Buffer Zone: తేలియాడే డబుల్ ఇళ్లు!
ABN, Publish Date - Sep 12 , 2024 | 04:35 AM
కూడు, గుడ్డ తర్వాత పేదలకు కావాల్సింది తమకంటూ ఓ చిన్న గూడు! అది.. డబుల్ బెడ్‌రూమ్ రూపంలో లభిస్తే వారికి అంతకన్నా ఆనందం ఏముంటుంది?
రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌లోని దిలావర్‌ఖాన్ చెరువు బఫర్‌జోన్‌లో..
10 ఎకరాల్లో 1296 కుటుంబాల కోసం జీ ప్లస్ 9తో 12 బ్లాకులు
6 బ్లాకులు పూర్తి.. మిగతావి వివిధ దశల్లో
8 ఏళ్లుగా పనులు.. అప్పటి నుంచీ నీళ్లలోనే
తుర్కయంజాల్ మాసాబ్ చెరువు అలుగు నాలాకు అటూ ఇటూ నిర్మాణం
హయత్‌నగర్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కూడు, గుడ్డ తర్వాత పేదలకు కావాల్సింది తమకంటూ ఓ చిన్న గూడు! అది.. డబుల్ బెడ్‌రూమ్ రూపంలో లభిస్తే వారికి అంతకన్నా ఆనందం ఏముంటుంది? మరి.. అలాంటి ఇళ్లను ఎక్కబడితే అక్కడ నిర్మించి ఇస్తే లబ్ధిదారులు తీసుకుంటారా? పేదలకు కావాల్సింది ఇళ్లే అయినప్పుడు అవి ఎక్కడ నిర్మించి ఇచ్చినా తీసుకుంటారని అనుకున్నారేమో గత ప్రభుత్వ హయాంలో ఇదిగో ఇలా చుట్టూ నీరు చేరేలా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారు! నీళ్లపై తేలియాడే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మునిసిపాలిటీ ఇంజాపూర్ గ్రామ పరిధిలోనివి! ఈ ఇళ్లు నిర్మించింది పూర్తిగా బఫర్‌జోన్‌లో! తుర్కయంజాల్ మాసబ్ చెరువు అలుగు పోస్తే.. ఆ ప్రవాహం 30 ఫీట్ల వెడల్పు గల నాలా గుండా ఇంజాపూర్‌లోని దిలావర్‌ఖాన్ చెరువులోకి వస్తుంది.
ఆ నాలాకు అటూ ఇటూ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టారు. పిల్లర్లు, స్లాబులు, గోడలతో కొన్ని బ్లాకులు 70శాతం మేర పూర్తయితే.. ఇంకొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. 2016-2017లో పనులు మొదలైతే ప్రతి వర్షాకాలంలోనూ ఇలా బ్లాకుల చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. ఇంజాపూర్‌లోని దిలావర్‌ఖాన్ చెరువు బఫర్‌జోన్ సర్వేనంబరు 126లో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల అంచనా వ్యయంతో జీ ప్లస్ 9తో 1296 కుటుంబాలు ఉండేందుకు 12 బ్లాకులు నిర్మించడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటి వరకు 6 బ్లాకుల నిర్మాణాలు పూర్తి చేశారు. వీటికి ప్లాస్టరింగు జరగాల్సి ఉంది. అవి కాకుండా మరో రెండు బ్లాకుల నిర్మాణ పనులు సగం వరకు చేరుకున్నాయి.
మరో 4 బ్లాకులు సెల్లార్ల దశకే పరిమితమయ్యాయి. భారీ వర్షాలకు మాసబ్ చెరువు నిండి అలుగు పోయడంతో ఆ ప్రవాహానికి దిలావర్‌ఖాన్ చెరువు నిండి బ్యాక్ వాటర్ మొత్తం డబల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి చేరుకుంది. ఇళ్ల నిర్మాణ సమయంలో పక్క నుంచి కాలువ తీశారు. అయినా భారీగా వచ్చే అలుగు నీటితో డబల్ బెడ్ రూమ్ ఇళ్లు వరదతో మునిగిపోయాయి. పిల్లర్ పునాదులకు వేసిన ఇనుప చువ్వలు ఎనిమిదేళ్లుగా నీళ్లలోనే ఉన్నాయి. నిర్మాణ దశ నుంచి కాంట్రాక్టర్ మోటర్ల ద్వారా నీటిని బయటకు తొడి పనులు చేశారు. ఎంత తోడినా మళ్లీ మళ్లీ వరద వస్తుండటంతో ఆ కాంట్రాక్టర్ తుదకు చేతులెత్తేశాడు. ఏడాది క్రితమే పనులు నిలిపివేశాడు. ఎనిమిదేళ్లుగా నీళ్లు చేరి ఉండటంతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది.
ఇరిగేషన్ ఎన్‌వోసీ లేకుండానే...
ఇంజాపూర్ దిలావర్‌ఖాన్ చెరువు పరీవాహక ప్రాంతంలో నిర్మించిన డబల్ బెడ్ రూం ఇళ్లకు ఏలాంటి ఎన్‌వోసీ తీసుకోకుండానే ఆగమేఘాలపై పనులు ప్రారంభించారు. చెరువు పరీవాహక ప్రాంతంలో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూం ఇళ్లకు ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్‌వోసీ ఉందా? అని ఇంజాపూర్ గ్రామానికి చెందిన బొక్క వంశీధర్‌రెడ్డి 2021లో ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ డీఈఈని సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. దీనికి డీఈఈ... తాము ఏలాంటి ఎన్‌వోసీ ఇవ్వలేదని, తమను ఎవరూ సంప్రదించలేదని లిఖితపూర్వకంగా ఇచ్చారు.
Updated Date - Sep 12 , 2024 | 05:42 AM