నాగారం భూములపై ఈడీ నజర్!
ABN, Publish Date - Oct 23 , 2024 | 05:16 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది.
50 ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతమైనట్లు ఫిర్యాదులు
ఇదే విషయంలో అప్పటి తహసీల్దారు జ్యోతిపై కేసు నమోదు
నేడు ఈడీ విచారణకు అమోయ్ కుమార్
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. ఈ భూములపై నడుస్తున్న రెండు కేసుల్లో ఆర్థిక వ్యవహారాలు ఉండడంతో ఈడీ విచారణకు దిగినట్లు తెలిసింది. నాటి కలెక్టర్‌ను కూడా విచారణకు పిలవడంతో చర్చనీయాంశంగా మారింది. నాగారంలో సర్వే నంబరు 181లోని 92 ఎకరాలు, 182లోని 10.2 ఎకరాలు కలిపి మొత్తం 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఇందులో 50 ఎకరాల భూమి తమదేనంటూ భూదాన్ బోర్డు వాదిస్తోంది. వాస్తవానికి ఈ భూమి మొత్తం గతంలో జబర్ద్‌స్తఖాన్ పేరుపై ఉంది. అనంతర కాలంలో ఆయన కుమారుడు నవాబ్ హాజీఖాన్ సర్వే నంబరు 181లోని 50 ఎకరాలను భూదాన్ బోర్డుకు దానం చేశారని బోర్డు వాదిస్తోంది.
ఇదిలా ఉండగా 2021లో హాజీఖాన్‌కు తాను వారసురాలినని, 42 ఎకరాలు తనవేనంటూ ఖాదరున్నీసా సక్సేషన్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఆగమేఘాలపై ఆమె పేరు మీద రికార్డులు మారిపోయాయి. క్షేత్రస్థాయిలో ఆర్డీవో, తహసీల్దారు, స్థానిక ఆర్‌ఐలు, సీనియర్ అసిస్టెంట్ అందరూ ఈమెకు అనుకూలంగా పనిచేశారు. తర్వాత భూమిని ఆమె నుంచి ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసిన తర్వాత.. రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించారు. దీనిపై ఎన్నికల సమయంలో ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ జరిపి తదుపరి క్రయవిక్రయాలు జరగకుండా ధరణిలో నిషేధిత జాబితాలో చేర్చారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై దస్తగిరి షరీఫ్ కోర్టును ఆశ్రయించగా.. 17వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు మహేశ్వరం పోలీసులు అప్పటి తహసీల్దారు జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.
63 గజాల డాక్యుమెంట్‌తో 51.22 ఎకరాలు రిజిస్ట్రేషన్
నాగారంలోని సర్వే నంబర్లు 181, 182లో మిగిలిన 51.22 ఎకరాల భూమి మహ్మద్ అజీజ్‌ఖాన్, ఉన్నీసాబేగం, మున్వార్‌ఖాన్ పేర్లపై కొన్నాళ్లుగా రికార్డుల్లో ఉంది. ఇటీవల ఈ భూమిని మాణిక్యమ్మనగర్‌కు చెందిన చంద్రయ్యగౌడ్ మరికొందరు కలిసి కొనుగోలు చేశారు. విలువైన ఈ భూములపై కన్నేసిన చాంద్రాయణగుట్టకు చెందిన సాహెబ్ జాహేద్ ఖుర్షీఖాన్ కందుకూరు మండలం మహ్మద్‌గూడకు చెందిన మహ్మద్ ఆసిఫ్ జానీ, చార్మినార్‌కు చెందిన మహ్మద్ హసన్, మహ్మద్ అబ్బాస్, అలీమ్‌లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. హైదరాబాద్‌లోని శాస్త్రిపురంలో 1976లో చేసుకున్న 63 గజాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను అడ్డుపెట్టుకుని 51.22 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఈ భూమికి సంబంధించి చంద్రయ్యగౌడ్, ఇతరులపై కోర్టులో కేసు వేశారు. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను నిర్ధారించాలని కోర్టు అప్పట్లో కలెక్టర్‌ను ఆదేశించింది. రెవెన్యూ అధికారులు విచారణ జరిపి, అసలు పట్టాదారు చంద్రయ్యగౌడ్ అని నిర్ధారించారు. ఆయన ఫిర్యాదుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో అప్పటి తహసీల్దారు జ్యోతిపై కేసు పెట్టిన తర్వాత ఆమెను విజిలెన్స్ అధికారులు విచారించినట్లు తెలిసింది.ఈ కేసులో ఫిర్యాదులు అందడంతో ఈడీ విచారణ చేపట్టినట్లు సమాచారం. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్‌కుమార్‌ను విచారణకు పిలిచినట్లు తెలిసింది.ఆయన బుధవారం విచారణకు హాజరు కానున్నారు.
Updated Date - Oct 23 , 2024 | 05:16 AM