TG: మామ అల్లుడు పాపాల భైరవులు
ABN, Publish Date - May 03 , 2024 | 04:22 AM
నలభై ఏళ్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గాన్ని మామ అల్లుడు పాపాల భైరవుల్లాగా పట్టి పీడిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నలభై ఏళ్లుగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్నారు
ఆ బ్రహ్మరాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తా
కొమురెల్లి మల్లన్న సాక్షిగా రుణమాఫీ అమలు
హరీశ్‌రావుతో రాజీనామా చేయించి
సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా
దుబ్బాకకు రఘునందన్ తెచ్చింది గాడిద గుడ్డే
మొన్న కేసీఆర్‌కు బై చెప్పాం.. ఇక మోదీకి..!
సిద్దిపేట, ఆసిఫాబాద్, కుత్బుల్లాపూర్
సభలు, రోడ్‌షోలలో సీఎం రేవంత్‌రెడ్డి
సిద్దిపేట, ఆసిఫాబాద్, హైదరాబాద్ సిటీ, మే 2 (ఆంధ్రజ్యోతి): నలభై ఏళ్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గాన్ని మామ అల్లుడు పాపాల భైరవుల్లాగా పట్టి పీడిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు గుప్పించారు. ఏనుగులు తినే మామ పోతాపోతా పీనుగులను తినే అల్లుడిని తెచ్చి పెట్టిండని ఎద్దేవా చేశారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గురువారం రాత్రి సిద్దిపేటలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
అరుంధతి సినిమాలో బొమ్మాళిలాగా సిద్దిపేటను పట్టిపీడిస్తున్న బ్రహ్మరాక్షసుల నుంచి విముక్తి కలిగించడానికే ఈ గడ్డ మీద అడుగుపెట్టానని చెప్పారు. 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంఽధీని గెలిపించిన ఘనత ఇక్కడి ప్రజలదేనని గుర్తు చేశారు. అందుకు కృతజ్ఞతగా ఇందిర హయాంలో ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దారన్నారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి బీసీ యువకుడికి అవకాశం కల్పించామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేశామని, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని, 16 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దొరల గడీలను బద్దలు కొట్టాలంటే కాంగ్రె్‌సకు ఓటు వేయాలని, లేదంటే బానిస బతుకులు తప్పవని పిలుపునిచ్చారు.
ఎక్కడి నుంచో వచ్చిన వెంకట్రామారెడ్డి (బీఆర్‌ఎస్ అభ్యర్థి) చరిత్ర మీకు తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ డిపాజిట్ గల్లంతు చేయాలని సూచించారు. వాడుపోతే వీడు, వీడుపోతే వాడు అన్నట్లుగా ఒకరుపోతే ఒకరు ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని.. చంద్రశేఖర్‌రావు, రఘునందన్‌రావు, హరీశ్‌రావు, తారకరామారావు అందరూ ఒక్కటేనని రేవంత్ విమర్శించారు. ‘ఆ రావు అయినా.. ఈ రావు అయినా ఏ రాయి అయితే ఏమిటి తల పగలగొట్టుకోవడానికి? ఈ ‘రావు’లు మనకు అవసరమా? అందుకే బీసీ బిడ్డకు ఓట్లు వేసి గెలిపించాలి. గెలిపిస్తే ముదిరాజ్‌కు మంత్రి పదవి ఇస్తా. బీసీ-డీ నుంచి బీసీ-ఏకు ముదిరాజుల సామాజికవర్గాన్ని మార్చుతా’ అని హామీ ఇచ్చారు. యూపీఏ పదేళ్ల పాలనలో తెలంగాణకు అనేక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు అందిస్తే.. మోదీ పదేళ్ల పాలనలో గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు. దుబ్బాకలో కూడా రఘునందన్‌రావు (బీజేపీ అభ్యర్థి) వేల కోట్ల నిధులు తెస్తానని చెప్పి, గాడిదగుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు.
జనం వస్తారా అని సందేహించారు
హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్లేటప్పుడు ఓ మిత్రుడు సిద్దిపేట మీటింగ్‌కు జనం వస్తారా అని సందేహం వ్యక్తం చేశాడని రేవంత్ చెప్పారు. ఆ తర్వాత ఆసిఫాబాద్‌లో బయల్దేరినప్పుడు కూడా మంత్రి సీతక్క.. ఓసారి కనుక్కోమని సూచించారన్నారు. కానీ, వేలాది మంది వస్తారనే నమ్మకంతోనే సిద్దిపేటకు వచ్చానని, తన నమ్మకం వమ్ము కాలేదని సీఎం స్పష్టం చేశారు. నిర్బంధాలు దాటుకుని పెద్ద సంఖ్యలో ప్రవాహంలాగా జనం తరలివచ్చారని, సిద్దిపేట ప్రజల పౌరుషాన్ని చూశాక.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తనకు సంపూర్ణమైన నమ్మకం కలిగిందన్నారు.
పంద్రాగస్టున సిద్దిపేటకు స్వాతంత్య్రం
పంద్రాగస్టులోగా రైతుల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను గుర్తు చేస్తూ.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా రైతులందరికీ పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి హరీశ్‌రావుతో రాజీనామా చేయిస్తానని సీఎం ప్రకటించారు. రుణమాఫీ చేసి లక్ష మందితో ఇదే చౌరస్తాలో సభ పెడతానని చెప్పారు. హరీశ్‌రావు రాజీనామాతోపాటు లెక్కపత్రం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తానని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లుగానే పంద్రాగస్టు రోజున సిద్దిపేటకూ స్వాతంత్య్రం వస్తుందన్నారు.
దయాకర్, నేనూ వేరు కాదు
పదవుల పరంగా పలువురికి మంచి అవకాశాలు కల్పించామని సీఎం చెబుతుండగా.. ఆయనతోపాటే ఉన్న అద్దంకి దయాకర్ గురించి కార్యకర్తలు నినదించారు. దీంతో రేవంత్ స్పందిస్తూ.. ‘దయాకర్‌కు జర పెద్దది ఇద్దామనే అనుకున్న. దయాకర్‌దే ముఖ్యమంత్రి కుర్చీ.. నా పనంతా సగం ఆయననే చేస్తుంటడు. దయాకర్, నేను వేరు కాదు. ఆయనకు మంచి పదవి ఇస్తాం. కష్టపడ్డవాళ్లను గుర్తిస్తాం’ అని ప్రకటించారు. కాగా, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణకు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ పోయినట్లే..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో నిర్వహించిన జనజాతర సభలో, హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిపిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేయాలని యోచిస్తోందని, దానికోసమే 400 సీట్లు పక్కాగా రావాలని పదేపదే ప్రచారం చేస్తోందన్నారు. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ కొల్పోయినట్టేనని అన్నారు. కుమ్రం భీం, రాంజీగోండ్‌లపోరాట స్ఫూర్తితో బీజేపీపై పోరాడుతానని చెప్పారు. డిసెంబరులో కేసీఆర్ బాయ్ బాయ్ చెప్పారని, ఇప్పుడు మేలో మోదీకి బాయ్‌బాయ్ చెప్పాలని ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను రద్దు చేసి, గాడిద గుడ్డు ఇచ్చినవారికి కర్రు కాల్చి వాతపెట్టాలని, మోదీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు.
Updated Date - May 03 , 2024 | 04:22 AM