Yadagirigutta: గుట్టలో స్వర్ణ తాపడం పనులకు శ్రీకారం
ABN, Publish Date - Nov 21 , 2024 | 05:20 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు.
భువనగిరి అర్బన్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రధానాలయంలో ప్రతిష్ఠామూర్తుల వద్ద బంగారు తాపడం రేకులకు ప్రధానార్చకులు నల్లందీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. గంగాజలంతో సంప్రోక్షణ చేశారు. గతంలో ధ్వజస్తంభం, గర్భాలయ ముఖద్వారం పనులు చేపట్టిన చెన్నైకి చెందిన మెసర్స్ స్మార్ట్ క్రియేషన్ సంస్థకే ఈ తాపడం పనులను అప్పగించారు.
ఇందుకు రూ.3.90 కోట్లు దేవస్థానమే చెలిస్తోంది. గాలి గోపురం కోసం 10,500 చదరపు అడుగుల రాగి రేకులకు బంగారు తాపడం పనులు చేయాల్సి ఉంది. 2025 మార్చిలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేలోపు బంగారు తాపడం పనులను పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వామివారిని దర్శించుకున్నారు.
Updated Date - Nov 21 , 2024 | 05:20 AM