Weather Update: నేడు, రేపు మోస్తరు వర్షాలు
ABN, Publish Date - Oct 17 , 2024 | 03:31 AM
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్
శ్రీశైలం ప్రాజెక్టుకు 73 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సాగర్ నుంచి 76 వేల క్యూసెక్కుల నీరు విడుదల
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, జో గులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
కాగా, కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర, కృష్ణా నదులకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు బుధవారం 55వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 50వేల క్యూసెక్కులను వదులుతున్నారు. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 40వేల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 73,573 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.1 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్‌కు 67,676 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా(312 టీఎంసీలు) నిండటంతో 4 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Updated Date - Oct 17 , 2024 | 03:31 AM