ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Krishna River: ఆల్మట్టి నుంచి సాగర్‌ దాకా గేట్లు బంద్‌

ABN, Publish Date - Aug 13 , 2024 | 03:45 AM

కృష్ణానదికి వరదలు తగ్గిపోవడంతో అన్ని ప్రాజెక్టుల గేట్లు మూసుకున్నాయి. సోమవారం ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్‌ దాకా.. తుంగభద్ర మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసేశారు. అన్నింటిలోనూ సంతృప్తికర స్థాయిలో నీటి నిల్వలున్నాయి.

  • కృష్ణా బేసిన్‌లో వరదలు తగ్గుముఖం పట్టడంతోనే..

  • అన్ని ప్రాజెక్టుల్లోనూ సంతృప్తికర స్థాయిలో నిల్వలు

  • కృష్ణా బేసిన్‌లో వరదలు తగ్గుముఖం..

  • గేటు గల్లంతుతో తుంగభద్ర గేట్లన్నీ ఓపెన్‌

  • తుంగభద్రలో గేట్లన్నీ ఓపెన్‌

  • 99,567 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో స్టాప్‌లాక్‌ బిగింపునకు 4 రోజులు

  • ముంపు లేకుండా రోజుకు లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల

హైదరాబాద్‌/గద్వాల/దోమలపెంట, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదికి వరదలు తగ్గిపోవడంతో అన్ని ప్రాజెక్టుల గేట్లు మూసుకున్నాయి. సోమవారం ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్‌ దాకా.. తుంగభద్ర మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసేశారు. అన్నింటిలోనూ సంతృప్తికర స్థాయిలో నీటి నిల్వలున్నాయి. ఆల్మటి పూర్తి సామర్థ్యం 123 టీఎంసీలకు ప్రస్తుతం 118.22 టీఎంసీలున్నాయి. 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. జల విద్యుదుత్పత్తి ద్వారా 15 వేల క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో నమోదైంది. నారాయణపూర్‌ పూర్తిసామర్థ్యం 33.31 టీఎంసీలకు.. 33.12 టీఎంసీలున్నాయి. 15 వేలు ఇన్‌ఫ్లో ఉండగా, జలవిద్యుదుత్పత్తి ద్వారా 6 వేల క్యూసెక్కులు విడుదలవుతోంది.


ఇక జూరాల ప్రాజెక్టులో 8.449 టీఎంసీలున్నాయి. ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా గేట్లను మూసేయడంతో పాటు జల విద్యుదుత్పత్తిని కూడా నిలిపివేశారు. తుంగభద్రలో 19వ గేటు కొట్టుకుపోవడంతో ఆ గేటుపై ఒత్తిడి తగ్గించేందుకు మిగిలిన 32 గేట్లు కూడా ఎత్తి 99,567 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో 97.753 టీఎంసీల నీరుంది. 25,571 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇక శ్రీశైలానికి 77,598 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా జల విద్యుదుత్పత్తి ద్వారా 68,210 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.


ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలకు 194.30 టీఎంసీలున్నాయి. ఇటు సాగర్‌ గేట్లను మధ్యాహ్నం 2 గంటల సమయంలో మూసేశారు. ఇన్‌ఫ్లో 68,211 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదవగా.. 47,035 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో రికార్డయింది. ప్రాజెక్టులో 312 టీఎంసీలకు 308 టీఎంసీలున్నాయి. ఇక గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులకు వరద నిరాశజనకంగానే ఉంది. సింగూరుకు 576, నిజాంసాగర్‌కు 152, ఎస్సారెస్పీకి 4,083, కడెం 3,187, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3,580 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది.


  • స్టాప్‌లాక్‌ బిగింపునకు 4 రోజులు..

తుంగభద్ర ప్రాజెక్టు గేటు మరమ్మతుల్లో ప్రాజెక్టు బోర్డు, కర్ణాటక, ఆంధ్ర ఇంజనీరింగ్‌ నిపుణులు నిమగ్నమయ్యారు. వరద నీరు వృథాగా సముద్రం పాలు కాకుండా అడ్డుకోవడానికి.. 19వ గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్‌లాక్‌ గేట్‌ అమర్చి.. దానిని పూర్తిగా మూసేయాలని నిర్ణయించారు. తుంగభద్ర బోర్డు సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. మరమ్మతులపై హైదరాబాద్‌కు చెందిన ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు, కర్ణాటక నిపుణుల ఆధ్వర్యంలో సమాలోచనలు జరిపింది. డ్యామ్‌ గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉంటుంది.


అంత పెద్ద స్టాప్‌లాక్‌ గేట్‌ను అమర్చడం కష్టం కావడంతో నాలుగు అడుగుల చొప్పున ఐదు బ్లాకులు తయారుచేసి ఒక్కొక్క బ్లాక్‌ను అమర్చేలా సన్నాహాలు చేస్తున్నారు. బ్రిడ్జి పైనుంచి క్రేన్‌ సాయంతో ప్రస్తుత గేట్‌ గాడిలో ఒక్కో బ్లాక్‌ కిందకు దించి.. ఆ గేటును పూర్తిగా క్లోజ్‌ చేస్తామని బోర్డు ఇంజనీర్లు తెలిపారు. నారాయణ ఇంజనీరింగ్‌, హిందూస్థాన్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు ఈ బ్లాక్‌లను తయారుచేశాయి. మంగళవారం నుంచి బిగించడం ప్రారంభిస్తారు. ఇది పూర్తి కావడానికి 4 రోజులు పట్టవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ ప్రారంభించాలంటే స్పిల్‌లెవల్‌ 1,613 అడుగుల వరకు డ్యామ్‌ను ఖాళీ చేయాలి. ప్రస్తుతం 1630.97 అడుగుల వరకు నీటి నిల్వ ఉంది. ఇంకా 17 అడుగులు ఖాళీ చేయాలి. దీంతో ముంపు సమస్యలు తలెత్తకుండా రోజూలక్ష క్యూసెక్కుల్లోపే దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - Aug 13 , 2024 | 03:45 AM

Advertising
Advertising
<