GHMC: చెత్త వేస్తే చలానా!
ABN, Publish Date - Nov 19 , 2024 | 02:13 AM
ట్రాఫిక్ చలానా తరహాలో.. రోడ్ల పక్కన చెత్త వేసేవారికి జరిమానా విధించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) రంగం సిద్ధం చేస్తోంది. వాహనాల నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల ఇంటికి జరిమానా వివరాలు పంపనున్నారు.
ట్రాఫిక్ జరిమానా తరహాలో విధింపు
రోడ్లపై వ్యర్థాలు వేయకుండా నిఘా
సీసీ కెమేరాలు.. క్షేత్ర స్థాయి ఫొటోలు
యాప్ రూపకల్పనలో జీహెచ్‌ఎంసీ
డిసెంబరు 1 నుంచి అందుబాటులోకి!
చెత్త బుట్టలు లేని దుకాణాలు సీజ్
హైదరాబాద్ సిటీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ చలానా తరహాలో.. రోడ్ల పక్కన చెత్త వేసేవారికి జరిమానా విధించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) రంగం సిద్ధం చేస్తోంది. వాహనాల నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల ఇంటికి జరిమానా వివరాలు పంపనున్నారు. నడుచుకుంటూ వచ్చి చెత్త పారబోసేవారికీ చలానా వేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను బల్దియా ఐటీ విభాగం రూపొందిస్తోంది. డిసెంబరు 1 నుంచి దీనిని అందుబాటులోకి తేనున్నారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రోడ్లపై వ్యర్థాలు వేసే వాణిజ్య సముదాయాలపైనా ప్రత్యేక దృష్టిసారించనున్నారు. పలుసార్లు సూచించినా పట్టించుకోకుంటే వ్యాపార అనుమతి రద్దుతో పాటు అవసరమైతే దుకాణాలను సీజ్ చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో పారిశుధ్య కార్మికులు వస్తున్నా.. కొందరు ఉద్దేశపూర్వకంగా స్వచ్ఛ ట్రాలీలకు చెత్త ఇవ్వడం లేదు. భార్యాభర్తలు ఉద్యోగులైతే, పనులకు వెళ్లే కుటుంబాల వారు, బ్యాచిలర్లదీ ఇదే తీరు. బస్తీలు, మురికివాడల్లోనూ ఇంతే. వీరంతా వ్యర్థాలను రోడ్లపై వేస్తున్నారు. దీనిని నివారించేందుకు కార్మికులను సాయంత్రం వరకు కాపలా ఉంచితే.. అర్ధరాత్రి తర్వాత పారబోస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నిఘా, జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల (జీవీపీ) వద్ద ఇప్పటికే సీసీ కెమెరాలున్నాయి. వీటి పుటేజీ ఆధారంగా.. చెత్త వేసేవారి వాహనాల నంబర్లు గుర్తిస్తారు. నడుస్తూ వచ్చి చెత్త వేసేవారి ఫొటోలను క్షేత్రస్థాయి సిబ్బంది తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, జవాన్లు, మొబైల్ వినియోగంపై అవగాహన ఉన్న పారిశుధ్య కార్మికులకూ ఈ బాధ్యతలు అప్పగిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జరిమానా అధికారం క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పగిస్తే అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ తప్పనిసరి చేయనున్నారు. తొలిసారి ఉల్లంఘనకు రూ.200, రెండోసారి రూ.500 చలానా విధించాలని భావిస్తున్నారు. ఇది క్రమంగా పెరగనుంది. ఉల్లంఘన ఎన్నోసారి? ఎంత జరిమానా? అన్నది యాప్‌లో ఉండేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. నిర్మాణ రంగ వ్యర్థాలు రోడ్ల పక్కన వేసేవారినీ గుర్తించి జరిమానా వేయనున్నారు. కాగా, ప్రతి దుకాణం వద్ద చెత్త బుట్టలు (బిన్) ఏర్పాటు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ ఇప్పటికే వ్యాపారులకు నోటీసులిచ్చింది. అయినా, కొందరు దుకాణాలు మూశాక రోడ్లపై వ్యర్థాలు వేస్తున్నారు. వీరిపై కఠినంగా వ్యవహరించనున్నారు. రూ.1000 నుంచి రూ.10 వేల వరకు జరిమానాతో పాటు.. రెండు, మూడుసార్లు ఉల్లంఘన అనంతరం కూడా బుట్టలు ఏర్పాటు చేయకుంటే అనుమతి రద్దుతో పాటు, దుకాణాన్ని సీజ్ చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
Updated Date - Nov 19 , 2024 | 02:13 AM