM
లాభాలే లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ)ల కారణంగా పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
భూపాలపల్లి జిల్లాలో ప్రభావిత ప్రాంత ప్రజల ఇక్కట్లు.. భారీ పేలుళ్లతో ఇళ్లకు బీటలు.. అనారోగ్య సమస్యలు
ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ పట్టించుకోని యాజమాన్యం
చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి వేడుకోలు
భూపాలపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): లాభాలే లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ)ల కారణంగా పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. లక్ష్యానికి మించి బొగ్గును ఉత్పత్తి చేస్తున్న సింగరేణి అధికారులు.. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణను అస్సలు పట్టించుకోవట్లేదు. పేలుళ్ల కారణంగా వెలువడుతున్న దుమ్ము ధూళి, కార్బన్‌మోనాక్సైడ్ లాంటి విష వాయువులు పీలుస్తూ వేలాది మంది ప్రజలు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. పరిమితికి మించి మందుపాతరలు వినియోగిస్తుండడంతో పేలుళ్ల ప్రకంపనలకు పరిసరాల్లోని ఇళ్లు గోడలు బీటలు వారి క్రమంగా శిథిలమైపోతున్నాయి. భూపాలపల్లి జిల్లా పరిధిలో మొత్తం 3 ఉపరితల గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా.. ఇందులో 2 సింగరేణి యాజమాన్య నిర్వహణలో ఉన్నాయి. మరొకటి తాడిచర్ల ఓపెన్‌కాస్టు ప్రాజెక్టును ప్రైవేటు యాజమాన్యం నిర్వహిస్తోంది.
భూపాలపల్లి పట్టణానికి సమీపంలో ఓసీపీ-2 ప్రాజెక్టును ప్రారంభించిన 2017 నుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 230 ఇళ్లకు పగుళ్లు వచ్చి కూలే పరిస్థితికి చేరాయి. పేలుడు ధాటికి భారీ శబ్ధాలతో పాటు పలుమార్లు రాళ్లు, బొగ్గు పెళ్లలు ఇళ్లపై పడిన సందర్భాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఓసీపీ-2ను నిర్వహిస్తున్నట్లు ఇక్కడికి వచ్చిన ఉన్నతస్థాయి సింగరేణి డైరెక్టర్ల బృందం గతంలోనే తేల్చింది. జనావాసాలకు, ఓసీపీకి మధ్య క నీసం 500 మీటర్ల దూరం ఉండాల్సి ఉండగా.. కానీ ఓసీపీ-2కు శాంతినగర్‌కు మధ్య 98 మీటర్లు మాత్రమే ఉందని ఆ బృందం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ప్రారంభించకముందే నిబంధనల మేరకు లక్షలాది మొక్కలు నాటాల్సి ఉంది. కానీ కాలనీలకు, ఓసీపీకి మధ్య వందల సంఖ్యలో మొక్కలు కూడా నాటకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఆయా కాలనీల్లో కనీసం 6 నెలలకు ఒక్కసారైనా హెల్త్ క్యాంపులు నిర్వహించాల్సి ఉండగా.. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటివరకు గడిచిన 7 ఏళ్లలో హనుమాన్‌నగర్‌లో ఒక్కసారి మాత్రమే క్యాంపు నిర్వహించారు.
ఓసీపీ-3 పరిసరాల్లోనూ..
గణపురం మండలంలోని మాధవరావుపల్లి సమీపంలో చేపట్టిన ఓసీపీ-3 ప్రాజెక్టు పరిసరాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ప్రాజెక్టు చుట్టూ 10 గ్రామాలుండగా.. అందులో 5 గ్రామాలు పరుశురాంపల్లి, ధర్మరావుపేట, బస్వరాజుపల్లి, నగరంపల్లి, కొండాపూర్‌లపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక్కడ కూడా పగుళ్లతో ఇళ్లు కూలిపోయేదశకు చేరుతున్నాయనే ఆందోళన ప్రజల్లో కన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు ప్రభావిత గ్రామాల ప్రజలు పలుమార్లు విన్నవించినా ఏ మాత్రం మార్పులేదు. దీంతో ఓసీపీలపై పర్యావరణ శాఖతో సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Updated Date - Oct 19 , 2024 | 04:45 AM