Mahbubnagar: ఆస్పత్రిలోనూ కలుషితాహారం
ABN, Publish Date - Nov 22 , 2024 | 02:48 AM
బడిలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన చిన్నారులకు అక్కడా పురుగులున్న అల్పాహారం పెట్టారు. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో ఈ ఘటన కలకలం సృష్టించింది.
మాగనూరు విద్యార్థులకు మహబూబ్‌నగర్ ఆస్పత్రి అల్పాహారంలో పురుగులు
పాఠశాలలో రెండో రోజూ విద్యార్థులకు పురుగుల అన్నం
భోజనం చేయని పిల్లలు.. ధర్నా
డీఈవో, హెచ్‌ఎం సస్పెన్షన్.. వంట ఏజెన్సీ రద్దు
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం), మాగనూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): బడిలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన చిన్నారులకు అక్కడా పురుగులున్న అల్పాహారం పెట్టారు. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో ఈ ఘటన కలకలం సృష్టించింది. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం తిన్నవారిలో 100 మంది విద్యార్థులు వాంతులు చేసుకుంటే, కొందరు కడుపునొప్పి.. తలనొప్పితో బాధపడ్డారు. వెంటనే ఉపాధ్యాయులు పిల్లల్లో కొందరిని మక్తల్ ప్రభుత్వాస్పత్రికి.. మరికొందరిని మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది విద్యార్థులకు గురువారం అల్పాహారంగా కిచిడీ పెట్టగా అందులో పురుగులొచ్చాయి. వార్డులో చికిత్స పొందుతున్న శివసాయి అనే విద్యార్థి తన ప్లేటులో ఉన్న కిచిడీలో పురుగులుండటం గమనించి తల్లిదండ్రులకు చెప్పాడు. మరికొంతమంది పిల్లలు కూడా అల్పాహారంలో పురుగులొచ్చాయని ఫిర్యాదు చేశారు.
ఆ పురుగులను వెంటనే స్టాఫ్‌నర్సుకు చూపించడంతో డైట్ కాంట్రాక్టరుకు విషయాన్ని ఆమె చేరవేసింది. స్పందించిన కాంట్రాక్టరు కిచిడీని తీసేసి ఉప్మా చేసి పంపారు. కాగా పిల్లల వార్డులో అల్పాహారంలో పురుగులొచ్చినట్లు తేలడంతో ముందుగా ఫుడ్ ఇన్స్‌పెక్టర్ మనోజ్‌కుమార్ వార్డులోని పిల్లలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని వంటశాలలో వంటకాలను, దినుసులను పరిశీలించారు. అన్నింటి నమూనాలను సేకరించారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ కూడా ఆస్పత్రికొచ్చి విద్యార్థులతో మాట్లాడారు. అయితే పురుగులున్న అల్పాహారం అంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని, రోగులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ఆయన పేర్కొనడం విశేషం. విద్యార్థులకు అందించిన భోజనంలో ఎలాంటి కల్తీ లేదని, నాణ్యత విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పురుగుల కిచిడీ ఘటనపై పూర్తి విచారణ చేశామని, నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించామని మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్ చెప్పారు. కాగా జనరల్ ఆస్పత్రిలో బాధిత విద్యార్థులను మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మళ్లీ పురుగుల అన్నమే
మాగనూరులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్నాహ్న భోజనంలో పురుగులు రావడం, తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించినా నిర్వాహకుల తీరు మారలేదు. రెండో రోజైన గురువారం కూడా ఆ బడి మధ్యాహ్న భోజనంలో పురుగులొచ్చాయి. చూసిన విద్యార్థులు భోజనం చేయలేదు. మళ్లీ మళ్లీ పురుగుల అన్నమే పెడతారా? అంటూ నిర్వాహకుల తీరుకు నిరసనగా పాఠశాల ఆవరణలో ధర్నా నిర్వాహించారు. పురుగులు ఉన్న బియ్యాన్ని వండటం వల్ల అన్నంలో పురుగులొచ్యాని, మధ్యాహ్న భోజనాన్ని అధికారులు పర్యవేక్షణలో నిర్వహించినా అన్నంలో పురుగు రావడం ఎంత వరకు సమంజసం అని విద్యార్థులు మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలో ఉన్న పురుగులు ఉన్న బియ్యం బస్తాలను ట్రాక్టర్ ద్వారా మక్తల్ సివిల్ సప్లై గోదాంకు తరలించారు. నాణ్యమైన బియ్యాన్ని తీసుకొస్తామని ఆర్డీవో రాంచంద్రయ్య విద్యార్థులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా బడిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నం తయారు చేసి వడ్డించారు.
మాగనూరు ఘటనపై సీఎం సీరియస్
మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయుడు మురళీధర్‌రెడ్డి, ఇన్‌చార్జిగా ఉన్న బాబుల్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. అలాగే వంట ఏజెన్సీలను రద్దు చేశారు. గురువారం మరోసారి భోజనంలో పురుగులు రావడంతో డీఈవో అబ్దుల్ గనీని సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో రాంచందర్, ఫుడ్ ఇన్స్‌ఫెక్టర్‌లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. పాఠశాలలోని వంట గది, స్టోర్ రూమును, వంటకు వినియోగించే బియ్యాన్ని నిత్యావసర సరకులను పరిశీలించారు. జరిగిన సంఘటన గురించి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో, వంట ఏజెన్సీలతో మాట్లాడి ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై ప్రతి రోజు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పరిశీలించి రుచి చూశాకే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. అనంతరం అదనపు కలెక్టర్ బెల్‌శాలం కూడా పాఠశాలను పరిశీలించారు.
Updated Date - Nov 22 , 2024 | 02:48 AM