ED Raids: మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు..
ABN, Publish Date - Sep 28 , 2024 | 04:29 AM
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.
కుమారుడు హర్షరెడ్డికి చెందిన ‘రాఘవ గ్రూప్’ ఆఫీసుల్లోనూ తనిఖీలు
రాష్ట్ర పోలీసులకు సమాచారమివ్వని ఈడీ
హర్షరెడ్డి లగ్జరీ వాచీలపై కస్టమ్స్ కేసు
రూ.7 కోట్ల విలువైన 7 వాచీలు!
మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు
పలు పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం
సోదాలు జరుగుతున్నా యథావిధిగా విధులకు మంత్రి పొంగులేటి హాజరు
హైదరాబాద్/నార్సింగ్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్ర పోలీసులకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ నుంచి వచ్చిన 15 ఈడీ బృందాలు.. జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంతోపాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిపాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగాయి. సీఆర్‌పీఎఫ్ బలగాల భద్రత నడుమ ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీ్‌సతోపాటు పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీశారు. హర్షరెడ్డి ఆడిటర్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి చెందిన ఫాంహౌ్‌సలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సైబరాబాద్ పోలీసులు ఫాంహౌస్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను, ఇతరులను ఆ దరిదాపుల్లోకి రానివ్వలేదు.
ఈ సోదాలు ఎందుకంటే..
హాంకాంగ్‌లో నివాసం ఉండే మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ గత ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చాడు. అతని వద్ద కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన పాటెక్ ఫిలిపె 5740, బ్రెగుయెట్ 2759 బ్రాండ్స్‌కు చెందిన రెండు విలాసవంతమైన గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చేతి గడియారాల విలువ రూ.1.73 కోట్లుగా నిర్ధారించారు. మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్‌ను కస్టమ్స్ అధికారులు విచారించగా మధ్యవర్తి నవీన్‌కుమార్ పేరు వెల్లడించాడు. ఈ క్రమంలో నవీన్‌కుమార్ ద్వారా పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సుమారు రూ.7 కోట్లు విలువ చేసే ఏడు లగ్జరీ వాచీలు చేరినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వాటికి క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్లు కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా మార్చి 28న చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షరెడ్డికి నోటీసులు జారీ చేశారు. మనీలాండరింగ్ వ్యవహారం కావడంతో డీఆర్‌ఐ అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. కస్టమ్స్, డీఆర్‌ఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. తాజా సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
రోజువారీ పనుల్లో మంత్రి..
శుక్రవారం తెల్లవారుజాము నుంచి మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టాయి. అయినప్పటికీ మంత్రి, యథావిధిగా తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈడీ సోదాల సమయంలో పలువురు రాజకీయ ప్రముఖులు మంత్రి నివాసానికి చేరుకున్నారు.
ఈడీ దాడులు కక్ష పూరితమే: మహేశ్‌కుమార్ గౌడ్
మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు రాజకీయ కక్ష పూరిత చర్యల్లో భాగమేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల లోపాయికారీ ఒప్పందంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి దాకా ఈడీ చేసిన దాడుల్లో 96 శాతానికి పైగా ప్రతిపక్ష నేతల మీదే జరిగాయని చెప్పారు. ప్రత్యర్థులను భయపెట్టేందుకు బీజేపీ.. కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందన్నారు. హైడ్రా ఆపరేషన్లలో నష్టపోతున్న పేద ప్రజల్ని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.
Updated Date - Sep 28 , 2024 | 04:29 AM