Loan Waiver: రుణమాఫీ కాలేదని.. రైతు ఆత్మహత్య
ABN, Publish Date - Sep 07 , 2024 | 05:11 AM
పంటలు పండకపోవడంతో పుట్టి పెరిగిన ఊరు నుంచి బతుకుదెరువు కోసం మరోచోటుకు పోయి రెక్కల కష్టం చేసుకొని బతుకుతున్న ఆ వ్యక్తి రుణమాఫీపై గంపెడాశలు పెట్టుకున్నాడు.
మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద ఘటన.. అతడు, తల్లికి కలిపి రూ.3లక్షలకు పైగా పంట రుణం
ఇద్దరికీ ఒకే రేషన్ కార్డు.. అందుకే మాఫీ కాలేదా?
2 సూసైడ్ నోట్లు.. చావుకు తల్లి కూడా కారణమంటూ ఆవేదన!
దుబ్బాక, మేడ్చల్ టౌన్, సెప్టెంబరు 6: పంటలు పండకపోవడంతో పుట్టి పెరిగిన ఊరు నుంచి బతుకుదెరువు కోసం మరోచోటుకు పోయి రెక్కల కష్టం చేసుకొని బతుకుతున్న ఆ వ్యక్తి రుణమాఫీపై గంపెడాశలు పెట్టుకున్నాడు. తీసుకున్న పంట రుణం కట్టే స్థోమత లేక రెన్యువల్ చేస్తూ వచ్చిన అతడు తనకు పథకం వర్తిస్తే.. రూ.1.92 లక్షలు మాఫీ అయి గుండెల మీద ఉన్న భారం పోతుందనుకున్నాడు! అయితే అతడికి రుణమాఫీ కాలేదు. అన్నకు గతంలో ఓసారి.. ఇప్పుడూ మొత్తంగా రెండుసార్లు రుణమాఫీ జరిగినా, తనకు మాఫీ వర్తించలేదంటూ కొన్నాళ్లుగా తీవ్ర మనోవేదనతో ఉన్న అతడు ఎటూపాలుపోని స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
మృతుడు సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూపాలపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సోలిపేట సురేందర్ రెడ్డి (52). దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, దివంగత సోలిపేట రామలింగారెడ్డికి సురేందర్ రెడ్డి స్వయాన చిన్నాన్న కుమారుడు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. చిట్టాపూర్ గ్రామానికి చెందిన సోలిపేట ప్రతాపరెడ్డి, సుశీల దంపతులకు రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి కుమారులు. వారసత్వంగా వచ్చిన భూమిలో ఇద్దరు కుమారులకు 4.05 ఎకరాల చొప్పున రాగా.. తల్లి సుశీల పేరిట రెండు ఎకరాలు ఉంచారు. సోదరులిద్దరూ కుటుంబాలతో కలిసి బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు వలసొచ్చారు. భార్య మంజుల, కుమారుడితో కలిసి సురేందర్ రెడ్డి మూడేళ్లుగా మేడ్చల్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నాడు. భార్యాభర్తలు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నారు.
తల్లి సుశీల.. పెద్ద కుమారుడు రవీందర్ రెడ్డి వద్ద ఉంటోంది. ఊర్లో ఉన్న ఇల్లు కూలిపోగా ఉన్న భూమినంతా కౌలుకిచ్చారు. 2012లో చిట్టాపూర్ ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో అన్న రవీందర్ రెడ్డి, తల్లి సుశీలతో పాటు సురేందర్ రెడ్డి రూ.40వేల రుణం తీసుకున్నాడు. అప్పు కట్టలేక రెన్యువల్ చేస్తూ వస్తున్నాడు. చివరిసారి గత ఏడాది నవంబరు నెలలో రెన్యువల్ చేశాడు. తాజాగా అతడి రుణం వడ్డీతో కలిపి రూ.1.92 లక్షలకు, తల్లి పేరిట తీసుకున్న రుణం రూ.1.15 లక్షలకు చేరింది. ఇటీవల జరిగిన రుణమాఫీలో సురేందర్ రెడ్డి, సుశీలకు మాఫీ జరగలేదు. గతంలో ఓసారి, తాజాగా మళ్లీ సోదరుడు రవీందర్ రెడ్డికి రుణమాఫీ జరిగిందని.. తనకు మాత్రం పథకాన్ని వర్తింపజేయలేదని సురేందర్ రెడ్డి ఆవేదనకు గురయ్యాడు.
నెల రోజులుగా తల్లి, సోదరుడితో కలిసి బ్యాంకుకు తిరుగుతున్నాడు. తల్లి పేరు తన రేషన్ కార్డులో ఉండటంతోనే మాఫీ జరగలేదని.. వేర్వేరుగా రేషన్ కార్డులు ఉంటే మాఫీ జరిగేదని బంధువుల వద్ద ఆవేదన పంచుకున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మేడ్చల్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఇనుప నిచ్చెనకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు మృతుడి వద్ద బ్యాంకు స్లిప్‌ల మీద రాసివున్న రెండు సూసైడ్ నోట్లు లభ్యమయ్యాయి. ఒకదాంట్లో.. ‘చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కానందున ఆత్మహత్య’ అని.. మరో దాంట్లో ‘నా చావుకు కారణం నా అమ్మ’ (ఇద్దరి పేర్లూ ఒకే రేషన్ కార్డులో ఉండటం?) అని రాసి ఉంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదైంది.
సురేంద్ రెడ్డి ఆత్మహత్య బాధాకరం: హరీశ్
హైదరాబాద్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రకటనలతో రైతులు ఆత్మస్థయిర్యం కోల్పోతున్నారని, రుణమాఫీ కాదేమోనన్న ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి హరీ్‌షరావు శుక్రవారం ఎక్స్‌వేదికగా పేర్కొన్నారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తనకెంతో బాధ కలిగించిందని పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని.. ప్రభుత్వంపై మనమంతా కలిసి పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు.
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
భీమదేవరపల్లి, సెప్టెంబరు 6: ఆర్థిక ఇబ్బందులతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామానికి చెందిన మాలమర్రి రవీందర్ (52) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వంగర పోలీసుల కథనం ప్రకారం.. రవీందర్-కవిత దంపతులకు అశ్విని, అన్వేష్ పిల్లలు. అశ్విని ఎంఏ, బీఈడీ పూర్తి చేసింది. అన్వేష్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఈ కుటుంబానికి నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. పిల్లల ఉన్నత చదువు కోసం లక్షల్లో అప్పులు చేశాడు. పత్తి, మొక్కజొన్న పంట సాగులో సరైన దిగుబడి రాకపోవడం.. అప్పులు ఎలా తీర్చాలో పాలుపడకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన రవీందర్ బుధవారం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లాడు. రాత్రి ఇంటికి కూడా రాలేదు. శుక్రవారం అక్కడ ఓ చింతచెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో రవీందర్ కనిపించాడు.
Updated Date - Sep 07 , 2024 | 05:11 AM