Cyberabad: నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమి కబ్జా
ABN, Publish Date - Oct 26 , 2024 | 03:43 AM
అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలతో రూ. 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం అధికారులు అరెస్ట్ చేశారు.
రూ. 600 కోట్ల విలువైన స్థలానికి ఎసరు
ప్రైవేటు భూమిగా మార్చి చూపిన నిందితులు
బోరబండకు చెందిన ఆరుగురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలతో రూ. 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు 12.09 ఎకరాలకు సంబంధించి... 1978 నాటి పత్రాలను మార్చి నకిలీ పత్రాలు సృష్టించారని పోలీసులు గుర్తించారు. బోరబండకు చెందిన మహ్మద్ అబ్దుల్ రజాక్, గ్రీక్ బిల్డర్స్ ఎల్‌ఎల్‌పీ పార్టనర్ నవీన్ కుమార్ గోయల్, రంగారెడ్డి జిల్లా సబ్‌రిజిస్ట్రార్ జె గురుసాయిరాజ్, మహ్మద్ అబ్దుల్ ఆది, సైదా కౌసర్, ఆఫ్షాసారాతోపాటు మరికొందరు నిందితులు రాయదుర్గంలోని 12.09 ఎకరాలకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించారు. సబ్ రిజిస్ట్రార్ సహకారంతో రికార్డులను మార్చారు.
అంతేకాకుండా ప్రభుత్వ భూమిని రికార్డులో ప్రొహిబిటెడ్ లాండ్ నుంచి ప్రైవేటు భూమిగా మార్చి గ్రీక్ బిల్డర్స్‌తో కమర్షియల్, రెసిడెన్షియల్ నిర్మాణాలు చేపట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాస్తవానికి శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామంలోని సర్వే నెంబర్ 1, 3, 4, 5, 17, 19, 49 లలో ఉన్న 12.09 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేటాయించింది. ఇందులో 5.16 ఎకరాల్లో యూనిటీ మాల్‌ను నిర్మించాలనే ప్రణాళికలు కూడా ఉన్నాయి. యూనిటీ మాల్ నిర్మాణానికి కేంద్రం రూ.
202 కోట్ల నిధులు కూడా కేటాయించింది. ఈ భూమికి సంబంధించిన నకిలీ పత్రాల వ్యవహారం వెలుగులోకి రాగానే శేరిలింగంపల్లి తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగ అధికారులు నిందితులు నకిలీ పత్రాలతో భూమిని కబ్జా చేసినట్లు గుర్తించారు. నిందితులు బోరబండకు చెందిన మహ్మద్ అబ్దుల్ రజాక్, గ్రీక్ బిల్డర్స్ ఎల్‌ఎల్‌పీ పార్టనర్ నవీన్ కుమార్ గోయల్, రంగారెడ్డి జిల్లా సబ్‌రిజిస్ట్రార్ జె గురుసాయిరాజ్, మహ్మద్ అబ్దుల్ ఆది, సైదా కౌసర్, ఆఫ్షాసారాను అరెస్ట్ చేశారు.
Updated Date - Oct 26 , 2024 | 03:43 AM