Bhatti Vikramarka: ఇండి కూటమి సమష్టి కృషి వల్లే ఝార్ఖండ్‌లో విజయం
ABN, Publish Date - Nov 24 , 2024 | 04:26 AM
ఝార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల్లో ఇండి కూటమి సమష్టి కృషి వల్లే విజయం సాధించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా విజయం సాధించలేకపోయిందని పేర్కొన్నారు.
రాష్ట్ర సంపద స్థానికులకే చెందాలంటూ ప్రచారం చేశాం
చొరబాటుదారులు పెరుగుతారంటూ బీజేపీ తప్పుడు ప్రచారం
మా కూటమి మాటలనే ప్రజలు నమ్మారు: భట్టి విక్రమార్క
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఝార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల్లో ఇండి కూటమి సమష్టి కృషి వల్లే విజయం సాధించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా విజయం సాధించలేకపోయిందని పేర్కొన్నారు. ఆ పార్టీ కొనుగోళ్ల గిమ్మిక్కులు సాగలేదని చెప్పారు. ఝార్ఖండ్ ఎన్నికల కోసం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధిష్ఠానం ఎన్నికల పరిశీలకుడిగా, స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. ఆ మేర కు ఎన్నికల్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే శుక్రవారం భట్టిని ఫలితాల పరిశీలకుడిగా నియమించారు. దాంతో ఆయన శనివారం ఉదయమే ప్రత్యేక విమానంలో ఝార్ఖండ్ వెళ్లారు. అక్క డి కాంగ్రెస్ నేతలతో సమావేశమై ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. ఇండి కూటమి విజయం ఖరారు కావడంతో రాంచీలోని జేఎంఎంనేత, సీఎం హేమంత్ సోరెన్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఝార్ఖండ్‌లోని ఖనిజాలు, వనరులు వంటి సంపద స్థానికులకే చెందాలని, ఆదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దంటూ ఎన్నికల్లో ప్రజలకు వివరించామని పేర్కొన్నారు.
రాష్ట్ర సంపద అందరికీ సమానంగా పంపిణీ కావాలన్న రాజ్యాంగ హక్కులను కాపాడుతామంటూ తమ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ఖర్గే.. ప్రజలకు హామీ ఇచ్చారని తెలిపారు. జేఎంఎం, కాంగ్రెస్ కూటమి గత ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించామని, మళ్లీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్పామన్నారు. అందుకే తమ కూటమి మాటలను ప్రజలు నమ్మారని, బీజేపీ పట్ల ఎలాంటి భ్రమలు లేవంటూ తేల్చేశారని చెప్పారు. ఇండి కూటమి గెలిస్తే బంగ్లాదేశ్ నుంచి వలసలు పెరుగుతాయని, చొరబాటుదారులు చొచ్చుకువస్తారంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందని, చొరబాటుదారులను నియంత్రించాల్సింది సరిహద్దుల్లోని బీఎ్‌సఎఫ్ అని, ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వ అజమాయీషీ కింద ఉందన్నారు. బీజేపీ వైఫల్యం వల్లే చొరబాటుదారులు పెరుగుతున్నారని ఆరోపించారు. ఝార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, ఇచ్చిన హామీ ల అమలుపై దృష్టి పెడతామని చెప్పారు. పేదల ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఝార్ఖండ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు పరిశీలకుడిగా, స్టార్ క్యాంపెయినర్‌గా కీలక బాధ్యతలు అప్పగించినందుకు రాహుల్, ఖర్గేకు కృతజ్ఞతలు చెప్పారు.
ఝార్ఖండ్ విజయంలో భట్టి కీలక భూమిక
ఝార్ఖండ్ ఎన్నికల్లో ఇండి కూటమి విజయం సాధించడంలో భట్టి కీలక భూమిక పోషించారు. ఏఐసీసీ ద్వారా స్టార్ క్యాంపెయినర్‌గా, ఎన్నికల సీనియర్ పరిశీలకుడిగా నియమితులైన వెంటనే ఆయన రాష్ట్రానికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. మొదటి దశలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జేడీల మధ్య సీట్ల పంపకంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఉమ్మడి ఎన్నికల ప్రచార వ్యూహం, కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారులో నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. ఝార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి, సీనియర్ నేతలందరూ ప్రచారంలో పాల్గొనే లా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, భట్టి కలిసి మ్యానిఫెస్టోను రూపొందించారు. రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం చేశారు. భారీ బహిరంగ సభలకన్నా బ్లాక్ స్థాయి సభలకు ప్రాధాన్యమిస్తూ స్థానిక నేతల్లో ఉత్సాహం నింపారు. 10రోజులపాటు జార్ఖండ్‌లో పర్యటిస్తూ ప్రచారం చేశారు.
ప్రియాంకకు మంత్రుల శుభాకాంక్షలు
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించడంపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్ధిళ్ల. శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రింయాకకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన ప్రియాంకకు.. అత్యధిక మెజారిటీతో వయనాడ్ ప్రజలు అమోఘమైన తీర్పునిచ్చారని కొనియాడారు.
Updated Date - Nov 24 , 2024 | 04:26 AM