Electricity : ఫిక్స్‌డ్ చార్జీలపెంపు!
ABN, Publish Date - Sep 19 , 2024 | 04:06 AM
రాష్ట్రంలో లోటెన్షన్ (ఎల్‌టీ) కేటగిరీలోని విద్యుత్ వినియోగదారులపై ఫిక్స్‌డ్ చార్జీల (డిమాండ్ చార్జీ) రూపంలో అదనపు భారం పడబోతోంది.
నెలకు 300 యూనిట్ల విద్యుత్ దాటిన గృహ వినియోగదారులకు వర్తింపు
ప్రస్తుతం ఎల్టీ కేటగిరీలో ఫిక్స్‌డ్ చార్జీ రూ.30
కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రూ.150
హెచ్‌టీ కేటగిరీలో విద్యుత్ చార్జీలూ పెంపు
33కేవీ కనెక్షన్లకు యూనిట్‌కు 50 పైసలు, 132/ఆపై కనెక్షన్లకు రూపాయి వరకు భారం
ఈఆర్‌సీకి వార్షికాదాయ అవసరాల నివేదికలో డిస్కమ్‌ల ప్రతిపాదనలు
రూ.1200 కోట్ల అదనపు ఆదాయం కోసం
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లోటెన్షన్ (ఎల్‌టీ) కేటగిరీలోని విద్యుత్ వినియోగదారులపై ఫిక్స్‌డ్ చార్జీల (డిమాండ్ చార్జీ) రూపంలో అదనపు భారం పడబోతోంది. నెలలో 300 యూనిట్లకు మించి విద్యుత్‌ను వినియోగించుకున్న వారికి ఈ చార్జీలు వర్తించనున్నాయి. ప్రస్తుతం గృహ కనెక్షన్ల లోడ్ సామర్థ్యం (కాంట్రాక్ట్‌డ్ లోడ్) ఆధారంగా ప్రతి కిలోవాట్ (కేడబ్ల్యూ) లోడ్‌కు రూ.10 చొప్పున ఫిక్స్‌డ్ చార్జీలు విధిస్తున్నారు. దీంతో నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగించే గృహ వినియోగదారులకు ఫిక్స్‌డ్ చార్జీల కింద రూ.30 భారం పడుతోంది. అయితే ఇకపై ఈ చార్జీలను కిలోవాట్‌కు రూ.10 నుంచి రూ.50కి పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే నెల విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించిన వారికి ఫిక్స్‌డ్ చార్జీలు రూ.150కి పెరగనున్నాయి.
ఎల్టీ కేటగిరీకి ఫిక్స్‌డ్ చార్జీలు మాత్రమే పెరగనుండగా, హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ వినియోగదారులకు మాత్రం విద్యుత్ బిల్లులు షాక్ కొట్టబోతున్నాయి. హెచ్‌టీ కేటగిరీలో ఇటు విద్యుత్ చార్జీలు, అటు ఫిక్స్‌డ్ చార్జీలు రెండడూ పెరగబోతున్నాయి. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రాష్ట్రంలో రూ.1200 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్) బుధవారం రాత్రి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదించాయి. ఇందుకు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి.
హెచ్‌టీ కేటగిరీలో విద్యుత్ చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్‌డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి మొత్తం రూ.800 కోట్ల పెంపును ప్రతిపాదించాయి. మిగిలిన రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారులకు ఫిక్స్‌డ్ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకునే అవకాశమివ్వాలని కోరాయి. అయితే ఎల్టీ కేటగిరీలోని ఇతర వినియోగదారులకు సంబంధించిన ఫిక్స్‌డ్ చార్జీల పెంపునకు కూడా డిస్కమ్‌లు ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. లోటెన్షన్ కేటగీరీలోకి గృహాలు, గృహేతర/వాణిజ్య, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, వీధి దీపాలు, తాగుటి సరఫరా పథకాలు, సాధారణ వినియోగదారులు వస్తుండగా, వీటికి సంబంధించిన ఫిక్స్‌డ్ చార్జీలు మాత్రమే పెరగనున్నాయి. విద్యుత్ చార్జీలను మాత్రం యథాతథంగా కొనసాగించాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి.
హెచ్‌టీలో ఇక ఒకే చార్జీలు..
హెచ్‌టీ కేటగిరీలో 11కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యం .. అనే మూడు ఉప కేటగిరీల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, మూడింటికీ వేర్వేరు చార్జీలను విధిస్తున్నారు. ప్రస్తుతం అన్నింటికన్నా 11 కేవీ కనెక్షన్ల చార్జీలు అధికంగా ఉన్నాయి. అయితే ఇకపై మిగిలిన రెండు కేటగిరీల చార్జీలు కూడా 11కేవీ కనెక్షన్ల చార్జీలకు సమానమయ్యేలా.. 33కేవీ కనెక్షన్లకు యూనిట్ విద్యుత్‌పై అర్ధరూపాయి వరకు, 132కేవీ/ఆపై సామర్థ్యం కలిగిన కనెక్షన్లకు రూపాయి వరకు పెంచనున్నారు. హెచ్‌టీ కేటగిరీలో పరిధిలోకి.. సాధారణ పరిశ్రమలు, లైట్స్ అండ్ ఫ్యాన్స్, కోళ్ల ఫారాలు, సీజనల్ పరిశ్రమలు, ఫెర్రో అల్లయ్ యూనిట్లు, ఇతరులు, విమానాశ్రయాలు, రైల్వే ేస్టషన్లు, బస్ ేస్టషన్లు, తాత్కాలిక సరఫరా వంటి వినియోగదారులు వస్తారు. ఈ కేటగిరీల వినియోగదారులు తమ అవసరాల మేరకు 11కేవీ, 33కేవీ, 132కేవీ/ఆపై సామర్థ్యంతో విద్యుత్ కనెక్షన్లను కలిగి ఉన్నారు.
ఆదాయ లోటు రూ.13,022 కోట్లు..
రాష్ట్ర డిస్కమ్‌లు 2024-25లో రూ.13,022 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనా వేశాయి. ఇందులో ఎస్పీడీసీఎల్ వాటా రూ.8093 కోట్లు కాగా, ఎన్పీడీసీఎల్ వాటా రూ.4929 కోట్లు. విద్యుత్ చార్జీల పెంపుతో రూ.1200 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామని, మిగిలిన రూ.11,822 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందజేస్తుందని నివేదించాయి.
Updated Date - Sep 19 , 2024 | 04:06 AM