Health Standards: ప్రైవేటు ఆస్పత్రుల ‘ఛీ’టింగ్!
ABN, Publish Date - Oct 21 , 2024 | 04:23 AM
వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారా? అయితే, జర జాగ్రత్త.. మీరు వెళ్లే ఆస్పత్రిలో అర్హులైన వైద్యులున్నారో లేదో తెలుసుకుని వెళ్లండి! అక్కడ పరీక్షలు చేసే ల్యాబ్‌లో నిజంగా నిపుణులున్నారో లేదో వాకబు చేయండి.
రిజిస్టర్డ్ వైద్యులు, అనుమతులు లేకుండానే వైద్యం
కనీస ప్రమాణాలూ కరువు.. ప్రజారోగ్యంతో చెలగాటం
అగ్నిమాపక నిబంధనలను పట్టించుకోని నిర్లక్ష్యం
అల్లోపతివైద్యం చేసేస్తున్న ఆయుష్ వైద్యులు
టాస్క్‌ఫోర్స్ దాడులతో వెలుగులోకొచ్చిన వాస్తవాలు
హైదరాబాద్‌లో 10 శాతం ఆస్పత్రులకు నోటీసులు
సిద్దిపేట జిల్లాలో 35 దవాఖానాలకు జరిమానా
నిబంధనలు పాటించని 97 ఆస్పత్రుల మూసివేత
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారా? అయితే, జర జాగ్రత్త.. మీరు వెళ్లే ఆస్పత్రిలో అర్హులైన వైద్యులున్నారో లేదో తెలుసుకుని వెళ్లండి! అక్కడ పరీక్షలు చేసే ల్యాబ్‌లో నిజంగా నిపుణులున్నారో లేదో వాకబు చేయండి. అసలు ఆ ఆస్పత్రిలు కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో ఆరా తీశాకే వెళ్లండి. లేకుంటే ఉన్న జబ్బుకు తోడు కొత్త రోగాలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే.. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. రిజిస్టర్డ్ వైద్యులు లేకుండానే రోగులకు వైద్యం చేసేస్తున్నాయి.
కనీస ప్రమాణాలను పాటించకుండా.. క్లినికల్ ఎస్టాబ్లి్‌షమెంట్ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నాయి. ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై సర్కారు దృష్టి సారించింది. క్లినికల్ ఎస్టాబ్లి్‌షమెంట్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా.. ప్రైవేటు ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లి్‌షమెంట్ చట్టాన్ని ఫాలో అవుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు వైద్య శాఖ ఈ ఏడాది జూన్‌లో ఏడు టాస్క్‌ఫోర్స్ కమిటీలను వేసింది. కొద్ది రోజులుగా ఆ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కమిటీలు వైద్య, ఆరోగ్య శాఖకు అందించిన నివేదిక ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 97 ప్రైవేటు ఆస్పత్రులకు అధికారులు తాళాలు వేశారు. 1,094 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులిచ్చారు.
327 ఆస్పత్రులకు రూ.39,76,900 మేర జరిమానాలు విధించారు. రాష్ట్రంలో అత్యధికంగా.. 2,788 ప్రైవేటు క్లినిక్కులు, ఆస్పత్రులు రాజధాని హైదరాబాద్‌లో ఉన్నాయి. వీటిలో నిబంధనలు, కనీస ప్రమాణాలు పాటించని 242 ఆస్పత్రులకు వైద్యశాఖ నోటీసులు జారీ చేసింది. వాటిలోనూ రెండు ఆస్పత్రులను మూసివేసింది. 52 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులిచ్చారు. షోకాజ్ నోటీసులందుకున్న ఆస్పత్రుల్లో కొన్ని అసలు రిజిస్ట్రేషనే చేయించుకోలేదు. మరికొన్ని.. ఆయుష్ వైద్యుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మిగతా జిల్లాల విషయానికొస్తే.. ఆదిలాబాద్ జిల్లాలో 45ు ఆస్పత్రులు నిబంధనలు పాటించట్లేదు. ఆ జిల్లాలో అనుమతులు పునరుద్ధరించుకోని 60 ఆస్పత్రులకు అధికారులు నోటీసులిచ్చారు. మరో 3 ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ లేండానే నడుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో వైద్యశాఖ అనుమతి లేకుండా నడుస్తున్న 19 ఆస్పత్రులకు తాళాలు వేశారు. ఆ జిల్లాలో 593 ఆస్పత్రులుండగా.. వాటిలో నిబంధనలు పాటించని56 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు. 38 ఆస్పత్రులకు రూ.3.18 లక్షల జరిమానా విఽధించారు.
ఇష్టారాజ్యంగా..
రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రోగుల చికిత్సకయ్యే వ్యయ పట్టికలను ప్రదర్శించడం లేదు. కొన్నిచోట్ల ఆయుష్ వైద్యులే అల్లోపతి వైద్యం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా ఆస్పత్రులు అగ్నిమాపక నిబంధనలను పాటించడం లేదు. అలాగే ఆస్పత్రుల యాజమాన్యం మారినప్పటికీ ఆ విషయాన్ని వైద్యశాఖకు తెలియజేయడం లేదు. కొన్ని ఆస్పత్రులు పేరుకు స్పెషాలిటీ ఆస్పత్రులుగా చలామణీ అవుతున్నా.. అక్కడ రిజిస్టర్డ్ డాక్టర్స్ లేకపోవడం (ఎంబీబీఎస్ పూర్తయినా వైద్యమండలి వద్ద రిజిస్టర్ చేసుకోనివారు వైద్యం చేస్తున్నారు), జీవ వ్యర్థాల నిర్వహణ విధానాలను సరిగా పాటించకపోవడం, తమ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్స్ ఉన్నట్లు చూపి.. ఎంబీబీఎస్ డాక్టర్స్‌తోనే రోగులకు చికిత్స అందించడం, మెటర్నిటీ ఆస్పత్రులుగా అనుమతులు పొంది మిగతా అన్ని రకాల వైద్య సేవలందించడం వంటివాటికి పాల్పడుతున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది.
ఇక జగిత్యాల, సిరిసిల్ల లాంటి జిల్లాల్లో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులైతే వందశాతం సిజేరియన్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. పలు ఆస్పత్రుల్లోని ల్యాబుల్లో కనీస సౌకర్యాలు, ప్రమాణాలు పాటించట్లేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రియాంక ఆస్పత్రిలో ఓ గర్భిణీ ఈ ఏడాది జూన్ 2న మరణించింది. అక్కడ గైనకాలజిస్టు లేకున్నా.. పారామెడికల్ సిబ్బందే ఆమెకు చికిత్స అందించినట్లు తేలింది. దాంతో ఆ ఆస్పత్రిని సీజ్ చేయడంతోపాటు రూ.50 వేలు జరిమానా కూడా విఽధించారు.
మరికొన్ని..
మేడ్చల్ జిల్లాలో 2664 ఆస్పత్రులు ఉండగా.. వాటిలో రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తున్న 57 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు. రూ.4 లక్షల పెనాల్టీ వేశారు. మరో 18 ఆస్పత్రుల అనుమతులను రద్దు చేశారు.
సిద్దిపేట జిల్లాలో 240 ఆస్పత్రులుండగా.. 36 ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తున్నాయి. 49 ఆస్పత్రుల్లో అర్హులైన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది లేరు. 35 ఆస్పత్రులకు రూ.3లక్షల జరిమానా విఽధించారు. మరో మూడింటిని మూసేశారు.
భద్రాద్రి జిల్లాల్లో 381 ఆస్పత్రులుంటే వాటిలో 28 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు. వీటిలో 12 ఆస్పత్రులకు రూ.91,900 జరిమానా విఽధించగా, ఒక ఆస్పత్రిని మూసేశారు.
హన్మకొండలోని 699 హాస్పిటల్స్‌లో.. 83 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు. 11 హాస్పిటల్స్‌కు రూ.63 వేలు జరిమానా వేశారు. 14 ఆస్పత్రులను యాజమాన్యాలే మూసేశాయి.
జగిత్యాలలో 263 ఆస్పత్రులుండగా.. వాటిలో 41 హాస్పిటల్స్‌కు నోటీసులిచ్చారు. ఒక ఆస్పత్రిని మూసేశారు.
జనగామలో 122 ఆస్పత్రులకుగాను.. పదిహేడింటికి నోటీసులిచ్చారు. రెండింటి లైసెన్స్‌లను రద్దు చేశారు. భూపాలపల్లిలో 46కుగాను.. 12 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు.
కరీంనగర్ జిల్లాలో 554కు..162 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు. ఏడింటికి రూ.3లక్షల జరిమానా వేశారు. 9ఆస్పత్రులు మూతపడ్డాయి.
ఖమ్మంలో 520 ఆస్పత్రులకుగాను.. ఐదింటికి నోటీసులివ్వగా, మరో ఐదింటిని మూసేశారు. ములుగులో పదిహేనింటికి నోటీసులిచ్చారు.
నల్గొండలో 555 ఆస్పత్రులుంటే పదింటికి షోకాజ్ నోటీసులిచ్చారు. ఆరింటికి రూ.1.07 లక్షల ఫైన్ వేశారు. ఐదింటిని మూసేశారు.
నారాయణపేటలో 135 ఉంటే ఐదింటికి నోటీసులిచ్చారు. నిర్మల్‌లో 101 ఆస్పత్రులకుగానుపదింటికి నోటీసులిచ్చారు. మరో మూడు ఆస్పత్రులకు ఫైన్ వేశారు.
పెద్దపల్లి జిల్లాలో 137 ఆస్పత్రులకుగాను.. 26 హాస్పిటల్స్‌కు నోటీసులివ్వగా, మరో నాలుగింటిని మూసేశారు.
సిరిసిల్ల జిల్లాలో 138 ఆస్పత్రులకుగాను 39 హాస్పిటల్స్‌కు నోటీసులిచ్చారు. మూడింటిని మూసేశారు.
సూర్యాపేటలో 477 ఆస్పత్రులకుగాను.. వాటిలో రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న 15 ఆస్పత్రులకు రూ.5.08 లక్షల జరిమానా వేశారు. మరో ఎనిమిదింటిని మూసివేశారు.
వరంగల్ జిల్లాలో 217 హాస్పిటల్స్‌కుగాను.. 40 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు. యాదాద్రి జిల్లాలో 14 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు.
Updated Date - Oct 21 , 2024 | 04:23 AM