ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Court: కొండా సురేఖకు సమన్లు!

ABN, Publish Date - Oct 11 , 2024 | 04:03 AM

మంత్రి కొండా సురేఖపై సినీ హీరో అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావా కేసులో ఆమెకు న్యాయస్థానం సమన్లు ఇచ్చింది.

  • నాగార్జున కేసులో విచారణకు రావాలి

  • 23న వచ్చి వివరణ ఇవ్వాలి: నాంపల్లి కోర్టు

  • సురేఖపై కేటీఆర్‌ క్రిమినల్‌ పరువునష్టం దావా

  • వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించారని ఫిర్యాదు

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖపై సినీ హీరో అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావా కేసులో ఆమెకు న్యాయస్థానం సమన్లు ఇచ్చింది. గురువారం నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ కోర్టులో రెండో సాక్షి మెట్ల వెంకటేశ్వర్‌ కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చారు. అంతకుముందు నాగార్జున, సుప్రియ ఇచ్చిన వాంగ్మూలాలను కూడా పరిశీలించిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖను ఈ నెల 23న కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. మరో వైపు ఇవే వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ నాంపల్లి కోర్టులో గురువారం క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు.


ఈ కేసు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది. సినీ నటులు నాగ చైతన్య, సమంత విడాకులకు తానే కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు నష్టం చేకూర్చాయని కేటీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేసిన తనపై సురేఖ నిరాధారమైన విమర్శలు చేసి వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి తొమ్మిదేళ్ల పాటు మంత్రి హోదాలో రాష్ట్ర ప్రగతి కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టానని కేటీఆర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.


అలాంటి తనపై రాజకీయంగా బురద జల్లేందుకు ఫోన్‌ ట్యాపింగ్‌, సినీ రంగ ప్రముఖులను బెదిరించడం, డ్రగ్స్‌, రేవ్‌ పార్టీలంటూ తనకు ఎలాంటి సంబంధం లేని అవాస్తవ విషయాలను ఆపాదిస్తూ అసత్యాలను కొండా సురేఖ మీడియా ముందు మాట్లాడి తన గౌరవ మర్యాదలకు భంగం కలిగించారని కేటీఆర్‌ పేర్కొన్నారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్‌ 356 ప్రకారం సురేఖపై క్రిమినల్‌ పరువు నష్టం కేసు నమోదు చేయాలని తన ప్రైవేట్‌ ఫిర్యాదులో కోరారు. ఈ కేసులో సాక్షులుగా తుల ఉమ, బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్‌, దాసోజు శ్రవణ్‌లను పేర్కొన్నారు. కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, టీవీ చానెళ్లలో ప్రసారమైన వార్తలు, పత్రికల్లో, వెబ్‌సైట్లలో ప్రచురితమైన వార్తా కథనాలను కలిపి మొత్తం 23 ఆధారాలను కోర్టుకు కేటీఆర్‌ న్యాయవాదులు సమర్పించారు.

Updated Date - Oct 11 , 2024 | 04:03 AM