Share News

మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:11 AM

మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో భాగంగా అక్కడ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించిన క్రమంలో నిర్వాసిత కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ఉత్తర్వులు జారీ.. చెరువులు, నాలాల నిర్వాసితుల గుర్తింపు

మూసీ రివర్‌ బెడ్‌లోని 1600 ఇళ్ల తొలగింపు షురూ

ఆ తర్వాత బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలు కూడా..

నిర్వాసిత కుటుంబాలు 16 వేలు ఉంటాయని అంచనా

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయింపు

బుధవారం నుంచి ఇంటింటికీఅధికారుల బృందం

ఔటర్‌ లోపల చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ

శంషాబాద్‌ నుంచి ఫ్యూచ ర్‌ సిటీకి మెట్రోపై రూట్‌ మ్యాప్‌

దసరా వరకు మెట్రో విస్తరణపై డీపీఆర్‌ రూపకల్పన

మూసీ రివర్‌ ఫ్రంట్‌, మెట్రో విస్తరణపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో భాగంగా అక్కడ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించిన క్రమంలో నిర్వాసిత కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మూసీ పరీవాహక ప్రాంతంలో పదివేల కుటుంబాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింతగా ఉంటుందని.. సుమారు 16 వేల కుటుంబాలుండొచ్చని అంచనా వేస్తున్నారు. వీళ్లందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, అధికారుల బృందం బుధవారం నుంచి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. తొలి విడతలో రివర్‌ బెడ్‌లోని 1600 ఇళ్లను తొలగించే ప్రక్రియ వెంటనే మొదలవుతుందని చెప్పారు. తర్వాత బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలను తొలగిస్తామన్నారు. కాగా మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల ఇళ్లతో పాటు చెరువులు, నాలాల వద్ద ఉంటున్న పేద కుటుంబాల వివరాలను కూడా సేకరించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఒక్క పేద కుటుంబం కూడా రోడ్డున పడకూడదని, అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌, హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌, మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఇందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కమాండ్‌ కంట్రో ల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న అన్ని చెరువులు, కుంటలు, నాలాలను గుర్తించి వాటి ఎఫ్టీఎల్‌, బఫర్‌ జోన్లను గుర్తించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా వీటికి సంబంధించిన నివేదికను తయారుచేయాలన్నారు. ప్రతి ఆక్రమణలో అర్హులైన పేదలకు విధిగా పరిహారం అందేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.


మెట్రో విస్తరణపై డీపీఆర్‌ రెడీ చేయండి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీకి వేయాల్సిన మెట్రో మార్గానికి సంబంధించిన నివేదికను రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఓల్డ్‌ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌, ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్టతో పాటు ఇతర ప్రాంతాలకు మెట్రో విస్తరణపై అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్‌కు సంబంధించి పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్థం చేసి కేంద్రానికి సమర్పించాలని సీఎం ఆదేశించారు.

2Mogilayya.jpg

మొగిలయ్యకు ఇంటిస్థలం పత్రాలు

ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటిస్థలం పత్రాల్ని సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. మొగిలయ్యకు హయత్‌నగర్‌లో 600 చ.గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అందుకు సంబంధించిన పత్రాల్ని ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి సీఎం మంగళవారం అందజేశారు. స్థల పత్రాలు అందజేయడం పట్ల సీఎంకు మొగిలయ్య కృతజ్ఞతలు తెలిపారు.


మినీ డిగ్రీ ప్రోగ్రాం నేడు ప్రారంభం

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా(బీఎ్‌ఫఎ్‌సఐ) రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ‘మినీ డిగ్రీ ప్రోగ్రాం’ బుధవారం ప్రా రంభం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎ్‌ఫయూ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్‌ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న 10వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణను అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మేలు జరిగేలా కాలేజీల ఎంపిక జరిగిందని ఉన్నత విద్యామండలి అధికారులు వివరించారు. శిక్షణ పొందే విద్యార్థుల కోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందిస్తామన్నారు. అందులో విద్యార్థుల వివరాలు ఉంటాయి. వారి బ యోడేటా, చదువుతున్న కాలేజీ, విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల్లో శిక్షణ వంటి వివరాలతో ప్రొఫైల్స్‌ను ఏర్పాటు చేస్తారు. బీఎ్‌ఫఎ్‌సఐ రంగాల్లో పేరొందిన కంపెనీలు.. తమకు కావాల్సిన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ఈ పోర్టల్‌ను వారధిగా చేసుకుంటాయి. అంటే.. క్యాంపస్‌ సెలెక్షన్ల మాదిరిగానే.. ఈ పోర్టల్‌ ద్వారా కంపెనీలు నియామకాలను చేపడతాయి. తమకు కావాల్సిన ప్రమాణాల మేరకు విద్యార్థులను ఎంపిక చేసుకుని, వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేసే వీలుంటుంది. ఈ కార్యక్రమం వల్ల డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగ భరోసా కల్పించవచ్చని ప్ర భుత్వం భావిస్తోంది. ‘మినీ డిగ్రీ ప్రోగ్రాం’ను అందిం చే కాలేజీల వివరాలను మంగళవారం ప్రకటించారు.

Updated Date - Sep 25 , 2024 | 04:11 AM