Teacher Posts: టీచర్ల నియామకాల్లో ‘వర్గీకరణ’ లేనట్టే!
ABN, Publish Date - Aug 20 , 2024 | 03:44 AM
రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం కనిపించడం లేదు.
న్యాయ, సాంకేతిక సమస్యలు తప్పవు
నియామక ప్రక్రియే జాప్యమయ్యే ముప్పు!
ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణ లేకుండానే భర్తీ!
డీఎస్సీ ఫలితాల వెల్లడికి అధికారుల కసరత్తు
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం కనిపించడం లేదు. వర్గీకరణ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులేగాక, సాంకేతిక సమస్యలూ ఉత్పన్నమై మొత్తం నియామక ప్రక్రియే నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రస్తుతానికి వర్గీకరణను పక్కన పెట్టి నియామకాలను చేపట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. గత నెల 18 నుంచి ఈ నెల 5 వరకు పరీక్షలను నిర్వహించారు.
ఈ పరీక్షల ప్రాథమిక కీని కూడా విడుదల చేశారు. సెప్టెంబరు మొదటి వారంలో ఫలితాలను వెల్లడించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అవసరమైతే ఇప్పటికే నోటిఫికేషన్లను ఇచ్చిన పోస్టుల భర్తీలోనూ వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అధికారులు కొంత అధ్యయనం చేశారు. టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో రిజర్వేషన్ల అమలుపై స్పష్టత ఇచ్చారు. దానికి విరుద్ధంగా ఇప్పుడు రిజర్వేషన్లను అమలు చేస్తే.. సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని భావిస్తున్నారు.
అదే జరిగితే ఈ పోస్టుల భర్తీ తీవ్ర ఆలసమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగానే రిజర్వేషన్లను అమలు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే ప్రకటనలు ఇచ్చిన పోస్టుల విషయంలో ఎస్సీ వర్గీకరణ అమలు సాధ్యం కాదని న్యాయశాఖ అధికారులు కూడా స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. దీంతో డీఎస్సీ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ అమలును పక్కన పెట్టాలని నిర్ణయించారు. ఉపాధ్యాయ పోస్టులను 95 శాతం స్థానికులతో, 5 శాతం అందరి (నాన్‌లోకల్)తో భర్తీ చేయనున్నారు. ఈ నాన్‌లోకల్ కోటాలో ఎక్కువగా తెలంగాణతో పాటు ఏపీకి చెందిన అభ్యర్థులు అర్హత పొందే అవకాశం ఉంది. అయితే, జిల్లాలు, సజ్జెక్టుల వారీగా ఉన్న పోస్టుల సంఖ్యను పరిశీలిస్తే ఈ నాన్‌లోకల్ కోటాలో ఎక్కువ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు
. ఇక డీఎస్సీ పరీక్షలను రాష్ట్ర యూనిట్‌గా నిర్వహించారు. పోస్టుల భర్తీని మాత్రం జిల్లా యూనిట్‌గా చేపట్టనున్నారు. దీంతో మెరిట్ జాబితాలనూ జిల్లాల వారీగా రూపొందించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో టీచర్ పోస్టుల భర్తీని చేపట్టనున్నారు.
రాష్ట్రంలో భార్తీ చేస్తున్న
ఉపాధ్యాయ పోస్టుల వివరాలు
పోస్టు సంఖ్య
ఎస్‌ఏ 2,629
ఎస్‌జీటీ 6,508
భాషా పండితులు 727
పీఈటీలు 182
ఎస్‌ఏ 220
(స్పెషల్ కేటగిరీ)
ఎస్‌జీటీలు 796
(స్పెషల్ కేటగిరీ)
మొత్తం 1 1,062
Updated Date - Aug 20 , 2024 | 03:44 AM