Congress Workers: మహిళా యూట్యూబర్లను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
ABN, Publish Date - Aug 23 , 2024 | 04:10 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో గురువారం పంట రుణాల మాఫీ వివరాలను తెలుసుకోవడానికి వచ్చిన మిర్రర్ టీవీ విజయారెడ్డి, సిగ్నేచర్ టీవీ సరిత, ఇతర యూట్యూబర్లను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
కెమెరాలు, మొబైల్ ఫోన్లు లాక్కొని ఇబ్బందులు
రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఘటన
వంగూరు/వెల్దండ, ఆగస్టు 22: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో గురువారం పంట రుణాల మాఫీ వివరాలను తెలుసుకోవడానికి వచ్చిన మిర్రర్ టీవీ విజయారెడ్డి, సిగ్నేచర్ టీవీ సరిత, ఇతర యూట్యూబర్లను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉదయం గ్రామానికి వచ్చిన యూట్యూబర్లు రైతు రుణమాఫీ అందరికీ అయ్యిందా, రుణ మాఫీలో ఇబ్బందులు ఉన్నాయా? అన్ని కొందరు గ్రామస్థులను అడిగారు.
ఈ సందర్భంగా అక్కడే ఉన్న పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో తమ గ్రామంలో అనేక సమస్యలు ఉండేవని, అప్పుడు రాని మీరు ఇప్పుడు వచ్చి సమస్యలు సృష్టిస్తున్నారని యూట్యూబర్లను ప్రశ్నించారు. విచారణ చేయొద్దని వారి కెమెరాలు, సెల్‌ఫోన్లను లాక్కున్నారు. తమ కెమెరాలను తిరిగి తీసుకునేందుకు యూట్యూబర్లు ప్రయత్నం చేయగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మహిళలు అని కూడా చూడకుండా ఆసభ్య పదజాలంతో దూషిస్తూ అవమానపరిచారని యూట్యూబర్లు ఆవేదన వ్యక్తంచేశారు.
తమపై దాడి చేశారని పేర్కొంటూ వంగూరుకు వచ్చి పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించి గుండాయిజం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తమ మొబైల్ ఫోన్లు, కెమెరాలను ఇప్పించాలని పీఎ్‌సలో ఉన్న వెల్దండ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ మహేందర్‌లను కోరారు. ఇదిలాఉండగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాగర్‌కర్నూలు జిల్లా అధ్యక్షుడు గువ్వల బాల్‌రాజు విషయం తెలుసుకొని పోలీ్‌సస్టేషన్‌కు వచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
యూట్యూబ్ చానళ్ల వారు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, స్థానిక పోలీసులు యూట్యూబర్లు విజయారెడ్డి, సరితలకు రక్షణగా నిలిచి బందోబస్తు నడుమ వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కాగా, కొండారెడ్డిపల్లిలో మహిళా యూట్యూబర్లపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేయడం అమానుషమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. బీఆర్‌ఎస్ నేతలు వేముల ప్రశాంత్‌రెడ్డి, దేవీప్రసాద్, తదితరులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రుణమాఫీ జరిగిందా.. లేదా..? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన వారిపై దాడి చేయడం హేయమని పేర్కొన్నారు.
Updated Date - Aug 23 , 2024 | 04:10 AM