ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంతం వద్దని సీఎంకు గతంలోనే చెప్పా

ABN, Publish Date - Nov 13 , 2024 | 05:03 AM

ఫార్మా కారిడార్‌ ఏర్పాటు విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రికి తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు.

  • లగచర్ల ప్రజలు చేసింది వంద శాతం తప్పే: డీకే అరుణ

  • ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రాజెక్టు వద్దు: ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి

వికారాబాద్‌, హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఫార్మా కారిడార్‌ ఏర్పాటు విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రికి తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఫార్మా బాధితుల విషయమై తాను కలెక్టర్‌తో ముందే మాట్లాడానని చెప్పారు. లగచర్లలో జరిగిన ఘటన దురదృష్టకరమని, అలాంటి దాడులను ఎవరైనా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. సీఎం సొంతం నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డితో కలిసి వికారాబాద్‌లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలు తమకు వద్దని లగచర్ల సహా ఐదు గ్రామాలు ఎప్పట్నించో వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. భూసేకరణకు వ్యతిరేకంగా గతంలోనూ ధర్నాలు చేశారని, ఆయా నిరసనల్లో తాను పాల్గొన్నానన్నారు. లగచర్ల ప్రజలు చేసింది వందశాతం తప్పేనని, అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు బుధవారం తాను లగచర్లలో పర్యటిస్తానని డీకే అరుణ ప్రకటించారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. లగచర్ల ఘటనలో తప్పు చేసిన వారిని శిక్షించాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. లగచర్ల ఘటనలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఫార్మా కంపెనీలకు తాము వ్యతిరేకం కాదని, ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రాజెక్టులు పెట్టొద్దని ఆయన కోరారు.


  • రైతులపై అక్రమ కేసులు పెడితే ఊర్కోం : ఈటల

లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెడితే ఊరుకోబోమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫార్మా పరిశ్రమకు భూమి అవసరమైతే ఆ కంపెనీ యాజమాన్యమే సేకరిస్తుందని ప్రభుత్వ మధ్వవర్తిత్వం అవసరం లేదన్నారు. రైతుల ఇష్ట ప్రకారమే భూ సేకరణ చేయాలి తప్ప, బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని ఈటల స్పష్టం చేశారు. కాగా, లగచర్ల ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. తనపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేసినా గ్రామాల్లో నిర్బంధం విధించి 50 మందిపై అక్రమ కేసులు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ఢిల్లీలో ఉన్నప్పుడే సీఎం రేవంత్‌ అక్కడికి వెళ్లడం వెనక మతలబు ఉందని కాసం అన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 05:04 AM